మనకు గ్రహణం కనిపించినా, కనిపించకపోయినా, అది పాక్షికంగానే సంభవించినా, విదేశాలకు మాత్రమే పరిమితం అయినా, దాని ప్రభావం మాత్రం తప్పకుండా మన మీద ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం, రవి, చంద్రులతో రాహు, కేతువులు కలిసినప్పుడు గ్రహణాలు సంభవిస్తాయి. ప్రస్తుతం సూర్య గ్రహణం పాక్షికంగా కన్యారాశిలో చోటు చేసుకుంటున్నందువల్ల మేషం, కన్య, తుల, మీన రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, ఉత్తరా భాద్ర, రేవతి నక్షత్రాల వారు కూడా జాగ్రత్తలు పాటించడం మంచిది. సాధారణంగా వృత్తి, ఉద్యోగాల పరంగా చిక్కులు ఎదుర్కోవడం, ప్రాభవం తగ్గడం, శారీరకంగా, మానసికంగా బలహీనపడడం, నేత్ర సంబంధమైన వ్యాధులు రావడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆదిత్య హృదయం పఠించడం వల్ల గ్రహణ ప్రభావం బాగా తగ్గుముఖం పడుతుంది. అయితే, నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి స్తోత్రాలను లేదా విష్ణు సహస్ర నామాన్ని చదువుకోవడం వల్ల గ్రహణ ప్రభావం తొలగి పోతుంది. దీని ప్రభావం వివిధ రాశుల మీద ఎలా ఉండబోతున్నదీ ఇక్కడ పరిశీలిద్దాం.