- Telugu News Photo Gallery Spiritual photos Shani Dosha not to have bad effects on these zodiac signs Telugu Astrology
Shani Dosha: శని దోషం ఉన్నా పెను ఊరట.. ఆ 5 రాశుల వారికి వచ్చే రెండున్నరేళ్లు అదృష్ట యోగం పట్టినట్టే..
సాధారణంగా శని స్వక్షేత్రంలో ఉన్నా లేక ఉచ్ఛ స్థానం (తులా రాశి)లో ఉన్నా ఏ రాశి వారినీ ఎక్కువగా పీడించడం జరగదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం శని కుంభరాశిలో సంచరిస్తున్నందువల్ల పైన పేర్కొన్న రాశుల వారికి కష్టనష్టాలను ఇవ్వకపోగా వీలైనంతగా అదృష్ట యోగాన్ని కలిగించే అవకాశం ఉంది.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Apr 17, 2023 | 5:57 PM

జనవరి 18న శని కుంభ రాశిలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశులకు శని దోషం ప్రారంభం అయింది. ఈ రాశులు కర్కాటకం, వృశ్చికం, మకరం, కుంభం, మీనం. వీటిలో మకర, కుంభ రాశులకు ఏలినాటి శని కొనసాగుతుండగా.. కర్కాటకం, వృశ్చికం, మీన రాశులకు శని దోషం ప్రారంభం అయింది. కర్కాటక రాశి వారికి అష్టమ శని, వృశ్చిక రాశి వారికి అర్థాష్టమ శని, మీన రాశి వారికి ఏలినాటి శని దోషం మొదలయ్యాయి. వాస్తవానికి ఈ దోషాల వల్ల ఈ ఐదు రాశుల వారు అష్ట కష్టాలు పడవలసి ఉంది. కానీ శని తన స్వక్షేత్రం, మూల త్రికోణ స్థానం అయిన కుంభరాశిలో ప్రవేశించినందువల్ల ఈ కష్టనష్టాలు ఆ ఐదు రాశుల వారికి దగ్గరకు కూడా రాని పరిస్థితి ఏర్పడిటం విశేషం. శనీశ్వరుడు కుంభరాశిలో 2025 జూలై వరకు ఉండటం జరుగుతుంది. అందువల్ల ఈ రాశుల వారికి రెండున్నర ఏళ్లపాటు చక్కని అదృష్టం పట్టే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి గత జనవరి 18న అష్టమ శని ప్రారంభం అయింది. అష్టమ శని అంటే అష్ట కష్టాల కాలం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే, ఈ అభిప్రాయం తప్పకుండా తారుమారు అవుతుందని చెప్పవచ్చు. అష్టమ శని కారణంగా ఈ రాశి వారికి ఆస్తికి, సంపదకు సంబంధించిన కోర్టు వివాదాలు సానుకూలంగా పరిష్కారం అయి వారసత్వ సంపద చేతికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో లేదా యాజమాన్యంతో ఏవైనా సమస్యలు ఉంటే అవి పరిష్కారం అయ్యి పురోగతికి మార్గం సుగమం అవుతుంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. లాటరీ, జూదం, ఆర్థిక లావాదేవీలు, షేర్లు వంటివి ఆర్థిక ప్రయోజనా లను కలిగిస్తాయి. వడ్డీ వ్యాపారుల సంపాదన ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. మొత్తం మీద ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తోంది. శని ప్రస్తుతం ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు. సాధారణంగా అర్ధాష్టమ శని వల్ల ఇల్లు వాకిళ్లు ఆస్తిపాస్తులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆస్తిపాస్తులు చిక్కుల్లో లేదా వివాదాల్లో ఇరుక్కునే అవకాశం కూడా ఉంటుంది. అయితే, శని తన స్వక్షేత్రంలో సంచరిస్తున్నందువల్ల స్థిర చరాస్తులకు పూర్తి రక్షణ, భద్రత లభించే అవకాశం ఉంది. ఆస్తి సంబంధమైన కోర్టు వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవటం ఖాయమని చెప్పవచ్చు. కొత్తగా ఇల్లు గానీ, స్థలం గానీ, పొలం గానీ కొనే సూచనలు ఉన్నాయి. రైతులకు పంటలు బాగా పండి సంపద పెరుగుతుంది. పాత ఇళ్ళను మరమ్మతు చేసుకోవడం జరుగుతుంది. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అయ్యి, విభేదాలు, వివాదాలు, అపార్ధాలు తొలగిపోయి సామరస్య వాతావరణం ఏర్పడుతుంది.

మకర రాశి: ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని కొనసాగుతోంది. శనికి మకర, కుంభరాశులు స్వక్షేత్రాలు. ఏలినాటి శని సమయంలో ఈ రాశులను శని పీడించడం చాలా తక్కువగా జరుగుతుంది. మొత్తానికి శని కుంభరాశి ప్రవేశంతో మకర రాశి వారికి కుటుంబం వృద్ధి చెందటం, పిల్లలు అభివృద్ధిలోకి రావడం, ఇంట్లో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడటం వంటివి తప్పనిసరిగా జరుగుతాయని చెప్పవచ్చు. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరిగే అవకాశం ఉంది. రెండు మూడు ఆదాయ మార్గాలు చేతికి అంది వస్తాయి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి.

కుంభ రాశి: ఈ రాశి మీద నుంచి ప్రస్తుతం శని సంచారం జరుగుతోంది. సాధారణంగా ఇటువంటి పరిస్థితిలో ఉద్యోగం పోవటం, వ్యాపారంలో నష్టం రావడం ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం, అవమానాలు ఎదురు కావటం ప్రతిష్ట దెబ్బతినడం, ఏ పనీ కలసి రాకపోవడం, అనారోగ్యాలు పీడించడం వంటివి జరుగుతుంటాయి. అయితే, ఇటువంటివి ఏవీ జరగకపోగా ఇవన్నీ తలకిందులు అయ్యే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనేక ఉద్యోగ అవకాశాలు ఈ రాశి వారికి అంది వస్తాయి. చాలాకాలంగా పీడిస్తున్న కొన్ని వ్యక్తిగత సమ స్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ పరంగానే కాక ఆర్థిక పరంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు, పని భారం పెరిగినప్పటికీ దీర్ఘకాలంలో వీటివల్ల ప్రయోజనం ఉంటుంది. అధికారులు లేదా యాజమాన్యాల నుంచి ఆదరణ లభిస్తుంది.

మీన రాశి: గత జనవరి 18 నుంచి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అయింది. ఈ రకమైన శని దోషం వల్ల ఈ రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, విపరీతమైన ఒత్తిడి, శ్రమ, తిప్పట, దగ్గర వారు దూరం కావడం, బంధువులు కుటుంబ సభ్యులతో విభేదాలు అపార్ధాలతో అవస్థలు పడాల్సి ఉంటుంది. అయితే, ఇందులో ఏ ఒక్కటి జరిగే అవకాశం లేదు అని చెప్పవచ్చు. ఈ రాశి వారిలో ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. మనసు లోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎక్కువగా శుభవార్తలు వినడం, శుభకార్యాలలో పాల్గొనడం వంటివి జరుగుతాయి. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. శుభకార్యాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. వ్యసనాల నుంచి బయటపడతారు. సంతానానికి ఆస్తిపాస్తులు రాసి ఇవ్వడం జరుగుతుంది.





























