- Telugu News Photo Gallery Spiritual photos Rajaraju Yogam: 5 Zodiac Signs to Shine Like Kings Till Dec 17 Details in Telugu
Raraju Yoga: గ్రహాల అనుకూలత.. నెల రోజులు ఈ రాశుల వారికి రారాజు యోగం..!
జ్యోతిషశాస్త్రం ప్రకారం వక్ర గ్రహాలు ‘రాజు కంటే బలవంతులు’. ప్రస్తుత గ్రహ సంచారంలో శని, గురు, బుధ గ్రహాలు పూర్తి స్థాయిలో వక్రించి ఉన్నాయి. ఈ గ్రహాలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం కలిగింది. ఈ నెల(నవంబర్) 16 నుంచి రవి గ్రహం తనకు మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. కుజ, శుక్రులు తమ తమ సొంత రాశుల్లో బలంగా ఉన్నారు. ఈ రకమైన గ్రహాల అనుకూలత వల్ల కొన్ని రాశుల వారు డిసెంబర్ 17 వరకు రారాజుల్లా ఒక వెలుగు వెలగబోతున్నారు. వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశులకు ఈ రారాజు యోగం పట్టబోతోంది.
Updated on: Nov 15, 2025 | 4:43 PM

వృషభం: ఈ రాశికి శని, గురు, కుజ, రవి, బుదులతో పాటు రాశ్యధిపతి శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెల 16 నుంచి ఈ రాశివారు నక్కతోకను తొక్కబోతున్నారు. వీరికి ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఉన్నత పదవి లభించే అవకాశం ఉన్న సంస్థలోకి మారే సూచనలు కూడా ఉన్నాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. ఒక సంపన్నుడి స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి.

కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టి ఉండడం, చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమంలో రవి, బుధ, కుజులు కలిసి ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారు ఈ నెలంతా చక్రం తిప్పే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారం చేపట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. వీరి దశ తిరుగుతుంది.

తుల: ఈ రాశికి షష్ట స్థానంలో శని సంచారమే ఒక రాజయోగం కాగా ధన స్థానంలో ధనాధిపతి కుజుడు, భాగ్యాధిపతి బుధుడు, లాభాధిపతి రవి కలవడం మరో రాజయోగం. ఇది కాక, దశమ స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం మరో విశేషం. ఈ రాశివారికి తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి. మహా భాగ్య యోగాలు కలుగుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ప్రతి విషయంలోనూ ఉచ్ఛ స్థితికి చేరుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక వెలుగు వెలుగుతారు.

వృశ్చికం: ఈ రాశిలో రాశ్యధిపతి కుజుడు, దశమాధిపతి రవి, లాభాధిపతి బుధుడు కలవడంతో పాటు భాగ్య స్థానం నుంచి ఉచ్ఛ గురువు వీక్షణ కూడా లభించడం వల్ల ఈ రాశివారు అన్ని విధాలా ఉచ్ఛ స్థితికి ఎదుగుతారు. రాజపూజ్యాలు కలుగుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా వివిధ మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. వీరి మాటకు, చేతకు తిరుగుండదు.

మకరం: ఈ రాశికి రాశ్యధిపతి శనీశ్వరుడు తృతీయంలో, ఉచ్ఛ గురువు సప్తమంలో, స్వస్థాన శుక్రుడు దశమంలో, బుధ, కుజ, రవులు లాభ స్థానంలో ఉండడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యమైన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారు ఒక ఉన్నతాధికారిగా, ఒక ప్రముఖుడుగా, ఒక సంపన్నుడుగా ఎదిగే అవకాశం ఉంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు లభిస్తుంది.



