- Telugu News Photo Gallery Spiritual photos Mars Transit Leo 2023: Effects of Mangal Gochar in Simha Rashi July 2023 for all zodiac signs
Kuja Gochar 2023: సింహ రాశిలోకి కుజ గ్రహ సంచారం.. వారి ఆదాయం అనూహ్యంగా పెరుగుతుంది.. ! మీ రాశికి ఎలా ఉందంటే..?
Mars Transit in Leo 2023: ప్రస్తుతం కుజ గ్రహం సింహ రాశిలో ప్రవేశించింది. అది ఈ రాశిలో ఆగస్టు 18 వరకు, అంటే మరో 48 రోజులపాటు కొనసాగుతుంది. కుజ గ్రహానికి సింహరాశి దాదాపు ఉచ్ఛ క్షేత్రం కింద పరిగణిస్తారు. ప్రస్తుతం తన నీచరాశి అయిన కర్కాటక రాశి నుంచి తన మిత్ర క్షేత్రమైన సింహ రాశిలోకి ప్రవేశించినందువల్ల కుజ గ్రహానికి విపరీతమైన బలం పడుతుంది.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Jul 01, 2023 | 12:57 PM

ప్రస్తుతం కుజ గ్రహం సింహ రాశిలో ప్రవేశించింది. అది ఈ రాశిలో ఆగస్టు 18 వరకు, అంటే మరో 48 రోజులపాటు కొనసాగుతుంది. కుజ గ్రహానికి సింహరాశి దాదాపు ఉచ్ఛ క్షేత్రం కింద పరిగణిస్తారు. ప్రస్తుతం తన నీచరాశి అయిన కర్కాటక రాశి నుంచి తన మిత్ర క్షేత్రమైన సింహ రాశిలోకి ప్రవేశించినందువల్ల కుజ గ్రహానికి విపరీతమైన బలం పడుతుంది. దీనివల్ల వివిధ రాశుల వారికి జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే సింహరాశిలో ఉన్న కుజ గ్రహాన్ని కుంభరాశిలో స్వక్షేత్రంలో ఉన్న శనీశ్వరుడు వీక్షించడం వల్ల వాహన ప్రమాదాలు జరగడానికి, వ్యక్తిగత రహస్యాలు, అక్రమ కార్యకలాపాలు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది.

మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజ గ్రహం ప్రస్తుతం తన మిత్ర క్షేత్రంలో ప్రవేశించినందువల్ల జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు తప్పకుండా చోటు చేసుకోవడం జరుగుతుంది. మొండి ధైర్యం ఏర్పడటం, ఆత్మవిశ్వాసం పెరగటం, గట్టి పట్టుదల ఏర్పడటం, చొరవ పెరగటం, అకస్మాత్తుగా అధికారం చేపట్టడం, మనసులోని కోరికలు నెరవేరటం, ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కావడం, కొత్త ప్రయత్నాలు సఫలం కావడం వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సాధారణ స్థితిలో ఉన్న జీవితం అకస్మాత్తుగా మార్పులకు లోనవుతుంది. జీవితంలో తప్పకుండా శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి.

వృషభం: ఈ రాశి వారికి కుజ గ్రహ రాశి మార్పు వల్ల తప్పకుండా మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరటం జరుగుతుంది. గృహ వాహన సౌకర్యాలు ఏర్పడటం, ఆస్తి పెరగటం, జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి రావడం, ఉద్యోగంలో హోదా పెరగటం వంటివి జరిగే అవకాశం ఉంది. అయితే వాహన ప్రమాదాలకు, కుటుంబంలో టెన్షన్లు పెరగటానికి, కొద్దిపాటి అనారోగ్యాలకు కూడా అవకాశం ఉంటుంది. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. వ్యసనాలకు కూడా అవకాశం ఉంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, కుటుంబ పెద్దలు, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి.

మిథునం: ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినప్పటికీ అది తప్పకుండా సఫలం అవుతుంది. వ్యక్తిగత జీవితంలో చొరవ పెరుగుతుంది. పట్టుదల, యాంబిషన్ హద్దులు దాటుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా, ఆర్థికంగా మరింతగా ఎదగటానికి కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరగడానికి, విస్తరించడానికి అవకాశం ఉంది. అయితే వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత రహస్యాలు బయటపడే సూచనలు కూడా ఉన్నాయి. ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశి వారికి ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా స్థిరత్వం లభిస్తుంది. మాట చెల్లుబాటు అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబపరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించి శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఒకటి రెండు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

సింహం: ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాలపరంగా పురోగతి సాధించడానికి ఇది చాలా మంచి సమయం. మొండి ధైర్యంతో, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో, దూకుడుతనంతో వ్యవహరించడం జరుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలకు విభేదాలకు అవకాశం ఉంది. కొందరితో తెగతెంపులు చేసుకునే సూచనలు కూడా ఉన్నాయి. టెన్షన్లు, ఒత్తిడికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. కుటుంబ పరంగా శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి. అయితే, వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం.

కన్య: వ్యయ స్థానంలో కుజ ప్రవేశం వల్ల డబ్బు, ఆరోగ్యం, ప్రయాణాలు వంటి విషయాలలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికపరంగా మోసపోవటం లేదా నష్టపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ప్రయాణాలలో ప్రమాదాలు జరగటం లేదా విలువైన వస్తువులు పోగొట్టుకోవడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం నుంచి కోరుకునే అవకాశం ఉంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆస్తి కలిసి రావడం జరుగుతుంది. ఆస్తి విలువ ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. దూరప్రాంతం నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందుకుంటారు.

తుల: అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. పరిసరాలు, చుట్టుపక్కల వాతావరణం సానుకూలంగా మారిపోతాయి. తలపెట్టిన ప్రతి ప్రయత్నం సఫలం అవుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మారిపోతుంది. ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ జీవితంలో అదృష్ట యోగం పడుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కోలు కోవటం జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరటం, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. అయితే తోబుట్టువులతో సమస్యలు తలెత్తవచ్చు. అపార్ధాలు చోటు చేసుకోవడం, ఆస్తి వివాదాలు ప్రారంభం కావడం వంటివి జరగవచ్చు.

వృశ్చికం: ఈ రాశి వారికి ఉద్యోగ స్థానంలో రాశి నాధుడైన కుజ గ్రహం ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగాలు బాగా రాణించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యో గంలో ప్రమోషన్ లభించవచ్చు. అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదాలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే, స్వల్ప అనారోగ్యాలకు, వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. రియల్ ఎస్టేట్ లిక్కర్ బిజినెస్ రాజకీయాలు సామాజిక సేవ వంటి రంగాలలో ప్రవేశించదలచుకున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం.

ధనుస్సు: కుజ గ్రహం సింహరాశి ప్రవేశంతో ఈ రాశి వారికి మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. లాటరీ వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతంగా నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల పరిస్థితి ఎంతగానో సానుకూలపడుతుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టే అవకాశం కూడా ఉంది. సర్వత్రా గౌరవ మర్యాదలు, ఆదరాభిమానాలు పెరుగుతాయి. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార వ్యవహారాలలో ముందుకు దూసుకు వెళతారు. కుటుంబ పరిస్థితి పిల్లల పరిస్థితి ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాలతో జాగ్రత్త. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దు.

మకరం: గృహ, వాహన సంబంధమైన సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ పరంగా కొన్ని అనవసర బాధ్యతలను తలకెత్తుకోవడం జరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడు తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలి తాలను ఇచ్చే అవకాశం ఉంది. జీవిత భాగ స్వామితో కొద్దిగా ఎడబాటు ఏర్పడే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి పురోగతి చెందడానికి అవకాశం ఉంది. కొద్దిరోజులపాటు వాగ్దానాలు చేయడం హామీలు ఉండటం వంటివి పెట్టుకోవద్దు. మనసులోని రహస్యాలు కొద్దిగా బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి.

కుంభం: వృత్తి, ఉద్యోగాలపరంగా ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశం ఉంది. గట్టి పట్టుదలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు కలసి వస్తాయి. అధికార యోగం పడుతుంది. వృత్తి నిపుణులకు గుర్తింపు లభించడంతోపాటు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలకు ప్రారంభిస్తారు. మీ ఆలోచనలు, నిర్ణయాలు నెమ్మది మీద కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. బంధుమిత్రుల నుంచి అపనిందలు వచ్చే అవకాశం ఉంది.

మీనం: శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఒకటి రెండు మోసాలకు నష్టాలకు గురయ్యే సూచనలు ఉన్నాయి. జీవితం చాలా వరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఖర్చులను తగ్గించు కుంటారు. కొన్ని ముఖ్యమైన పనులు అతి వేగంగా పూర్తి అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. అధికా రులు లేదా యజమానుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత రహస్యాలు బయటపడే సూచనలు ఉన్నాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ జీవితం ఆనందోత్సాహాలతో సాగిపోతుంది. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.





























