- Telugu News Photo Gallery Spiritual photos Janmashtami 2025: Why 56 dishes offered to Lord Krishna? Know the mythological story behind the feast
Janmashtami 2025: జన్మాష్టమి రోజున 56 రకాల పదార్ధాలను నైవేద్యం సమర్పిస్తారు.. దీని వెనుక పురాణ కథ ఏమిటంటే..
శ్రావణ మాసంలో రాఖీ పండగ తర్వాత వచ్చే పండగ శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఈ రోజున బాల గోపాలుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉట్టి కొట్టే వేడుకని కూడా జరుపుకుంటారు. అంతేకాదు జన్మాష్టమి రోజున శ్రీ కృష్ణుడికి 56 రకాల నైవేద్యాలను సమర్పించే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం వెనుక ప్రత్యేకమైన, మనోహరమైన కథ ఉంది. ఆ పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం..
Updated on: Aug 09, 2025 | 4:40 PM

భారతదేశంలోని గల్లీ గల్లీలో కూడా జన్మాష్టమి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. శ్రీ కృష్ణుని జన్మదినం రోజున దేవాలయాలు, ఇళ్లలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజలో అత్యంత ప్రత్యేకంగా నిలుస్తుంది. 56 రకాల ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పించడం. అవును జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి 56 రకాల రుచికరమైన వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా ఇన్ని రకాల ఆహార పదార్ధాలను ఎందుకు సమర్పిస్తారో తెలుసా.. ఈ అద్భుతమైన సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథను గురించి తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం: ఒకసారి బ్రజ్ ప్రజలు ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక గొప్ప పూజకు సిద్ధమవుతున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని బాల గోపాల కృష్ణుడు తన తండ్రి నందుడిని అడిగాడు. ఇంద్రుడు వర్షాలకు అదిదేవుడు. కనుక అతని కరుణ కోసం.. ఇంద్రుడిని పూజించడం వలన మంచి వర్షాలు కురుస్తాయని.. మంచి పంటలు పండుతాయని నందుడు చెప్పాడు.

కృష్ణుడు ఇంద్రుడికి బదులుగా గోవర్ధన పర్వతాన్ని పూజించాలని ప్రజలకు చెప్పాడు. ఎందుకంటే గోవర్ధన గిరి మనకు పండ్లు, కూరగాయలు, జంతువులకు మేతను ఇస్తుందని చెప్పాడు. కృష్ణుడి చెప్పడంతో గోకులంలోని ప్రజలందరూ గోవర్ధన పర్వతాన్ని పూజించారు.

దీనితో ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. దీంతో గోకులంలో భారీ వర్షం కురిపించాడు. గ్రామంలో వరద లాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజలను రక్షించడానికి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి.. తన గోటిపై నిలిపి వర్షం నుంచి గోకుల వాసులను రక్షించేందుకు గొడుగుగా పట్టాడు. చిటికెన వేలుపై నిలబడిన గోవర్ధన పర్వతం కింద గ్రామస్తులు, జంతువులు, పక్షులు సురక్షితంగా ఉన్నాయి. ఇలా కృష్ణుడు ఏడు రోజుల పాటు పర్వతాన్ని ఎత్తి నిలబడ్డాడు.

ఏడు రోజుల తర్వాత ఇంద్రుడి కోపం తగ్గి వర్షం ఆగిపోయినప్పుడు.. ఆ ఏడు రోజుల్లో కృష్ణుడు ఏమీ తినలేదని గోకుల వాసులు అనుకున్నారు. కృష్ణుడి తల్లి యశోద .. తన కన్నయ్యకు రోజుకు ఎనిమిది సార్లు ఆహారాన్ని తినిపించేది

ఏడు రోజులుగా తమ కొడుకు ఆకలితో ఉండడాన్ని చూసిన తల్లి యశోద, గోకుల వాసులు అందరూ కలిసి మొత్తం 56 రకాల వంటకాలను తయారు చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టారు. అప్పటి నుంచి జన్మాష్టమి నాడు కృష్ణుడికి 56 భోగములను సమర్పించడం ఆచారంగా మారింది.

56 రకాల ఆహార పదార్ధాలలో ఏమి ఉంటాయంటే .. చప్పన్ భోగ్‌లో స్వీట్లు, పండ్లు, తృణధాన్యాలు, పానీయాలు, పాలతో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్ధాలున్నాయి. సాంప్రదాయ ఆహారం జాబితాలో వెన్న, చక్కెర మిఠాయి, కోవా, లడ్డు, రబ్రీ, పూరీ, కచోరి, హల్వా, కిచిడి, సీజనల్ పండ్లు, పానీయాలు వంటి అనేక వస్తువులు ఉంటాయి.




