- Telugu News Photo Gallery Spiritual photos History of Sri Sanaischara Swamy Temple in Narasimgolu Prakasam District
Shani Saturn Temple: శని, శివుడు కొలువైన ఆలయం.. పెళ్లి కానివారు శనిత్రయోదశి రోజున పూజలు చేస్తే.. వివాహయోగ్యం..
శనీశ్వరుడి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందట. శనీశ్వరుడి వల్ల బాధలు పడేవారు చాలా ఎక్కువగా ఉంటారని చెబుతుంటారు. శనీశ్వరుడి గ్రహం అంటే అందరికీ చెప్పలేని భయం. శనీశ్వరుడి కనికరం లేనివాడనీ, మనుషుల్ని పట్టుకుని పీడిస్తాడనీ అనుకుంటారు. అయితే అదే శనీశ్వరుడికి ఆలయాలు కట్టి పూజలు చేసి కోర్కెలు కోరుకునే భక్తులు కూడా ఉన్నారు. అరుదుగా ఉండే ఇలాంటి శనిదేవాలయాల్లో పూజలు చేసే భక్తులకు శనివారం రోజు భక్తుల హడావిడికి అంతే ఉండదు.
Updated on: Jul 22, 2023 | 4:13 PM

ప్రకాశంజిల్లా జరుగుమల్లి మండలం నర్శింగోలు గ్రామంలోని ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయం మహిమాన్వితాలకు నెలవుగా భాసిల్లుతోంది. ఒంగోలు నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య ధామంలో శనీశ్వరుడు లింగరూపంలో కొలువై భక్తుల కష్టాలను కడతేరుస్తున్నాడు.

శనిదేవుడు ఈశ్వరునిలో మమేకమైన అత్యంత అరుదైన ఆలయంగా ఈ ఆలయాన్ని చెబుతారు. శని, శివుడు, ఇరుదేవతలు జంటగా కొలువుదీరిన ఆలయమిది. అగస్త్యమహర్షిచే ప్రతిష్ఠితమైన ఈ ఆలయం అత్యంత పురాతనమైనదిగా చెబుతారు. ఈ ఆలయంలో క్రమేణ వివిధ ఉపాలయాలు నిర్శించారు.

ఈ ఏడాది శనివారం రోజున మహాశివరాత్రి, శని త్రయోదశి కలిసి రావడంతో నర్శింగోలు శనీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

శని త్రయోదశి ఎన్నడూ లేని విధంగా భక్తులు పోటేత్తారు. అలాగే ప్రతి శనివారం ఈ దేవాలయానికి భక్తులు విపరీతంగా వస్తారు. శనీశ్వరునికి తైలాభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. అనంతరం శనీశ్వర ఆలయ ప్రాంగణంలోనే ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహిస్తారు.

ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. నర్శింగోలు శనీశ్వర ఆలయాల ప్రధాన అర్చకులు జంధ్యాల చంద్రభాస్కరశాస్త్రి ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

నర్శింగోలు శనీశ్వరాలయంలో శనిదేవుడికి పూజలు చేసి కోర్కెలు కోరుకుంటే అన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ పూజలు చేసి శని ప్రభావం నుంచి బయటపడ్డామని, తమ కుటుంబాల్లో మంచి జరిగిందని భక్తులు చెబుతున్నారు.

వివాహం కాని వారు, ఉద్యోగాలు రాని వారు, ఆర్దిక కష్టాలు ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తే శని బాధల నుంచి విముక్తి లభించి కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా శనివారం రోజున ఇక్కడ తప్పకుండా పూజలు చేయాలన్న ఉద్దేశ్యంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు.




