- Telugu News Photo Gallery Spiritual photos Ganesha Temples: know about the oldest temples of lord ganesha in india
Ganesh Temples: దేశంలో అతి పురాతన ప్రసిద్ధి గణపతి ఆలయాలు.. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ఖ్యాతి
హిందూ మతంలో పూజకు విశిష్ట స్థానం ఉంది. అనేక మంది దేవీ, దేవుళ్లను పూజిస్తారు. అయితే ఏ పూజ సమయంలోనైనా, శుభకార్యాల సమయంలోనైనా మొదటి పూజను గణపతికి చేస్తారు. విఘ్నాలు కలగకుండా పూజాదికార్యక్రమాలు జరుగుతాయని విశ్వాసం. అందుకనే హిందూ మతంలో గణేశుడిని ఆరాధించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
Updated on: Jan 30, 2024 | 8:07 AM

గణేశుడు ప్రసన్నుడైతే భక్తుల కష్టాలను, నష్టాలను దూరం చేస్తాడు. గణేశుడికి బుధవారం అంకితం చేయబడింది. అయినపప్టికీ రోజూ పూజ సమయంలో మొదటి పూజను గణేశుడికి చేస్తారు. మన దేశంలో పురాతన, ప్రసిద్ధ గణేశ దేవాలయాలున్నాయి. ఈ ఆలయాలను దర్శిస్తే భక్తుల కోరిక నెరవేరుతుందని నమ్మకం. ఈ రోజు ఆలయాలను గురించి తెలుసుకుందాం..

సిద్ధివినాయక దేవాలయం: సిద్ధివినాయక దేవాలయం గణేశుడి ఆలయాల్లో ప్రసిద్ధి ఆలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఉంది. సిద్ధివినాయకుని ఆలయాన్ని 1801లో నిర్మించారు. ఈ వినాయకుడి ఆలయం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. వినాయకున్నీ రాజకీయ, సినీ సెలబ్రెటీలతో పాటు, విదేశీ భక్తులు కూడా దర్శించుకుని పూజలను చేస్తారు. ఈ ఆలయం గణేశుడికి చెందిన అతిపెద్ద దేవాలయాలలో ఒకటి.

త్రినేత్ర గణేష్ ఆలయం: ఈ ఆలయం రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో, గణేశుడు త్రినేత్ర రూపంలో ఉన్నాడు. వినాయకుడి మూడవ కన్ను జ్ఞానానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దేశంలోని నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు త్రినేత్రుడైన వినాయకుని దర్శనం చేసుకుని తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. తనను దర్శించే భక్తుల కోరికలన్నీ వినాయకుడు తీరుస్తాడని నమ్మకం. గణేశుడు తన మొత్తం కుటుంబంతో ఈ ఆలయంలో పూజలను అందుకుంటున్నారు. ఇద్దరు భార్యలు సిద్ధి, బుద్ధి లతో పాటు ఇద్దరు కుమారులతో కలసి కొలువుదీరాడు. త్రినేత్రుడై గణేశుడు పూజలను అందుకుంటున్న ఏకైక ఆలయం ప్రపంచంలో ఇది ఒక్కటే..

ఖజ్రానా గణేష్ ఆలయం: ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంది. ఈ ఆలయం ఇండోర్‌లోని ప్రసిద్ధ దేవాలయం. ప్రతిరోజూ దాదాపు పది వేల మంది ఈ ఆలయంలో గణపతిని దర్శించుకుంటారు. భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి గణేశుడి విగ్రహం వెనుక తలక్రిందులుగా నిలబడి స్వస్తికను వేస్తె.. అతని కోరికను గణేశుడు నెరవేరుస్తాడని ఇక్కడ నమ్ముతారు. కోరికలు నెరవేరిన తర్వాత మళ్లీ స్వస్తికను నేరుగా గణేశుడి వెనుక భాగంలో గీస్తారు.

చింతామన్ గణేష్ దేవాలయం: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న చింతామన్ గణేష్ ఆలయం అతిపెద్ద గణేశ దేవాలయం. ఈ ఆలయంలో ప్రతిష్టించిన గణేష్ విగ్రహం స్వయం భూ విగ్రహంగా పరిగణించబడుతుంది. పురాతన కాలంలో గణేశుడిని చింతాహరణుడు అని పిలిచేవారట. అంటే అన్ని రకాల చింతలను తొలగించేవాడని అర్ధం. ఇక్కడ దర్శనం కోసం వచ్చే భక్తులతో నిత్యం రద్దీగా ఉంటుంది. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు దూరప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

దొడ్డ గణపతి దేవాలయం: ఈ గణపతి దేవాలయం కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని అద్భుతమైన దేవాలయాలలో ఒకటి. దొడ్డా అంటే పెద్దది. పేరుకు తగ్గట్టుగానే ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తు మరియు 16 అడుగుల వెడల్పు గల వినాయకుని విగ్రహం ఉంది.





























