- Telugu News Photo Gallery Spiritual photos Dimili Village people celebrate The Dallamma Jatara Festival in Anakapalle District
Dallamma Jatara: వెదుళ్లతో కొట్లాట..కర్రలతో చుక్క రక్తం చిందకుండా వినూత్న జాతర..చారిత్రక ఉత్సవ విశేషాలివే..!
ఆ గ్రామంలో రెండేళ్లకోసారి ఆ పండుగ. అంతా ఒక్కచోటకు చేరతారు.. గుంపులు గుంపులుగా కొట్టుకుంటారు. అదీ కూడా బలమైన వెదురు కర్రలతో..! కానీ ఏ ఒక్కరికి గాయాలు కావు.. రక్తం కారదు. అదే అక్కడి ప్రత్యేకత. ఉత్తరాంద్ర లోనే ప్రసిద్ది చెందిన వెదుళ్ల జాతర విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం..?!
Maqdood Husain Khaja | Edited By: Surya Kala
Updated on: Dec 02, 2023 | 4:53 PM

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలోని దిమిలి గ్రామం. ప్రతి రెండూలకు ఒకసారి జాతర నిర్వహించుకోవడం ఆనవాయితీ. అదే దల్లమ్మ తల్లి జాతర. జాతర సందర్భంగా వెదురు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అక్కడ ప్రత్యేకత. గుంపులు గుంపులుగా ఏర్పడి పెద్ద పెద్ద వెదురుకురాలను పట్టుకుని ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు.

దిమిలి గ్రామ శివారులో పచ్చని పంట పొలాల్లో దల్లమ్మ తల్లి ఆలయం ఉంది. ఈ జాతర సందర్భంగా తొలిత ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు.. వివిధ రాష్ట్రాలు, దేశంలో స్థిరపడిన దిమిలి గ్రామస్తులు, బంధువులంతా ఒక్క చోట చేరి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అంటున్నారు సేనపతి అప్పారావు.

జాతర వెనుక వీర మహిళ గాధ: స్వాతంత్ర సమరయోధులను అందించిన ఆ గ్రామంలో ఈ వినూత్నమైన జాతర వెనుక ఓ వీర మహిళ గాధ దాగి ఉందని అంటుంటారు ఇక్కడి జనం. పూర్వం మరాఠీ దండు గ్రామాలపై దండెత్తుకొచ్చి ప్రజల ధనమానాలను అపహరించుకు పోయే వారట. ఈ క్రమంలో దిమిలికి చెందిన ఓ బ్రాహ్మణ స్త్రీ దల్లమాంబ.. తన స్నేహితురాలతో కలిసి ఆడుకుంటుండగా మరాఠీ దండు గ్రామంపై దండెత్తారట. ఈ మరాఠీ దండు నుంచి తనను తాను కాపాడుకోవడమే కాకుండా.. గ్రామ శివారులో ఉన్న నదిలో దూకి ప్రాణత్యాగం చేసిందని అంటుంటారు. ఆ ఘటన గ్రామస్తుల్లో చైతన్యం నింపిందని అంటుంటారు గ్రామస్తులు.

చైతన్యం నింపిన ఆమె సాహసం: అప్పట్నుంచి గ్రామ ప్రజల్లో చైతన్యం పెరిగి గ్రామ ప్రజలంతా వెదురు కర్రలు పట్టుకొని మరాఠీ దండుపై ఎదురుదాడికి దిగి గ్రామస్తులు గ్రామాన్ని రక్షించుకున్నారట. ప్రజల్లో చైతన్యం నింపిన దల్లమాంబకు ఆలయం నిర్మించి.. ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దల్లమాంబ జాతరలో గ్రామంలోని మగవారంతా ప్రత్యేకంగా తెప్పించిన వెదురు కర్రలు పట్టుకొని గుంపులు గుంపులుగా చేరి వెదులళ్ళతో కొట్టుకుంటూ ఆనంద ఉత్సాహాలను పొందుతారని అంటున్నారు మరో గ్రామస్తుడు నర్సింగరావు.

కర్రలతో దాడులు కానీ: జాతరలో వెదుళ్ళ ఉత్సవం సందర్భంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. ఈ క్రమంలో ఎవరికి ఎటువంటి గాయాలు కావట. గాయపడినా.. అమ్మవారి మహిమ కారణంగా తొలగిపోతాయని గ్రామస్తుల నమ్మకం. చూసేందుకు దేవరగట్టు ఉత్సవంలా అనిపిస్తున్నా.. రక్తం చుక్క చిందకుండా జరిగడమే ఈ ఉత్సవం విశిష్టత. ఈ జాతర జరిగిన ఐదు రోజులకు అదే ప్రాంతంలో బురద ఉత్సవం జరగడం ఆనవాయితీ.





























