- Telugu News Photo Gallery Spiritual photos Bhakta kannappa birthplace Utukur, Rajampet kadapa district
Bhakta Kannappa: భక్త కన్నప్ప మావాడే అంటూ కొట్టుకుంటున్న తమిళ, కన్నడిగులు.. కడప జిల్లా వాసి అంటున్న చరిత్రకారులు
పరమ శివునికి గొప్ప భక్తుడు ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే పేరు భక్త కన్నప్ప... అయితే ఆ భక్త కన్నప్ప జన్మస్థలంపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. కనిపిస్తున్న ప్రత్యేక ఆధారాల ద్వారా భక్త కన్నప్ప జన్మస్థలం ఉమ్మడి కడప జిల్లాలోని ఊటుకూరుగా స్థానికులు చెబుతున్నారు. అంతేకాక దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఇక్కడ ఉన్నాయని వారు అంటున్నారు.
Updated on: Dec 14, 2024 | 7:36 PM

పరమశివునికి ఉన్న విశిష్ట భక్తుల్లో భక్తకన్నప్ప ఒకరు. శివుని పై తన భక్తిని తెలుపడానికి తన రెండు కళ్ళను ఇవ్వడానికి కూడా వెనకాడని భక్తకన్నప్ప చరిత్రలో నిలిచిపోయారు. అటువంటి భక్తకన్నప్ప స్వస్థలం ఏంటి చరిత్ర చెబుతున్న ఆధారాలు ఏంటి అన్నది తెలుసుకోవాలంటే అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు వెళ్ళాల్సిందే.

అన్నమయ్య జిల్లా రాజంపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో ఊటుకూరు అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో భక్తకన్నప్ప ఆలయం ఉంది. ఆలయంలో ప్రవేశించగానే ఆలయం ఎదురుగా భక్తకన్నప్ప విగ్రహం తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీమన్ అన్నమాచార్యుల విగ్రహం ఉంటుంది.

ఊటుకూరు గ్రామం భక్తకన్నప్ప స్వస్థలమే కాకుండా సాక్షాత్తు అన్నమయ్య అమ్మమ్మ ఊరు కూడా ఇదే అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. భక్తకన్నప్ప పూజలు కాళహస్తిలో చేసినప్పటికిని శివలింగాన్ని ఇక్కడ ఊటుకూరులో ప్రతిష్టించడం జరిగింది. విగ్రహం చేతిలో విల్లు బాణం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో అన్నమయ్య అమ్మమ్మ చింతాలమ్మ విగ్రహం కూడా నెలకొల్పారు.

భక్తకన్నప్ప మూఢ భక్తుడే అయినా శివ భక్తుల్లో అగ్రగణ్యుడుగా మిగిలిపోయాడు. ఆ మహనీయుల జన్మస్థలం గురించి కర్ణాటక, తమిళనాడు పండితుల మధ్య అనేక విభేదాలు ఉన్నాయి. అయితే రాజంపేట మండలం ఊటుకూరులోని భక్తకన్నప్ప ప్రతిష్టించిన శివలింగం, ఆ సమీపంలో ఉడుమూరు ఆ శివలింగానికి చెందిన శివాలయం శిథిలాలను బట్టి చూస్తే భక్తకన్నప్ప స్వగ్రామం ఊటుకూరుగా చరిత్రకారులు చెబుతున్నారు.

భక్త కన్నప్ప స్వగ్రామం ఊటుకూరు అని శివ భక్తుల చరిత్ర చెబుతుంది. ఈ విషయం తమిళ పెరియ పురాణంలో కూడా లిఖించబడింది. రాజంపేట మండలం హోలీ గ్రామానికి సమీపంలో కొండూరు అనే ఊరుంది. దీనికి తూర్పున దశశ్రుంగ పర్వతం వద్ద ఉడుమూరు అనే గ్రామం కూడా ఉంది. కొన్ని కారణాలవల్ల ఉడుమురు గ్రామస్తులు మరియు కొండూరు గ్రామస్తులు గొడవపడి ఒకరి గ్రామాలను ఒకరు ధ్వంసం చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది.

ఉడుమూరు గ్రామస్తులు తమ గ్రామాన్ని వదిలి రాజంపేట మండలం ఊటుకూరులో స్థిరపడిపోయారు. శివాలయాన్ని నిర్మించుకొని శివలింగాన్ని ప్రతిష్ట చేశారు. ఈ ఆలయంలో శివలింగాన్ని భక్తకన్నపనే ప్రతిష్టించాడని నానుడి ఉంది.

భక్త కన్నప్ప జన్మస్థలంపై అనేక విధాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ తమిళులు మాత్రం తమ వాడిని ... కన్నడిగులు కూడా భక్తకన్నప్ప తమ వాడని చెప్పుకుంటున్నారు.. అయితే కడప జిల్లాలోని సాహితీ శాస్త్రవేత్తలు మాత్రం భక్తకన్నప్ప ఊటుకూరు వాసి అని ఆధారాలతో కూడా నిరూపిస్తున్నారు. ఎంతోమంది మహనీయులకు జన్మనిచ్చిన జిల్లాలో భక్తకన్నప్ప జన్మించడం తమ అదృష్టంగా జిల్లా వాసులు భావిస్తున్నారు.
