- Telugu News Photo Gallery Raipur To Visakhapatnam 465 Kilometers Greenfield Highway Soon To Start In Andhra Pradesh
Andhra: ఏపీవాసులకు ఎగిరిగంతేసే వార్త.. ఇకపై అక్కడి 12 గంటల ప్రయాణం కాదు.. కేవలం 5 గంటల్లోనే.!
465 కిలోమీటర్ల ఈ కారిడార్‌ను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి-26 మార్గంలో 597 కిలోమీటర్ల దూరం ఉండగా, ఈ కొత్త మార్గం ద్వారా 132 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇది ఇంధన ఆదాతో పాటు రవాణా ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది.
Updated on: Dec 09, 2025 | 10:51 AM

రాయ్‌పూర్-విశాఖపట్నం మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ దూరం 12 గంటలు కాగా అది ఇప్పుడు 5 గంటలకు తగ్గనుంది. అవును, రాయ్‌పూర్-విశాఖపట్నం మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తూ, మూడు రాష్ట్రాల వాణిజ్య రూపురేఖలను మార్చేలా నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే, 12 గంటల ప్రయాణ సమయం కేవలం 5 గంటలకు తగ్గనుంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా సాగే ఈ ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే.. వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో పాటు సామాన్యులు, రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. రూ. 16,482 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 465 కిలోమీటర్ల ఈ కారిడార్‌ను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి-26 మార్గంలో 597 కిలోమీటర్ల దూరం ఉండగా, ఈ కొత్త మార్గం ద్వారా 132 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.

ఇది ఇంధన ఆదాతో పాటు రవాణా ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ కారిడార్‌తో ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని పరిశ్రమలు నేరుగా విశాఖపట్నం పోర్టుకు, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానమవుతాయి. తద్వారా ఎగుమతులు వేగవంతమై, లాజిస్టిక్స్ రంగం బలోపేతం అవుతుంది.

ఈ ప్రాజెక్టు స్థానిక రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో తమ భూమి ఎకరం రూ. 15 లక్షలు పలికేదని, ఈ హైవే పనులు మొదలయ్యాక దాని విలువ రూ. 1.5 కోట్లకు చేరిందంటూ స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ట్రక్కు యజమానులుకూడా గతంలో రాయ్‌పూర్ నుంచి విశాఖకు వెళ్లాలంటే ఒకటిన్నర రోజులు పట్టేదని, ఇప్పుడు పగలు బయలుదేరితే రాత్రికల్లా విశాఖ చేరుకోవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో డీజిల్ ఖర్చు, వాహనాల నిర్వహణ భారం తగ్గుతుందంటున్నారు. ఈ కారిడార్ ద్వారా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీలోని మారుమూల, గిరిజన ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిగే అవకాశం ఉంది.




