- Telugu News Photo Gallery MEIL's Olectra signs deal with TSRTC for 550 Electric buses, check out photos
తెలుగు రాష్ట్రాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులు రయ్, రయ్… TSRTCతో ఒలెక్ట్రా కీలక ఒప్పందం.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సులను టీఎస్ఆర్టీసీకి సరఫరా చేయనుంది.
Phani CH | Edited By: Narender Vaitla
Updated on: Mar 06, 2023 | 6:36 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్(ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సులను టీఎస్ఆర్టీసీకి సరఫరా చేయనుంది.

ఈ ఆర్డర్ దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదని ఓజీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ కేవీ. ప్రదీప్ తెలిపారు. ఎయిర్ కండీషన్డ్ ఇంటర్సిటీ కోచ్ ఎలక్ట్రిక్ బస్సులు మహానగరాలైన హైదరాబాద్, విజయవాడ మధ్య తిరుగుతాయి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.

ఇంట్రాసిటీ ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ నగర పరిధిలో తిరుగుతాయి. వీటిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఇవి పర్యావరణానికి తోడ్పటమే కాకుండా, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా అందిస్తాయి.

ఒలెక్ట్రాకు టీఎస్ఆర్టీసీ ఈ-బస్సుల ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ.. “పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తాము మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని నిర్ణయించాము. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 3,400 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నాము.” అని తెలిపారు.

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ.సజ్జనార్ మాట్లాడుతూ.. “మార్చి 2025 నాటికి హైదరాబాద్ అంతటా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. మొదటిదశలో 550 ఈ-బస్సులను కొనుగోలు చేస్తున్నాము. ఈ బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి.” అని తెలిపారు.

ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ అందుకున్న నేపథ్యంలో ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ.. “టీఎస్ఆర్టీసీ నుంచి 550 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ వచ్చింది. వీటిలో స్టాండర్డ్ ఫ్లోర్ 12 మీటర్లున్న.. 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ కోచ్ ఈ-బస్సులున్నాయి.

స్థిరమైన, ఆర్థికంగా బలమైన, పెద్ద ఎత్తున ప్రజా రవాణా చేసే టీఎస్ఆర్టీసీతో కలిసి పనిచేసే అవకాశం మరోసారి వచ్చినందుకు మేము గర్విస్తున్నాము. ఈ బస్సులను త్వరలో దశలవారీగా పంపిణీ చేస్తాము. ఈ బస్సులు నగరంలో ధ్వని, వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించి ప్రయాణికులకు స్వచ్ఛమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి” అని వెల్లడించారు.

టీఎస్ఆర్టీసీతో ఒలెక్ట్రా అనుబంధం 40 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్తో మార్చి 2019లోనే ప్రారంభమైందని ప్రదీప్ తెలిపారు. ప్రస్తుతం ఈ బస్సులు విమానాశ్రయం నుంచి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయన్నారు. నాలుగేళ్ల తర్వాత మరోసారి టీఎస్ఆర్టీసీ.. ఒలెక్ట్రాకు ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్డర్ ఇచ్చిందని ప్రదీప్ తెలిపారు.

ఇవి మెరుగైన పనితీరును అందిస్తూ.. ఫాస్ట్ ఛార్జింగ్తో సేవలు అందిస్తాయన్నారు. అధిక ప్రయాణీకుల సామర్థ్యం, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులు ప్రజారవాణా కోసం అద్భుతమైన ఎంపిక అని ప్రదీప్ పేర్కొన్నారు.





























