- Telugu News Photo Gallery How to Store Chicken Safely: How Long is it Safe in the Fridge, You Need To Know
Chicken: చికెన్‌ను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టొచ్చు.. ఈ తప్పులు చేశారో మీ పని అయిపోయినట్లే
ప్రస్తుత కాలంలో సాధారణంగా ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఉంటుంది. మిగిలిపోయిన ఫుడ్ సహా ప్రతీది దాంట్లోనే కనిపిస్తుంది. ఫుడ్‌ను రోజులకురోజులు ఫ్రిజ్‌లో పెట్టి తింటుంటారు. అయితే పచ్చి చికెన్‌ను ఎంతకాలం ఫ్రిజ్‌లో పెట్టాలి..? ఎలా పెట్టాలి..? అనే దానిపై చాలా మందికి సరైన అవగాహన ఉండదు. చికెన్ త్వరగా పాడైపోయే ఆహారం కాబట్టి దానిని అజాగ్రత్తగా నిల్వ చేస్తే సాల్మొనెల్లా, లిస్టెరియా, కాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియాల వల్ల తీవ్రమైన ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Updated on: Nov 16, 2025 | 5:30 PM

పచ్చి చికెన్ గరిష్టంగా 1 నుండి 2 రోజులు మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టడం సురక్షితం. కొనుగోలు చేసిన 48 గంటల్లోపు తప్పనిసరిగా ఉడికించాలి. ముందుగా కట్ చేసి ప్యాక్ చేసిన చికెన్‌కు ఈ సమయం ఇంకా తక్కువగా ఉంటుంది. డీప్ ఫ్రీజర్‌లో ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పచ్చి చికెన్ 9-12 నెలల వరకు తాజాగా ఉంటుంది. చిన్న ముక్కలను 6-8 నెలల వరకు సురక్షితంగా నిల్వ చేయవచ్చు.

పదే పదే ఫ్రీజింగ్: ఒకసారి డీప్ ఫ్రీజర్ నుండి తీసి పూర్తిగా ఉడికించిన చికెన్‌ను మళ్లీ ఫ్రీజర్‌లో పెట్టడం అత్యంత ప్రమాదకరం. ఇది బ్యాక్టీరియా వృద్ధిని పెంచి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. చికెన్‌ను ఎప్పుడూ గాలి చొరబడని పెట్టెలో గట్టిగా ప్యాక్ చేసి ఉంచాలి.

ఇతర ఆహారాలతో: చికెన్‌ను కూరగాయలు, పాలు, పెరుగు వంటి ఇతర వస్తువులకు దగ్గరగా ఉంచకూడదు. వంట చేయడానికి ముందు చికెన్‌ను కడగడం వల్ల బ్యాక్టీరియా నీటి తుంపర్ల ద్వారా వంటగదిలోని ఇతర ఉపరితలాలకు వ్యాపిస్తుంది. వేసవిలో కొనుగోలు చేసిన చికెన్‌ను 1-2 గంటలు బయట ఉంచినా త్వరగా చెడిపోతుంది.

ఎలా గుర్తించాలి? దుర్వాసన వస్తుంటే చికెన్ పాడైపోయినట్లు లెక్క. అంతేకారేండా బూడిద రంగు లేదా పసుపు రంగులోకి మారడం, చికెన్ జిగటగా ఉండడం, ప్యాకెట్ ఉబ్బి ఉండడం వంటివి కనిపిస్తే చికెన్ పాడైపోయినట్లే లెక్క.

ఇలాంటి లక్షణాలు ఉన్న చికెన్‌ను వండటం లేదా తినడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరం. ఆహార భద్రత కోసం, చికెన్‌ను నిల్వ చేసేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.




