Heart Attack Signs: గుండెపోటు వచ్చే ముందు చర్మంపై కనిపించే లక్షణాలివే.. గోరంత నిర్లక్ష్యానికి కొండంత మూల్యం!
ఇటీవలి రోజుల్లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారింది. కొన్ని అధ్యయనాలు, నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కనీసం 500 మిలియన్ల మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా గుండెపోట్లు ప్రజలను వెంటాడుతున్నాయి. కొంతమంది తీవ్రమైన లక్షణాలను అనుభవిస్తుంటే.. మరికొందరు నిశ్శబ్దంగా హార్ట్ ఎటాక్‌కు బలవుతున్నారు. కానీ గుర్తుంచుకోండి.. గుండెపోటు వచ్చే ముందు చర్మంపై కొన్ని మార్పులు కనిపిస్తాయి. అవేంటంటే..

నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉండవచ్చు. కానీ హార్ట్ ఎటాక్ రావడానికి ముందు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు తరచుగా ఛాతీ నొప్పి, అధిక చెమట, అలసట వంటి ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. దీనితో పాటు చర్మంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. గుండెపోటుకు ముందు చర్మంపై కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. గుండెపోటుకు ముందు చర్మంపై ఎలాంటి లక్షణాలు, ఎందుకు కనిపిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
నొప్పి
చర్మంపై కనిపించే మొదటి లక్షణం కాళ్ళలో వాపు. అకస్మాత్తుగా కాళ్ల చుట్టూ ఉండే చర్మం ఉబ్బుతుంది. కాళ్ళ క్రమంగా వాపు పెరుగుతుంది. ఎక్కువసేపు కూర్చున్నా లేదా నిలబడినా పాదాలలో నీరు పేరుకుపోతుంది. ఫలితంగా అక్కడ వాపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా గుండె సరిగ్గా పనిచేయనప్పుడు, పంపింగ్ పని సరిగ్గా జరగదు. ఫలితంగా శరీరంలోని ద్రవం అంతా చర్మం కింద పేరుకుపోతుంది. ఇది క్రమంగా వాపుకు దారితీస్తుంది. ఈ పరిస్థితిని ఎడెమా అంటారు. గుండె సరిగ్గా పనిచేయనప్పుడు వాపు ఈ విధంగా కనిపిస్తుంది. ఇది గుండెపోటుకు సంకేతం కూడా కావచ్చు. కాబట్టి కాళ్ళలో వాపు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని విస్మరించకూడదు.
చెమట
కొంతమందికి చలికాలంలో కూడా కొద్ది దూరం నడిచిన వెంటనే చెమట పడుతుంది. ఈ పరిస్థితిని డయాఫోరెసిస్ అంటారు. చిన్న చిన్న పనులు చేసినా అధికంగా చెమట పడుతుంది. ఇది గుండెలో సమస్యను సూచిస్తుంది. గుండెపోటు సమయంలో అధికంగా చెమట పడుతుంది. కానీ చాలా మంది దీనిని తేలికగా తీసుకుంటారు. ఇది సాధారణమని భావిస్తారు. కానీ అధిక చెమట అనేది ఆరోగ్య సమస్యకు లక్షణం అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ రకమైన నిర్లక్ష్యం గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
నీలిరంగు చర్మం
గుండెకు సంబంధించిన సమస్యలు ఉంటే, వేళ్లు నీలం రంగులోకి మారవచ్చు. దీనిని పరిధీయ సైనోసిస్ అంటారు. గుండె సరిగ్గా పనిచేయనప్పుడు ఇలా జరుగుతుంది. దీనికి కారణం గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయనప్పుడు, రక్త ప్రసరణ బాగా జరగదు. ఫలితంగా శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీంతో చేతి వేళ్లు నీలం రంగులోకి మారుతాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








