- Telugu News Photo Gallery Eat this summer season fruit Taati Munjalu or Ice Apple Fruit for immediately cooling
Thati Munjalu: తాటి ముంజలు ఎందుకు తినాలో ఈ 7 పాయింట్లు చూస్తే తెలుస్తుంది…
తాటి ముంజలు తాటిచెట్ల కాయల నుంచి లభిస్తాయి. ఇవి వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని 'ఐస్ యాపిల్' అని కూడా అంటారు.
Updated on: Apr 21, 2023 | 3:28 PM

తాటి ముంజలు మన భారత దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లభిస్తాయి. ముఖ్యంగా మన దక్షణ భారత దేశంలో విరివిగా దొరుకుతాయి. చలికాలంలో పూతగా మొదలై వేసవి ప్రారంభంలో తాటి ముంజలు ఏర్పడుతాయి.

ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో మనకు కనిపిస్తుంటాయి. వీటిని కన్నడలో 'తాటి నుంగు' అని.. తమిళంలో 'నుంగు' అని అంటారు. శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజలు ఆరోగ్యానికీ ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి.

ఈ పండులో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి కావాల్సిన ఎనర్జీ ఉంటాయి. అందుకే వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం చాలా మంచిది. కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై, శరీరంపై చెమటకాలు వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కూడా తాటి ముంజల్ని తినాల్సిందే..

వేసవికాలంలో ఎన్ని నీళ్లు తాగినా దప్పిక ఆగిపోకవడం సర్వసాధారణం. కాబట్టి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి మనల్ని రక్షించుకోవచ్చు. వేసవిలో శరీరానికి కావాల్సిన మినరల్స్, చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, క్యాల్షియం శరీరానికి చాలా అవసరం. రుచి లేత కొబ్బరిలా ఉంటుంది.

గర్భిణీలకు కొంత మందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. అలాంటి సమయంలో ముంజల్ని తినడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు. దీంతో జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా.. ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ.. లాంటి ఆరోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు.

వేసవిలో వచ్చే తాటిముంజల్ని రోజూ క్రమం తప్పకుండా తినడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. తాటి ముంజలు తినడం వలన చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.

తాటి ముంజల్ని గుజ్జుగా చేసి(మిక్సీ పట్టుకుని) ముఖానికి పై మాస్క్‌లా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇది చర్మానికి కావల్సినంత తేమను అందించి వేసవి కాలంలో వచ్చే చెమటకాయల్ని నివారిస్తుంది. అలాగే ఎండ వేడిమి వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది.

కాబట్టి ఈ పండుని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి.. శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలన్స్ చేయడంలో కూడా ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి.





























