- Telugu News Photo Gallery Cyclone Fengal over Bay of Bengal, check Andhra Pradesh weather forecast heavy to heavy rains predicted for several Districts
Cyclone Fengal: వామ్మో.. తుఫాన్ గండం.. ఏపీ ప్రజలకు రెడ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు
తమిళనాడు, ఏపీపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్‌గా మారనుంది. ఇప్పటికే.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. సాయంత్రానికి వాయుగుండం తుఫాన్‌గా మారనుంది. ఫెంగల్ తుఫాన్ ఈనెల 30న కారైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటనుంది..
Updated on: Nov 28, 2024 | 12:50 PM

తమిళనాడు, ఏపీపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్‌గా మారనుంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నెమ్మదిగా కదులుతోంది.. గడిచిన 6 గంటల్లో గంటకు 2 కిమీ వేగంతో కదులుతుంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 110 కి.మీ, నాగపట్నానానికి 310 కి.మీ, పుదుచ్చేరికి 410 కి.మీ, చెన్నైకి 480 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది.. రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర-వాయువ్య దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఉదయంలోపు తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.. శనివారం (నవంబర్ 30వ తేదీ) ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్ - మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది.

వాయుగుండం ప్రభావంతో ఆంధ్రాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణకోస్తా, రాయలసీమ, ఉత్తర కోస్తాలో జోరువానలు పడుతున్నాయి.. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో గురువారం, శుక్రవారం, శనివారం కుండపోత వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రానున్న ఐదు రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వాయుగుండం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.. పొట్టి శ్రీరాములు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. గురువారం ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

మూడు రోజులు భారీ వర్షాలు: తుఫాన్ ప్రభావంతో 3రోజులు దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి-మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల భారీ-అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీలోని మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-45 కి.మీ గరిష్టంగా 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని .. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు.
