- Telugu News Photo Gallery Cinema photos People fought for this theater and it has been releasing movies for 125 years.
ఈ థియేటర్ కోసం పోరాటం చేసిన ప్రజలు .. 125 ఏళ్లుగా చిత్రాలతో కళకళ
మన దగ్గర పదిహేనేళ్ల కిందట కట్టిన సినిమా థియేటర్లకే ఇప్పుడు దిక్కుదివానం లేదు. ఫంక్షన్ హాల్స్‌గా మారిన హాల్స్ ఎన్నో.! థియేటర్ల అంతరించి అక్కడ మాల్స్ వెలిశాయి ! కొన్ని అపార్ట్‌మెంట్లగానూ రూపాంతరం చెందాయి. ఇక మల్టిప్లెక్స్ వచ్చి సింగిల్ స్క్రిన్ థియేటర్లను పూర్తిగా మింగేశాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఫ్రాన్స్‌లో ఓ సినిమా థియేటర్ ఉంది. 125 ఏళ్లకు ముందే కట్టిన ఓ థియేటర్‌లో ఇప్పటికీ సినిమాలను ప్రదర్శిస్తున్నారు. మరి ఆ థియేటర్ ఏంటి.? ఎక్కడ ఉంది.? దాని కథేంటి.? ఈరోజు తెలుసుకుందామా మరి.
Updated on: Jul 28, 2025 | 8:22 AM

ప్రపంచంలో ఇదే ఓల్డెస్ట్ సినిమా థియేటర్. దాని పేరు ఈడన్ థియేటర్. ఫ్రాన్స్‌లోని లా సియోటట్‌లో ఉంది. ప్రపంచంలో ఇదే అత్యంత పురాతనమైన థియేటర్! 1899లో ప్రారంభమైన ఈ సినిమా హాల్ మధ్యలో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ జోరుగా హుషారుగా నడుస్తోంది..

లుమైరి బ్రదర్స్ తీసిన కదులుతున్న ట్రైన్‌ను మొట్టమొదటిసారిగా ఈ సినిమా థియేటర్ తెరపై ప్రదర్శించారు. నిమిషం వ్యవధి ఉన్న అతి చిన్ని సినిమాతో ఈ థియేటర్ మొదలయ్యింది. ట్రైన్ స్టేషన్‌లోకి వచ్చి ఆగడాన్ని తెరపైన చూసిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. మొదటి ఆటను తిలకించిన 250 మంది ప్రేక్షకులు అందించిన శుభాశీస్సులో , వారి బోణి ఇచ్చిన బలమో ఏమో కానీ ఈడెన్ థియేటర్ 1995 వరకు నిరాటంకంగా నడుస్తూ వచ్చింది.

మధ్యలో ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ 1980లో థియేటర్‌కు ఎనలేని కష్టాలు వచ్చిపడ్డాయి. థియేటర్ ఓనర్‌ను డబ్బు కోసం దోపిడిదొంగలు చంపేశారు. దాంతో సినిమా హాల్ కొన్ని రోజుల పాట వెలవెలబోయింది. ఆ తర్వాత థియేటర్‌లో సినిమాలు నడవలేదని కాదు. ఏడాదికో వారం రోజుల పాటు ఈ థియేటర్‌లో సినిమాలను ప్రదర్శించారు. వారం రోజుల పాటు సాగే ఆ చలనచిత్రోత్సవంలో ఆణిముత్యాల్లాంటి ఫ్రెంచ్ సినిమాలను ప్రదర్శించారు.. 1995 వరకు ఈ తంతు కొనసాగింది. ఆ తర్వాత మూతపడింది..

ఫ్రాన్స్ ప్రజలు ఈడెన్ థియేటర్‌ను ఓ సినిమా హాల్‌లా ఎప్పుడూ చూడలేదు. అదో చారిత్రక వారసత్వ కట్టడంగా భావించారు. ఆ సంపదను కాపాడుకోవడం కోసం పోరాటం చేశారు. వీరి పట్టుదలకు స్థానిక అధికారులు దెబ్బకు దిగి వచ్చారు. దాదాపు 80 లక్షల డాలర్లతో, మన కరెన్సీలో చెప్పాలంటే 49 కోట్ల రూపాయలను వెచ్చించి థియేటర్‌ను అందంగా తీర్చి దిద్దారు.

కొత్తగా అమర్చిన వెల్వెట్ సీట్లు, కొత్త కార్పెట్లు, మొజాయిక్ ఫ్లోరింగ్, పసుపుపచ్చని పెయింట్‌తో సినిమా హాల్‌కు కొత్త కళ వచ్చింది. ఇప్పుడా థియేటర్ టూరిస్ట్ ప్లేస్‌గా మారింది.. కేవలం 166 మంది ప్రేక్షకులు పట్టేంత చిన్న సినిమా హాలే అయినా అది ఫ్రాన్స్ ప్రజల గుండెచప్పుడు. వారికదో గర్వకారణం.




