Kannappa: ‘రుద్ర’గా ప్రభాస్.. కన్నప్పకు స్టార్ పవర్ ఎంతవరకు హెల్ప్ కానుంది..?
మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న ‘కన్నప్ప’ గురించి దేశం అంతా మాట్లాడుకుంటుంది. మామూలుగా అయితే మంచు విష్ణు సినిమా గురించి ఇంత డిస్కషన్ జరగదు. కానీ కన్నప్ప కోసం చాలా చేస్తున్నాడు విష్ణు. ఒకే చోటికి చాలా మంది హీరోలను తీసుకొస్తున్నాడు. అందులో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ అంతా ఉన్నారు. అందుకే కన్నప్ప డిస్కషన్ పాయింట్‌గా మారుతుంది.
Updated on: Feb 04, 2025 | 11:00 AM

కన్నప్పలో ముఖ్యంగా ప్రభాస్ ఉన్నాడు. దాంతో రెబల్ ఫ్యాన్స్ కూడా కన్నప్ప కోసం వేచి చూస్తున్నారు. అసలు ప్రభాస్‌ను ఎలా ఈ సినిమా కోసం ఒప్పించాడు అనే పాయింట్ కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. కానీ దానివెనక మంచు విష్ణు పాచిక మరోలా ఉంది. కథ ఓ కారణం అయితే.. దానికి మించిన కారణం మోహన్ బాబు.

బుజ్జిగాడులో ప్రభాస్, మోహన్ బాబు కలిసి నటించారు. అప్పట్నుంచి ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. వయసులో ఎంతో పెద్దవాడు అయినా కూడా ప్రభాస్‌ను బావ అని పిలుస్తాడు మోహన్ బాబు. అలాగే ప్రభాస్ కూడా అంతే సన్నిహితంగా ఉంటాడు. ఆ స్నేహంతోనే విష్ణు సినిమాలో నటించడానికి ప్రభాస్ ఓకే చెప్పాడు.

తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్ విడుదలైంది. రుద్రగా ఈ చిత్రంలో నటిస్తున్నాడు రెబల్ స్టార్. ఏప్రిల్ 25న కన్నప్ప విడుదల కానుంది. లుక్ పరంగా మాట్లాడుకుంటే అంత అద్భుతం అని చెప్పలేం కానీ ఎప్పట్లాగే ప్రభాస్ పొడవాటి జుట్టుతో కనిపిస్తున్నాడు. శివుడి నేపథ్యం కాబట్టి మెడలో రుద్రాక్ష మాలలు, విభూతి, నల్లటి వస్త్రాలు, భుజాన కాషాయ కండువా ఉంది.

కన్నప్పకు తెలుగులో ఓపెనింగ్స్ బలంగా రావాలంటే ప్రభాస్ క్యారెక్టర్ కీలకం. ఆయన ఎంతసేపు ఉంటాడనే దాన్నిబట్టే కలెక్షన్లు కూడా డిసైడ్ అవుతాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే సినిమాలో 22 నిమిషాల పాటు ప్రభాస్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది.

మరోవైపు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మరి స్టార్ పవర్ కన్నప్ప సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందనేది చూడాలి.





























