Phani CH |
Updated on: Dec 02, 2022 | 2:21 PM
బాలయ్య మహా ముదురండోయ్ బాబూ..! పైకి అలా నవ్వుతూ కనిపిస్తాడు కానీ లోపల మాత్రం మామూలోడు కాడు..! అన్‌స్టాపబుల్‌లో బాలయ్య హోస్టింగ్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. నవ్వుతూనే అడగాల్సినవన్నీ అడిగేస్తున్నారు.. అప్పుడప్పుడూ కడిగేస్తున్నారు కూడా.
తాజాగా సురేష్ బాబుతో పాటు అల్లు అరవింద్‌ను కూడా ఇరకాటంలో పడేశారు బాలయ్య. అంతగా ఆయనేం అడిగారో తెలుసా..? బాలయ్య గురించి చెప్పాలంటే అన్‌స్టాపబుల్‌కు ముందు.. తర్వాత అని చెప్పాలేమో..? ఎందుకంటే ఆయనంత సరదాగా ఉంటారని.. ఆయనలో అంత మంచి హోస్ట్ ఉన్నారనే విషయం ఈ షో వచ్చేవరకు ఎవరికీ తెలియదు.
అభిమానులు కూడా అన్‌స్టాపబుల్ బాలయ్యను చూసి షాకవుతున్నారు. ముఖ్యంగా ప్రశ్నల విషయంలో మొహమాటం లేకుండా.. గెస్టుల నుంచి ఆన్సర్స్ రాబడుతున్నారు బాలయ్య. ఇప్పటికే సీజన్ 2లో చంద్రబాబునాయుడు ఎపిసోడ్ చాలా వైరల్ అయింది. అందులో నాటి ఎన్టీఆర్ వెన్నుపోటు రాజకీయాల నుంచి చాలా ప్రశ్నలే అడిగారు బాలయ్య.
మొన్నటికి మొన్న కిరణ్ కుమార్ రెడ్డి ఎపిసోడ్‌లోనూ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పరిస్థితులను డిస్కస్ చేసారు. తాజాగా అల్లు అరవింద్, సురేష్ బాబు వచ్చిన ఎపిసోడ్‌లోనూ ఇండస్ట్రీలో ఆ నలుగురిలో ఇద్దరు మీరేనా అంటూ ఇరకాటంలో పడేసారు బాలయ్య.
నవ్వుతూనే అడగాల్సినవి అడిగేసారు బాలయ్య. ఇండస్ట్రీలో ఉన్న థియేటర్స్ మాఫియా గురించి ప్రశ్న సంధించారు. దాంతో పాటు సంక్రాంతికి నాకు ఎన్ని థియేటర్స్ ఇస్తారు అంటూ అల్లు అరవింద్‌ను అడిగేసి.. డిస్ట్రిబ్యూషన్ గురించి క్వశ్చన్ చేసారు.
అవే కాకుండా చిరంజీవితో మల్టీస్టారర్ చేస్తే అది పాన్ వరల్డ్ అవుతుందని తెలిపారు బాలయ్య. డిసెంబర్ 2న ఆహాలో రాబోయే ఈ ఎపిసోడ్ కచ్చితంగా సంచలనంగా మారేలా ఉంది.