1601 లో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్ షా బనగానపల్లె కోటను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్ ఆధీనంలో 1665 వరకు ఉన్నాయి. మహమ్మద్ బేగ్ ఖాన్-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన ఫైజ్ ఆలీ ఖాన్ బహదూరు కు ధారాదత్తమైంది. మొగలు చక్రవర్తి ఔరంగజేబు 1686లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్ ఆలీ మేనమామ, ముబారిజ్ ఖాన్ దయవల్ల ఫైజ్ ఆలీ ఖాన్ స్థానం పదిలంగానే ఉంది.