తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి మరికొన్నిగంటల్లో తెర, 2 సీట్లు, 6 ఉమ్మడి జిల్లాలు, 164 మంది. ఇంతకీ గ్రాడ్యుయేట్లు ఎటు?
Telangana Graduate MLC Election : తెలంగాణలో MLC ఎన్నికల ప్రచారానికి మరికొన్నిగంటల్లో తెరపడనుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా..
Telangana Graduate MLC Election : తెలంగాణలో MLC ఎన్నికల ప్రచారానికి మరికొన్నిగంటల్లో తెరపడనుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రభావిత శక్తులుగా మారిన ఈ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. 2 ఎమ్మెల్సీ సీట్లు, 6 ఉమ్మడి జిల్లాలు.. బరిలో 164 మంది అభ్యర్థులు… ఇంతకీ గ్రాడ్యుయేట్ల మొగ్గు ఎవరి వైపన్నది పెద్ద ప్రశ్న. తెలంగాణలో 75శాతం ప్రాంతంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. రెండు నియోజకవర్గాలే కానీ… 6 ఉమ్మడి జిల్లాల్లో హైటెన్షన్. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే పెద్దగా ప్రాధాన్యం ఉండకపోయేది. ఎన్నికలు ఎప్పుడు వచ్చాయో పోలింగ్ ఎప్పుడు జరిగిందో కూడా సామాన్యులకు తెలిసేది కాదు. కానీ ఈ దఫా సాధారణ ఎన్నికల స్థాయిలో ప్రచారం సాగుతోంది. అధికార టీఆర్ఎస్ పెద్ద ఎత్తున మంత్రులను ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి ఎన్నికల స్థాయిని పెంచింది. మహబూబ్‌నగర్ రంగారెడ్డి హైదరాబాద్ కలిపి ఒక నియోజకవర్గంగా, వరంగల్ నల్గొండ ఖమ్మం ఉమ్మడి జిల్లాలు ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గం గా ఉన్నాయి. ఈ రెండు MLC సీట్లు అయినా 75శాతం తెలంగాణను కవర్ చేసేలా ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
పేరుకే పట్టభద్రుల ఎన్నికలు అయినా ప్రతి ఒక్కరి దృష్టి ఈ ఎలక్షన్ పైనే ఉంది. అధికార పార్టీ టిఆర్ఎస్ కి దుబ్బాక ఓటమి తర్వాత వెంటనే వచ్చిన గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆశించిన విజయం అందలేదు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు గులాబీ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎలాగైనా గెలిచి తీరాలని శక్తియుక్తులన్నీ ఈ రెండు నియోజకవర్గాల్లో మోహరించింది టిఆర్ఎస్. ఇందులో ఒక సీటు తెరాస సిట్టింగ్. విజయాల పరంపరను కొనసాగించేందుకు కాషాయ దండు అదే స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేస్తుంది. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గం బీజేపీ సిట్టింగ్ సీట్ కావడం ఆ పార్టీకి ఎన్నికలు కీలకంగా మారాయి. వరుస ఎన్నికల్లో ఓటమితో సతమతమవుతున్న కాంగ్రెస్ కూడా చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. పార్టీలే కాదు.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు.. ఉద్యమ నాయకులు కూడా పెద్దల సభలో అడుగుపెట్టాలని బరిలో దిగారు. హెమా హెమీలు రంగంలో దిగారు.
ప్రచారానికి మిగిలింది ఒకే ఒక్కరోజు.. ఉద్దండులు తలపడుతున్న రాజకీయ సమరంలో విజేతగా నిలవడానికి నాయకులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు బలగాలు మోహరించాయి. ప్రతి ఓటరును జల్లెడపట్టి మరీ వలలో వేసేందుకు విశ్వప్రయత్నాలూ చేస్తున్నాయి. హద్దులు మీరిన మాటలు.. సరికొత్త ఎత్తుగడలతో సాగుతున్న ప్రచారంలో ఓటరు నాడి పట్టిందెవరు? గెలుపుబావుటా ఎగరేస్తుందెవరు? అనేది తెలంగాణలో హాట్ టాపిక్ అయింది.