TELANGANA ELECTIONS: ముందస్తు మోతకు పార్టీల కదనోత్సాహం.. గులాబీ పార్టీని ఢీకొట్టేందుకు బరిలోకి జాతీయ పార్టీలు
ఇక్కడో విషయం విశేషంగా చెప్పుకోవాల్సి వుంది. ప్రాంతీయ పార్టీ పాలిస్తున్న తెలంగాణపై మూడు జాతీయ పార్టీలు కన్నేశాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఢిల్లీ నుంచి దండయాత్ర ప్రారంభించి పంజాబ్‌లో ఇటీవలే పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి
TELANGANA ELECTIONS POLITICAL PARTIES GEARING UP NATIONAL PARTIES INTO FRAME: ఎన్నికలెప్పుడొస్తాయో క్లారిటీ లేదు. వాస్తవానికి 2023 డిసెంబర్ దాకా తెలంగాణ అసెంబ్లీ (TELANGANA ASSEMBLY) ఎన్నికలకు గడువుంది. కానీ రాజకీయ చతురుడు, అపర చాణక్యుడుగా అందరు భావించే ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు (KCR) వ్యూహాలెలా వుంటాయో తెలియదు. గతంలో ఎన్నికలకు మరో 9 నెలల గడువుండగానే అనూహ్యంగా అసెంబ్లీని రద్దు చేసి, ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్ళారు గులాబీ దళపతి. కేసీఆర్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో తెలంగాణలోని రాజకీయ పార్టీలు అప్పట్లో ఖంగుతిన్నాయి. ఎన్నికలు ఇప్పుడపుడే లేవనుకుని నింపాదిగా వున్న కాంగ్రెస్ (CONGRESS), బీజేపీ (BJP)లకు కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం షాకిచ్చింది. ఎన్నికలకు ప్రిపేర్ అయ్యే సమయం లేక ఆ పార్టీలు చతికిలా పడ్డాయి. అసెంబ్లీని రద్దు చేసేనాటికే గ్రౌండ్ స్థాయిలో సర్వే చేయించిన కేసీఆర్.. ఒకేసారి 90 శాతం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి, ప్రచార పర్వానికి తెరలేపారు. మిగిలిన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించక ముందే గులాబీ పార్టీ ప్రచార పర్వాన్ని ప్రారంభించేసింది. అంతకు ముందు నాలుగున్నరేళ్ళలో తాము చేసిన అభివృద్ధి, తెలంగాణ సాధన కోసం తాము చేసిన పోరాటం, తెలంగాణ తీసుకువచ్చిన పర్పస్ ఏ మేరకు నెరవేరింది.. తమకు రెండోసారి అధికారం ఎందుకివ్వాలి ? ఇలా కీలకాంశాల ఆధారంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయింది తెలంగాణ రాష్ట్ర సమితి.
కాలం గిర్రున తిరిగింది. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల ముందుకు క్రమంగా చేరుకోబోతున్నాం. అసెంబ్లీ గడువు 2023 డిసెంబర్ దాకా వుంది. కానీ ఆరు నెలలుగా ముందస్తు మాట వినిపిస్తోంది. గతంలో 2019లో సార్వత్రిక ఎన్నికలతోపాటే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే మోదీ చరిష్మాతో బీజేపీ మెరుగైన సీట్లు గెలిచే ప్రమాదాన్ని ఊహించిన గులాబీ దళపతి.. వ్యూహాత్మకంగా ఆరునెలల ముందుగానే ముందస్తు మోత మోగించారు. పకడ్బందీ వ్యూహంతో రెండోసారి పార్టీని గెలిపించారు. పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల కంటే అధిక సంఖ్యలో నేడు టీఆర్ఎస్ బలం కనిపిస్తోంది. 17 సీట్లను గెలుచుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కేవలం 6 సంఖ్యకు పరిమితమైంది. 2018 ఎన్నికల్లో కేవలం ఒక్కటంటే ఒక్క సీటు (గోషామహల్)ను గెలుచుకున్న భారతీయ జనతాపార్టీ ఉప ఎన్నికల్లో మరో రెండు సీట్లను (దుబ్బాక, హుజురాబాద్) గెలుచుకుని మూడు సీట్లకు తమ బలాన్ని పెంచుకుంది. ఇదిలా కొనసాగుతుండగానే కేసీఆర్ ముందస్తు వ్యూహాన్ని పరిశీలిస్తున్నారన్న కథనాలు మీడియాలో మొదలయ్యాయి. 2022 జూన్ తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీని రద్దు చేసి.. ఎన్నికలకు వెళ్ళేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారన్నది కథనాల సారాంశం. జూన్ తర్వాత ఎప్పుడు అసెంబ్లీని రద్దు చేసినా.. 2023 జనవరి, ఫిబ్రవరిలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని మీడియాలో ఓ వర్గం కథనాలను ప్రచురిస్తోంది. మరికొందరు మాత్రం 2022 అక్టోబర్, నవంబర్ మాసాల్లో అసెంబ్లీని రద్దు చేస్తారని.. తద్వారా 2023 ఏప్రిల్, మే నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రావచ్చని అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ కదలికలను సునిశితంగా పరిశీలిస్తున్న ప్రత్యర్థి పార్టీలు కూడా చురుకుగా మారాయి. ప్రజల్లోకి వెళ్ళేందుకు కార్యచరణ ఖరారు చేసుకుంటూనే సంస్థాగతంగా పార్టీని, పార్టీ లీడర్లను, క్యాడర్‌ను ఎన్నికలకు సిద్దం చేస్తున్నాయి పార్టీలు. ధాన్యం సేకరణ నేపథ్యంలో కస్సుబుస్సులాడుకుంటున్న టీఆర్ఎస్, బీజేపీలు ప్రజాక్షేత్రంగా చాలా చురుకుగా పని చేస్తున్నాయి. టీఆర్ఎస్ వ్యూహాలన్నీ కేసీఆర్ సెంట్రిక్‌గా ఖరారవుతుండగా.. జాతీయ నేతల విస్తృత పర్యటనలు, క్షేత్రస్థాయి సమీక్షలు, మార్గదర్శకాల ఆధారంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెడీ అవుతున్నాయి. తరుణ్ చుగ్ సహా పలువురు జాతీయ నేతలు తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తూ.. కమలం శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. ధాన్యం సేకరణ కేంద్రాలను సందర్శిస్తూ.. రాష్ట్రంలో అధికార పార్టీ కేంద్రంపై అకారణంగా దుమ్మెత్తిపోస్తూ రాజకీయం చేస్తోందని ఆరోపిస్తున్నారు కమలం నేతలు. రాజధానిలో పదునైన పదజాలంతో మీడియా భేటీలు నిర్వహిస్తున్న బీజేపీ నేతలు.. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం ఏదో ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తూ చురుకుగా పర్యటిస్తున్నారు. వీరికి దిశానిర్దేశం చేసేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ ఛుగ్.. ఢిల్లీ, హైదరాబాద్ మధ్య విరివిగా పర్యటిస్తున్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల డైరెక్షన్లను తెలంగాణ లీడర్లకు, క్యాడర్‌కు చేరవేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న బీజేపీ నేతలు.. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు గాలమేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన భిక్షమయ్య గౌడ్ రెండ్రోజుల క్రితం కమలం పార్టీలో చేరారు. ఏప్రిల్ 14వ తేదీన తెలంగాణ బీజేపీ ప్రారంభించనున్న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రకు ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రప్పిస్తున్నారు టీ.బీజేపీ నేతలు. ఇందుకు సంబందించిన గోడ పత్రికను విడుదల చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
ఇక అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా వుండడం వల్ల అనైక్యంగా కనిపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఒక్కతాటి మీదకు తెచ్చేందుకు పార్టీ అధిష్టానం శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో కీలక భేటీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. నొటికొచ్చినట్లు మాట్లాడి పార్టీ పరువు తీయొద్దని నేతలకు వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా సీనియర్ నేత వి.హనుమంతరావు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిల నోటికి తాళం వేయడంలో పార్టీ అధిష్టానం సక్సెస్ అయ్యింది. ఎన్నికలకు ముందు తలొరకంగా మాట్లాడితే అది పార్టీకి నష్టం చేకూర్చే ప్రమాదం వుందని అధిష్టానం తెలంగాణ నేతలకు హితబోధ చేసింది. అదేసమయంలో పార్టీ నేతల్లోను, శ్రేణుల్లోను ఉత్సాహం నింపేందుకు స్వయంగా రాహుల్ గాంధీని రంగంలోకి దింపాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఏప్రిల్ నెలాఖరులో ఓరుగల్లు వేదికగా నిర్వహించనున్న బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరవుతారని ప్రకటించారు. వరి ధాన్యం సేకరణలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే నినాదంతో పాదయాత్ర నిర్వహించిన భట్టి విక్రమార్కకు చక్కని స్పందన వచ్చిందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ వేదికగా నిర్వహించిన హితబోధ కమ్ సమీక్ష సమావేశానికి తెలంగాణకు చెందిన ముఖ్యనేతలు 48 మందిని అధిష్టానం ఆహ్వానించింది. అందరికీ దిశానిర్దేశం చేశారు రాహుల్ గాంధీ. వచ్చే ఎన్నికల్లో ఎవరితోను పొత్తుండదని కుండ బద్దలు కొట్టారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలో కలిసేది లేదని చెప్పేశారు. ఒంటరి పోటీలో విజయమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు యువరాజు. రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనే మీనింగ్ వచ్చేలా సాగిన కాంగ్రెస్ అధినేతల ప్రసంగాలు.. శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయనే చెప్పాలి.
అయితే ఇక్కడో విషయం విశేషంగా చెప్పుకోవాల్సి వుంది. ప్రాంతీయ పార్టీ పాలిస్తున్న తెలంగాణపై మూడు జాతీయ పార్టీలు కన్నేశాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఢిల్లీ నుంచి దండయాత్ర ప్రారంభించి పంజాబ్‌లో ఇటీవలే పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తెలంగాణలో క్యాడర్ని, లీడర్లను పెంచుకుంటున్న ఆప్ అధిష్టానం.. ప్రత్యేక వ్యూహంతో తెలంగాణలో విజయం సాధిస్తామని ప్రకటించింది. దాంతో ఇప్పుడు అందరి చూపు తెలంగాణ వైపే వున్నట్లుగా స్పష్టమవుతోంది. అన్ని పార్టీల అడుగులూ గులాబీ పార్టీని ఢీకొట్టేందుకేనన్నట్లు కనిపిస్తోంది పరిస్థితి. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే తెలంగాణపై ఫోకస్ పెట్టాయి పొలిటికల్ పార్టీలు. దీనికి కారణం తెలంగాణలో ముందస్తు ఖాయమని భావించడమే. బీజేపీ, కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ ఇలా అందరూ తెలంగాణలో తమ అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. రెండు పర్యాయాల టీఆర్‌ఎస్ పాలనతో రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలంగా ఉందని పొలిటికల్ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి జాతీయ పార్టీలు. తెలంగాణను ఏకచ్ఛాత్రాధిపత్యంగా ఏలుతున్న టీఆర్‌ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు రంగంలోకి దిగబోతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం బలహీనపడుతోందని జాతీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ పాగా వేసేందుకు ఇదే అవకాశమని భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గత వైభవాన్ని సాధించాలని చూస్తుంటే.. బీజేపీ మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభావం చూపించాలని అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆశపడుతున్నారు. తెలంగాణ చిన్న రాష్ట్రం. 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇక్కడ ఉన్నారు. అయినా దేశంలోని మిగతా చిన్న రాష్ట్రాలతో పోలిస్తే బెటరే. ఆర్థికంగా స్వయంసమృద్ది కలిగిన రాష్ట్రం. తెలంగాణలో సత్తా చూపించగలిగితే చాలు ఆంధ్రాతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి వీలవుతుందని జాతీయ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్.. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోందనేది జాతీయ పార్టీల వాదన. దానిలో భాగంగానే కొత్త ఆలోచనలు, ఐడియాలు లేకపోవడంతో పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ని టీఆర్‌ఎస్ తెరపైకి తెచ్చిందని ప్రతిపక్ష పార్టీలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి.
ఇక ఈసారి కాంగ్రెస్, బీజేపీకి తోడు కేజ్రీవాల్ పార్టీ ఆప్ దూసుకొస్తుంది. పంజాబ్ విజయంతో ఫుల్ జోష్ మీదున్న కేజ్రీవాల్ తెలంగాణలో ఖాతా తెరవాలనే ఉత్సాహంలో ఉన్నారు. ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే కేజ్రీవాల్ పార్టీ భిన్నమైనది. రియల్ఎస్టేట్, స్యాండ్, లిక్కర్, ప్రైవేటు కాలేజీలు, ఇతర బడా వ్యాపారాలు చేసే లీడర్లతో పోల్చితే కేజ్రీవాల్ పూర్తి విరుద్ధం. ఆమ్‌ఆద్మీ పార్టీ కామన్ పార్టీగా చలామణీలో ఉంది. అవినీతిలో చిన్న మోదీ అంటూ ఇప్పటికే సీఎం కేసీఆర్‌పై విమర్శలు స్టార్ట్ చేశారు కేజ్రీవాల్. కేసీఆర్‌ని కేజ్రీవాల్ ఓడిస్తారని చెప్పలేం కానీ, తన విమర్శలతో ఆయన్ని ఇరుకున పెట్టగలరని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కాంగ్రెస్, బీజేపీకి కలిసి వచ్చే అస్త్రంగా మారవచ్చు. గులాబీ పార్టీ బలంగా వున్నప్పటికీ.. దాన్ని ఢీకొనడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏ మాత్రం తీసిపోని విధంగా సంసిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే బరిలో మరిన్ని పార్టీలు నిలుస్తుండడంతో ఈసారి తెలంగాణలో బహుముఖపోరు తథ్యమంటున్నారు పరిశీలకులు.