Nagarjunakonda: తెలుగు రాష్ట్రాల మధ్య మరో సమస్య తెచ్చిపెడుతోన్న నాగార్జునకొండ లాంచి ప్రయాణం.!
ఆ కొండకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిస్టరీ కూడా ఉంది. ఆ కొండకు వెళ్లాలంటే.. లాంచీ ఎక్కాల్సిందే. మరి ఇప్పడు.. ఆ లాంచి ప్రయాణమే, రెండు తెలుగు రాష్ట్రాల
Nagarjunakonda boat journey: ఆ కొండకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిస్టరీ కూడా ఉంది. ఆ కొండకు వెళ్లాలంటే.. లాంచీ ఎక్కాల్సిందే. మరి ఇప్పడు.. ఆ లాంచి ప్రయాణమే, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదంగా మారుతోంది. నాగార్జునకొండ లాంచి ప్రయాణం రెండు రాష్ట్రాల మధ్య మరో సమస్య తెచ్చిపెడుతోంది. నాగార్జున సాగర్ రిజర్వాయర్ లోని నాగార్జున కొండకు.. లాంచీల నడిపేందుకు ఏపీ అటవీ శాఖకు, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో నాగార్జునసాగర్ వచ్చే పర్యాటకులకు.. నాగార్జునకొండ చూసే అవకాశం లేకుండా పోతోంది. సరైన పత్రాలు ఇచ్చినప్పటికీ.. ఏపీ అటవీశాఖ కావాలనే జాప్యం చేస్తోందని తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఆరోపిస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నాగార్జునకొండకు వెళ్లడానికి రైటు బ్యాంకులో లాంచీస్టేషన్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇక్కడి నుండే నాగార్జునకొండతో పాటు.. శ్రీశైలంకు కూడా లాంచీలు నడిచేవి. రాష్ట్రాల విభజన తర్వాత రైటు బ్యాంకు లాంచీస్టేషన్ ఏపీ పరిధిలోకి వెళ్లింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ హిల్‌కాలనీ డౌన్‌పార్కు వద్ద లాంచీస్టేషన్ ఏర్పాటు చేసి నాగార్జున కొండకు లాంచీలను నిర్వహిస్తోంది. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున.. వచ్చే పర్యాటకులు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ లాంచ్ స్టేషన్ నుంచి నాగార్జున కొండ కు వెళ్లేవారు.
నాగార్జున కొండ, శ్రీశైలంకు లాంచీలు నడపవద్దని ఏపీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీంతో నాగార్జున కొండకు లాంచీలు నిలిచిపోవడంతో పర్యాటకులు నిరాశపడుతున్నారు. ఎంతో ఆసక్తితో నాగార్జున సాగర్ కి వస్తే నాగార్జున కొండకు వెళ్లకుండానే తిరుగు ప్రయాణం అవుతున్నామని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నదిలో కచ్చులూరు ప్రమాదం తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లోని లాంచీలకు పోర్టు అధికారులు ఫిట్నెస్ ఉంటేనే అనుమతి ఇస్తున్నారు. కానీ నాగార్జునసాగర్ ఏపీ లాంచ్ స్టేషన్ లో ఉన్న 5 లాంచీలలో నాగసిరి లాంచ్ మాత్రమే ఫిట్నెస్ కలిగి ఉండడం.. మిగిలిన లాంచీలు నడిచే పరిస్థితి లేదు. నాగార్జున కొండకు ఏపీ టూరిజం లాంచీల నడపలేక పోతుంది.
నాగార్జునకొండ ఏపీ పరిధిలో ఉండటంతో లాంచీలో అక్కడికి వెళ్లడానికి.. ఏపీ అటవీశాఖ అనుమతి తప్పనిసరి కావడంతో ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఏపీ అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో.. తెలంగాణ లాంచీలు కొండకు వెళ్లలేకపోతున్నాయి. తెలంగాణ పర్యాటక సంస్థ ప్రత్యేకంగా మూడున్నర కోట్ల రూపాయలతో రెండు పెద్ద లాంచీలను తయారు చేయించింది. 60 లక్షల రూపాయలతో మరో తక్కువ కెపాసిటీ కలిగిన లాంచిని కూడా ఏర్పాటు చేసింది. ఐనా నాగార్జునకొండకు వెళ్లేందుకు తెలంగాణ పర్యాటక సంస్థ లాంచీలకు అనుమతి లేకపోవడంతో.. తమ జిల్లాలో జాలీ ట్రిప్కులను తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నడుపుతోంది.
తెలంగాణకు చెందిన లాంచీలకు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఉన్నప్పటికీ.. ఏపీ అటవీశాఖ మాత్రం నాగార్జునకొండకు వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇవ్వడంలేదు. దీంతో ఏపీ లాంచీలు కొండకు నడప లేకపోవడంతో.. తెలంగాణ లాంచీలు కూడా నాగార్జున కొండకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకుండా ఏపీ అటవీశాఖ కొర్రీలు వేస్తోందంటున్నారు. రెండు రాష్ట్రాల్లో తరపున లాంచీ ప్రయాణాలు సాఫిగా సాగితే.. ఆదాయం కూడా సమకూరుతుంది. ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ కు వచ్చిన పర్యాటకులు.. నాగార్జునకొండను చూడలేకపోతున్నమనే నిరాశకు లోనవుతున్నారు పర్యాటకులు.
నాగార్జునకొండకు వెళ్లడానికి అనుమతికి కావల్సిన పత్రాలను తెలంగాణ పర్యాటక సంస్థ అందజేసినా అనుమతి ఇవ్వడంలో అటవీ శాఖ కావాలని ఆలస్యం చేస్తోంది. ఇటీవలే ఏపీ అటవీ శాఖ అధికారులు తెలంగాణ లాంచీల ఫిట్నెస్ను పరీక్షించారని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే నాగార్జున కొండకు లాంచీలు నడిపేందుకు అనుమతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.