Sr. NTR: రావణ పాత్రలో ఎన్నో వైవిధ్యాలను, వైరుధ్యాలను ప్రదర్శించిన మహానటుడు ఎన్టీఆర్‌…

ఇతిహాసాన్ని సృష్టించేవాడే కథానాయకుడు. చరిత్రలో తనకంటూ కొన్ని పుటలను ఏర్పరచుకునేవాడే ధీరోదాత్తుడు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వాడే మహానాయకుడు.

Sr. NTR: రావణ పాత్రలో ఎన్నో వైవిధ్యాలను, వైరుధ్యాలను ప్రదర్శించిన మహానటుడు ఎన్టీఆర్‌...
Ntr
Follow us
Balu

| Edited By: Ravi Kiran

Updated on: May 27, 2022 | 2:09 PM

ఇతిహాసాన్ని సృష్టించేవాడే కథానాయకుడు. చరిత్రలో తనకంటూ కొన్ని పుటలను ఏర్పరచుకునేవాడే ధీరోదాత్తుడు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వాడే మహానాయకుడు. ఏటికి ఎదురీది విజయం సాధించేవాడే సాహసవంతుడు. ఈ లక్షణాలన్నింటినీ పుణికి పుచ్చుకున్న ఏకైక నటుడు ఎన్టీయార్‌ మాత్రమే! ఆయన ధరించని పాత్రలేదు… పోషించని రసం లేదు. సాంఘిక చిత్రాల్లో ఆయన అభినయం అనితర సాధ్యం. ఇక చారిత్రక, జానపదాలైతే ఆయనకు కొట్టిన పిండి. పౌరాణికాలా చెప్పేదేముంది! పురాణ పురుషుల పాత్ర పోషణలో ఆయనకు మించినవారు లేరు. ఏడేడు లోకాల్లో వెతికినా కనిపించడు.. అందుకే ఆయన విశ్వ విఖ్యాత నటుడయ్యాడు. రేపు అంటే 28న ఆ యుగపురుషుడి జయంతి. ఇంతకు ముందు ఆయన అభిమాన పాత్ర ఏమిటో ఆయన మాటల్లోనే చదివాం! ఇప్పుడు ఆ పాత్రను ఎన్ని రకాలుగా, ఎంత వైవిధ్యంగా పోషించారో తెలుసుకుందాం!

దాదాపు మూడు వందల చిత్రాలు. అంతకు రెండింతల పాత్రలు. ఏ పాత్ర అయినా ఆయనకు నప్పేది! ఆయనకే నప్పేది! ముఖ్యంగా శ్రీకృష్ణుడి పాత్ర పోషణలో ఈ భూమండలంలో ఆయనను మించిన వారు లేరు. కృష్ణుడంటే ముందుగా స్ఫురించేది ఎన్టీయారే! ఆయనకు ముందు ఆ తర్వాత ఎందరో నటులు ఆ పాత్రను ధరించినా ఎన్టీయార్‌కు సరిసాటి కాలేకపోయారు.. దాదాపు 14 చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడి పాత్రను అభినయించారు.. ఒకే నటుడు ఒకే పాత్రను ఇన్ని చిత్రాల్లో నటించిన ఖ్యాతిని సొంతంచేసుకున్నారు. ఇంతలా శ్రీకృష్ణుని పాత్రలో రాణించిన ఎన్టీయార్‌కు అభిమాన పాత్ర ఇది కాకుండా రావణుడు పాత్ర కావడమే విశేషం. ఆ అభిమానంతోనే ఆ పాత్రపై ఎన్టీయార్‌ దృష్టి సారించారు. రామాయణాన్ని శోధించారు. పరిశోధించారు. రావణుడి గుణగణాలపై ఆ పాత్ర తీరుతెన్నులపై పరిశీలన చేశారు. రావణుడి రూపు రేఖలను మనో ఫలకంపై చిత్రీకరించుకున్నారు. ఇంతలా శ్రమించారు కాబట్టే రావణబ్రహ్మ పాత్ర అభినయానికి ఆయన పెట్టింది పేరుగా నిలిచారు..

ఎవిఎం సంస్థ 1958లో భూకైలాస్‌ చిత్రానికి శ్రీకారం చుట్టింది. రావణబ్రహ్మ పాత్రకు ఎన్టీయార్‌ను ఎంపిక చేసుకుంది. ఎందుకంటే రావణుడు స్ఫురద్రూపి కాబట్టి. తనకు అత్యంత అభిమానమైన రావణుడి పాత్రను పోషించే అవకాశం లభించడంతో ఎన్టీయార్‌ ఎంతో పులకించిపోయారు… అభిమాన పాత్ర ధరించి అభిలాష తీర్చుకోవడం కంటే ఏ నటుడైనా ఇంకేం కావాలి. బలమైన పాత్ర దొరకాలని ప్రతి నటుడు కోరుకుంటాడు.. తమలోని నటనావైదుష్యాన్ని చాటి చెప్పాలని ఆశిస్తాడు. రావణుడి పాత్ర పోషణ రామారావుకు అమితానందాన్ని కలిగించింది. ఆ పాత్ర పోషణ పూర్వ జన్మ సుకృతంగా భావించారు ఎన్టీయార్‌. భూకైలాస్‌లో ఎన్టీయార్‌ అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చిత్రం అఖండ విజయం సాధించింది… ఎన్టీయార్‌కు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. భూకైలాస్‌లో ఎన్టీయార్‌ నటనకు అవార్డులొచ్చాయి. రివార్డులూ లభించాయి. అయినా రామారావులో ఏదో అసంతృప్తి. భక్త రావణుడిగా ఎన్టీయార్‌ అద్భుతంగా రాణించాడు. కానీ ఆ వేదవేదాంగపారంగతుడి గుణాలతో ఓ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు.

పాండురంగ మహత్యం సినిమా తర్వాత ఎన్‌ఎటి సంస్థ వాస్తవానికి అల్లూరి సీతారామరాజు తీయాలి. కానీ ఎన్టీయార్‌ ఎందుకో రామాయణ ఇతివృత్త గాధను తెరకెక్కించాలనుకున్నారు. సముద్రాలతో స్క్రిప్టు రాయించుకున్నారు. గురుతుల్యులైన కెవి రెడ్డి గారి దర్శకత్వంలో సీతారాముల కళ్యాణ గాథను సినిమాగా తీద్దామని అనుకున్నారు. విషయం కెవిరెడ్డికి చెబితే ఆయన సరేనన్నారు. ఎన్టీయార్‌ రాముడిగా, ఎస్వీయార్‌ రావణుడిగా నటిస్తారని కెవి ప్రకటించారు కూడా. సరిగ్గా అదే సమయంలో ఎన్టీయార్‌కు సన్నిహితుడైన దనేకుల బుచ్చి వెంకటకృష్ణ చౌదరి వైజాగ్‌ ఆంధ్ర యూనివర్శిటీ లైబ్రరీ నుంచి ఓ పుస్తకం తెచ్చారు. శివపురాణం మొదలైన గ్రంథాల నుంచి సేకరించిన సమాచారంతో రావణకథను చెప్పారు. ఆ గ్రంథంలో రావణుడి వ్యక్తత్వ ధీరత్వాలను అద్భుతంగా ఆవిష్కరించారు. ఎన్టీయార్‌ ఆసక్తిగా ఆమూలాగ్రం చదివారు. రావణుడి గురించి కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నారు. దాంతో ఎన్టీయార్‌కు రావణ పాత్రపై మరింత మక్కువ పెరిగి, కె.వి.రెడ్డిని కలిసి తను ఆ పాత్ర వేస్తానన్నారు. ఆయనేమో వీల్లేదని చెప్పేశారు. ఎన్టీయార్‌ మొండిపట్టు పట్టడంతో కె.వి.రెడ్డి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు, ఫలితంగా సీతారామ కళ్యాణం సినిమాకు ఎన్టీయారే దర్శకత్వం వహించాల్సి వచ్చింది. అయిదో దశకం చివరి నాటికే ఎన్టీయార్‌ తిరుగులేని కథానాయకుడు.. ఏడాదికి సుమారుగా పది చిత్రాల్లో నటిస్తున్నారు. అలాంటిది నెగటివ్‌ రోల్‌ వేయడం ఓ సాహసమే! పైగా తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నారు.. చాలా శ్రద్ధగా ఓపిగ్గా చిత్రాన్ని పూర్తి చేశారు.. రావణబ్రహ్మ పాత్రలోని మంచి చెడులను రెంటిని ఎన్టీయార్‌ ఇందులో చర్చించారు.

పురాణాల్లో రావణుడిని ఎలా వర్ణించారో అలాగే ఎన్టీయార్‌ తెరకెక్కించారు.. మండోదరి గీతాలాపనకు తగిన స్వరాలను సమకూర్చే సన్నివేశంలో రావణబ్రహ్మగా ఎన్టీయార్‌ అభినయం ఎలా సాగిందో ఈ మహాద్భుత దృశ్యాన్ని చూసిన వారికి అనుభవమే! తనపై అలిగిన కైలాసనాధుడిని మెప్పించడం కోసం కుక్షిని చీల్చి ప్రేగులతో రుద్రవీణను రూపొందించి, జీవనాదంతో ఆ పార్వతీశుని తన ముందుకు రప్పించుకోగలిగిన సంగీత కళాతపస్వి అయిన రావణుడిని మన కళ్లముందుంచారు రామారావు. రుద్రవీణ మీటే సన్నివేశంలో ఆయన అభినయం చూసి కరిగిపోని ప్రేక్షకులు వుండరంటే అతిశయోక్తి కాదు. ఇంకో ఆసక్తికరమైన సంగతేమిటంటే అప్పట్లో ఎన్టీయార్‌కు పోటీగా రాణిస్తున్న అక్కినేని నాగేశ్వరరావు ఆ సన్నివేశాన్ని చూసి ఎన్టీయార్‌ అభిమానిగా మారిపోయారు. ఈ విషయాన్ని ఆయనే పలు మార్లు చెప్పుకున్నారు కూడా!

ప్రతి మనిషిలో మంచి చెడు రెండు వుంటాయి. ఈ సూత్రాన్ని అనుసరించి రావణ పాత్రలో రెండు కోణాలను ఆవిష్కరించగలిగారు ఎన్టీయార్‌. కథానాయకుడిగా ప్రజల గుండెల్లో స్థిరపడిపోయిన నటుడు ప్రతినాయకుడి పాత్రను పోషిస్తే ఏమవుతుందో ఎన్టీయార్‌ కంటే ముందు అందాల హీరోగా రాణించిన సిహెచ్‌ నారాయణరావు అప్పటికే నిరూపించి వున్నారు. ఎన్టీయార్‌ సీతారామకల్యాణం చిత్రం రూపొందిస్తూ అందులో రాముడి పాత్ర అందాలనటుడు హర్‌నాథ్‌తో వేయించి తాను రావణుడి పాత్రను పోషిస్తున్నాడని తెలిసి కొందరు మిత్రులు వారించారు. పైగా తొలిసారి దర్శకత్వం వహిస్తూ ప్రతినాయకుడి పాత్రను ధరించడమేమిటని ముక్కున వేలేసుకున్నారు. పట్టిన పట్టు విడవని సహజ గుణం కలిగిన ఎన్టీయార్‌ రాజీ పడితేగా! ప్రజలను మెప్పింగలనన్న ఆత్మ విశ్వాసం ఆయనలో వుంది కాబట్టే ముందడగు వేశారు. విజయం సాధించారు. తెలుగు తెరపై రావణుడి పాత్రకు సమున్నత స్థానాన్ని, విశిష్టతను కలిగింపచేశారు.

ఎన్టీయార్‌ ఏ పాత్ర పోషించినా తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు… పురాణ పురుషుల పాత్రలనైతే మరీనూ! ఆయన ప్రతినాయకుడి పాత్రను పోషించినా జేజేలు పలికారు. ముఖ్యంగా రావణుడి పాత్రను ఆయన తీర్చిదిద్దిన తీరును ఎంతగానో శ్లాఘించారు. దశకంఠుడిని శాస్ర్తజ్ఞుడిగా పరిగణించారు ఎన్టీయార్‌. సీతారామకల్యాణానికి ముందు ఎన్టీయార్‌ రావణుడి పాత్రను హీరోగా మలచిన భూకైలాస్‌లో నటించివున్నారు. మళ్లీ రాముడి పాత్ర కూడా తానే ధరిస్తే రాముడి పాత్రపై నుంచి ప్రేక్షకుడి దృష్టి మరలుతుందేమోననేది ఎన్టీయార్‌ భావన. అందుకే హర్‌నాథ్‌తో రాముడి వేషం వేయించారు. రావణుడు దానగుణ శోభితుడు. రాజధర్మ ప్రవక్తకుడిగా, మంత్రాంగ నిపుణునిగా, యుద్ధ నిర్వహణలో వ్యూహ నిర్మాణంలో అసామాన్య ప్రతిభావంతునిగా వినుతికెక్కాడు. లంకా రాజ్యంలో సామాన్యులు సైతం తనను ఆరాధించేలా ప్రజాహిత పాలన చేశాడు. రావణుడి ప్రతాపాన్ని చూసి సూర్యుడు ఆయన ఎదుట ప్రకాశించడానికి భయపడేవాడట! వాయుదేవుడు పక్కన వీచడానికి జంకేవాడట. సముద్రుడు లంకాధీశుడిని చూసి చలనరహితుడయ్యేవాడట! ఇలాంటి గుణగణాలున్న రావణబ్రహ్మ పాత్రను ఎన్టీయార్‌ మళ్లీ శ్రీకృష్ణ సత్యలో పోషించారు. సీతారామకల్యాణంలో పూర్తి స్థాయిలో రావణాసుడి పాత్రను పోషించినా ఎందుకో ఆ పాత్ర మీదున్న మక్కువ తగ్గలేదు.. సందర్భం వస్తే కాసేపయినా సరే ఆ పాత్రను ధరించాలని అనుకునేవారు… ఏడో దశకం ఆరంభంలో తన గురువు, మార్గ దర్శకుడు కె.వి.రెడ్డి గారి కోసం శ్రీకృష్ణసత్య అనే సినిమాను నిర్మించారు. అందులో కాసేపు రావణుడిగా ఎన్టీయార్‌ కనిపిస్తారు. అయితే ఈ సినిమాలో రావణుడి ఆహార్యం కాస్త భిన్నంగా వుంటుంది. భీకరంగా వుంటుంది. కె.వి.రెడ్డి దర్శకుడు కావడం వల్ల ఆ పాత్ర పోషణ అలా వుందేమో! ఆకారం ఎలావున్నా కనబడిన కాసేపు అభినయం ఆకట్టుకుంది.

నిజానికి ఎన్‌ఎటి సంస్థ ఉమ్మడి కుటుంబం సినిమా తర్వాత శ్రీరామపట్టాభిషేకం సినిమా తీయాలి. సముద్రాల స్ర్కిప్టు సిద్ధంగా వున్నా ఎన్టీయార్‌ చిత్ర నిర్మాణాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి 1978లో రామకృష్ణా సినీ స్టూడియోస్‌ పతాకంపై శ్రీరామపట్టాభిషేకం సినిమాను నిర్మించారు. స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో ఎన్టీయార్‌ శ్రీరామ, రావణ పాత్రలను తానే ధరించారు. రావణ పాత్ర పోషణలో ఎన్టీయార్‌ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆహార్యం దగ్గర్నుంచి ఆభరణాల వరకు శ్రద్ధ తీసుకున్నట్టే కనిపిస్తుంది. అంతా బాగానే వుంది కానీ సినిమాలోనే ఆత్మ లేదు. తాను కోరుకున్నట్టుగానే ఎన్టీయార్‌ సినిమా తీసినా సీతారామకల్యాణంలోని రావణ పాత్రకు సాటిరాగల స్థాయిలో మళ్లీ ఆ పాత్ర రూపకల్పన జరగలేదు. అది ఆయనకే సాధ్యం కాలేకపోయింది. సీతారామకల్యాణంలోని వీణ పాటలాంటిదే ఇంచుమించుగా అలాంటిదే శ్రీరామపట్టాభిషేకంలోనూ చిత్రీకరించారు. ఒక్కటే మార్పు అందులో బి.సరోజదేవి. కొత్త సినిమాలో జమున. కానీ సీతారామకల్యాణం అంత కమనీయంగా, రమణీయంగా శ్రీరామపట్టాభిషేకం సినిమాలోని పాట లేదనేది విస్పష్టం. శ్రీరామపట్టాభిషేకం సినిమా కాలానికి ఎన్టీయార్‌ తిరుగులేని మాస్‌ హీరో అయ్యారు. సముద్రాల రాఘవాచార్య రాసిన పూర్తి స్క్రిప్టు వున్నా ఇతర పాత్రలపై డామినేట్‌ చేసే లక్షణాన్ని అలవాటు చేసుకున్న ఎన్టీయార్‌ ఈ సినిమాలోనూ దాన్ని కనబర్చారు. రావణాసురుడిలో వున్న అసుర లక్షణాలను పూర్తిగా తగ్గించి సినిమా తీశారు. పైగా వాచికాభినయంలో కృత్రిమత్వం కనిపిస్తుంటుంది. అంతకు ముందు వచ్చిన దానవీరశూరకర్ణలోని దుర్యోధనుడి పాత్ర ప్రభావం ఇందులో పడినట్టు తోస్తుంది. ఇందులో తనకు తాను ద్రావిడ జాతిగా చెప్పుకుంటాడు రావణుడు. పైగా ద్రావిడ జాతిని అంతం చేయడానికి వచ్చిన ఆర్యుడు రాముడని రావణుడితో చెప్పిస్తాడు ఎన్టీఆర్‌.

రావణుడి పాత్రపై ఎన్టీయార్‌ ఎంతగా మనసు పారేసుకున్నారంటే అవకాశం వచ్చినప్పుడల్లా వేసేటంతగా! ఇన్ని సినిమాల్లో చేసినా ఎన్టీయార్‌లో రావణ పాత్రపై చిత్తం పోలేదు. తాను ముఖ్యమంత్రిగా వున్నకాలంలో ఇష్టపడి నిర్మించుకున్న బ్రహ్మర్షి విశ్వామిత్రలోనూ ఎన్టీయార్‌ రావణుడి పాత్రను పోషించారు. ఈ సినిమాలో అయితే మీద పడిన వయసు స్పష్టంగా కనిపిస్తుంది. గొంతులో గాంభీర్యత లోపించింది. ఏదో చేయాలి కాబట్టి చేసినట్టే వుంటుంది. తెలుగు తెరపై , ఒక్క తెలుగేమిటీ మరే ఇతర భారతీయ భాషల్లోనూ ఓ నటుడు రావణుడి పాత్రను ఇన్ని సార్లు పోషించింది లేదు. ఈ ఘనత కూడా నందమూరికే దక్కుతుంది. నందమూరి నటనాభిలాష ఎలాంటిదో ఆయన శత జయంతి నాడు గుర్తు చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన అభిమాన పాత్రను గురించి ఇంతగా చెప్పుకోవాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడి పాత్రను ఎన్టీయార్‌ ఎంతగా జగద్విఖ్యాతం చేశారో రావణుడి పాత్రను కూడా అంతే సుప్రసిద్ధం చేశారు. భవిష్యత్తులో రావణుడి పాత్రను ఎన్టీయార్‌లా ఇంకెవరూ తీర్చిదిద్దలేరు…

దశకంఠుడిగా ఎన్టీయార్‌ నటనకు అచ్చెరువొందిన ఓ పీఠాధిపతి స్వయంగా రామారావును దగ్గరికి పిలిపించుకుని విశ్వ విఖ్యాత నటసార్వభౌమ బిరుదును ప్రదానం చేశారు. ఆధ్యాత్మిక చింతనలో వుండే పీఠాధిపతి ఎన్టీయార్‌ను తదేకంగా చూసి నీవు కారణజన్ముడవయ్యా ఆంధ్రుల అదృష్టం కొద్ది ఇక్కడ జన్మించావు, రాముడిగా రాణించిన నీవే రావణబ్రహ్మగా అద్భుతంగా నటించావు అంటూ కొనియాడారు. ఓ నటుడికి ఇంతకంటే ఏం కావాలి? అన్నటు సుందరకాండలో రావణాసురుడి అందాన్ని వాల్మీకి చక్కగా వర్ణించాడు. నిండు సభలో కొలువుతీరిన రావణుడిని చూసి హనుమంతుడు ఇలా అనుకున్నాడు. ఆహా …ఈ రూపం అత్యద్భుతం.. ఇంతటి ధైర్యం కూడా నిరుపమానమే… తేజస్సు మహా గొప్పగా వుంది.. అని మారుతి అనుకున్నాడు. ఇంత అందమైన రావణుడి పాత్రకు ఎన్టీయార్‌ను కాకుండా ఇంకెవరినైనా ఊహించుకోవడం కష్టమే. అందుకే ప్రతినాయకుడే అయినా ప్రేక్షకులు ఎన్టీయార్‌కు జై కొట్టింది. జేజేలు పలికింది.

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం