ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలోని ఎమర్ మఠంలో గుప్త నిధుల కోసం మళ్లీ వేట.. మరో విలువైన నిధి ఉందని అధికారుల తవ్వకాలు
ఒడిశా రాష్ట్రంలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలో గుప్తనిధుల కోసం మళ్లీ తవ్వకాలు ప్రారంభించింది అధికార యంత్రాంగం.
Odisha’s Jagannath Temple – Treasure Hunt: ఒడిశా రాష్ట్రంలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలో గుప్తనిధుల కోసం మళ్లీ తవ్వకాలు ప్రారంభించింది అధికార యంత్రాంగం. ఆలయం ప్రాంగణంలో ఉన్న ఎమర్ మఠంలో ఈ తవ్వకాలు జరుపుతున్నారు. పురావస్తు శాఖకు చెందిన అధికారులు, నిపుణులు 12వ శతాబ్దానికి చెందిన మఠంలో తవ్వకాలు జరుపుతున్నారు. మెటల్ డిటెక్టర్ల సాయంతో ఈ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఎమర్‌మఠాధిపతి నారాయణ్ రామానుజదాస్ ఇచ్చిన సమాచారంతో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి.
ఎమర్ మఠంలో చాలా విలువైన నిధి దాగి ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో కూడా నిధుల కోసం ఈ మఠంలో తవ్వకాలు జరిపారు. 2011లో జరిపిన తవ్వకాల్లో 18 టన్నుల వెండి వస్తువులు లభించాయి. అప్పట్లోనే దీని విలువ 90 కోట్లుగా గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన తవ్వకాల్లో కూడా భారీగా వెండి బయటపడింది. పురాతన ఖడ్గాలు, వెండి పువ్వులు, కాంస్యపు ఆవు ఈ మఠంలో లభించాయి.
1050 సంవత్సరంలో పూరిలో రామానుజాచార్య ఈ మఠాన్ని ఏర్పాటు చేశారు. జగన్నాథ ఆలయ అధికారులు, పూరి జిల్లా కలెక్టర్ కేవి సింగ్, ఎమర్ ట్రస్ట్ మెంబర్ల సమక్షంలో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. విలువైన నిధి ఇంకా ఉందన్న సమాచారంతో మఠం లోని అడుగడుగును పరిశీలిస్తున్నారు అధికారులు. తవ్వకాల్లో ఇప్పటికే లభించిన వస్తువులను భద్రపర్చారు.
పూరి ఆలయంలోనే దొరికిన వస్తువులను భద్రపర్చారు. పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా, పూరిలో రామానుజాచార్య 18 మఠాలను ఏర్పాటు చేశారు. ఎమర్ మఠం శిథిలావస్థకు చేరుకొని చాలా భాగం కుప్పకూలింది. అయితే మఠంలో చాలా విలువైన నిధి ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే అధికారులు పదేపదే తవ్వకాలు జరుపుతున్నారు. శ్రీ జగన్నాథ ఆలయానికి ఈ మఠాలపై పర్యవేక్షణ ఉంది.
Read also: TDP: డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు.. పోలీసు విధులకు ఆటంకం.. టీడీపీ నేతలపై కేసు