AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

38 ఏళ్లుగా అమెజాన్ అడవిలో ఒంటరిగా.. 1,500 చెట్లు నాటి జీవిస్తున్న ‘చికో’ కథ ఇదే!

ఓ వైపు సూపర్ మార్కెట్లు..మరోవైపు ఆన్‌లైన్ డెలివరీలు..చేతిలో స్మార్ట్‌ఫోన్..క్షణాల్లో కావాల్సిన వస్తువు ఇంటి ముందు. ఇదే నేటి ప్రపంచ జీవితం. కానీ ఈ సౌకర్యాలన్నింటికీ దూరంగా, దట్టమైన అమెజాన్ అడవిలో 38 ఏళ్లుగా ఓ వ్యక్తి ఒంటరిగా జీవిస్తున్నాడు. అతని పేరు చికో. బ్యాంకులు లేవు.. మార్కెట్లు లేవు.. సోషల్ మీడియా లేదు.విద్యుత్, ఫ్రిజ్ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా అతని జీవితంలో భాగం కాదు. అయినప్పటికీ తన చుట్టూ ఉన్న ప్రకృతినే ఆధారంగా చేసుకుని చికో తనకంటూ ఓ ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు. ఇటీవల ఓ యూట్యూబర్ల బృందం అమెజాన్‌లోకి వెళ్లి చికోను కలవడంతో..అతని అసాధారణ జీవితం ప్రపంచం దృష్టికి వచ్చింది.

38 ఏళ్లుగా అమెజాన్ అడవిలో ఒంటరిగా.. 1,500 చెట్లు నాటి జీవిస్తున్న ‘చికో’ కథ ఇదే!
Meet Chico, The Man Who Has Lived Alone In The Amazon For 38 Years
Sharada V
|

Updated on: Sep 25, 2026 | 6:59 PM

Share

చికో జీవితంలో ఆశ్చర్యకర విషయం అతను 1,500 బ్రెజిల్ నట్స్ చెట్లను నాటాడమే. అది కూడా 38 ఏళ్ల క్రితం. తాను నాటిన చెట్ల పంటను చూడటానికి చికో దశాబ్దాలు వేచి చూశాడు. ఈ ఏడాదే తొలిసారిగా ఆ చెట్ల నుంచి బ్రెజిల్ నట్స్ ను కోయడం విశేషం. అమెజాన్‌లోకి వెళ్లిన బృంద సభ్యులకు ఇది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.

‘ఇది అడవి కాదు..నా తోట’

దూరం నుంచి చూస్తే చికో చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం దట్టమైన అడవిలాగే కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాతే అసలు విషయం తెలిసింది. అక్కడ కనిపించే చాలా చెట్లు చికో స్వయంగా నాటినవే. అరటిపండ్లు, మామిడి, బ్రెజిల్ నట్స్ అతని జీవనాధారంగా మారాయి. బృంద సభ్యులు ఆశ్చర్యపోతూ.. ‘నువ్వు ఏకంగా ఓ సూపర్ మార్కెట్‌నే నాటేశావు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే చికో మాత్రం దాన్ని అడవిగా చూడడు. అతని దృష్టిలో అది ఎన్నో ఏళ్ల శ్రమతో తాను నిర్మించుకున్న తోట.

డబ్బు కాదు.. ప్రకృతే జీవనాధారం

చికో జీవన విధానంలో మరో ఆసక్తికర విషయం ఉంది. అక్కడ డబ్బుకు పెద్దగా విలువ ఉండదని అతను చెబుతాడు. “మీరు ఉద్యోగం చేస్తారు..డబ్బు సంపాదిస్తారు..ఆ డబ్బుతో కావాల్సినవి కొనుక్కుంటారు. కానీ ఇక్కడ డబ్బుకు విలువ ఉండదు. మీకు కావాల్సినవి మీరే ఉత్పత్తి చేసుకోవాలి”, ఇదే భావనతో అతను జీవిస్తున్నాడు. తాగునీటి కోసం వర్షపు నీటిని సేకరిస్తాడు. ఆహారం కోసం పండ్లతో పాటు వేటపై కూడా ఆధారపడతాడు.

Yes Theory బృందం చికోను కలవడానికి అమెజాన్‌లోకి వెళ్లినప్పుడు.. తమకు ఎలాంటి అనుభవం ఎదురవుతుందో వారికి కూడా పూర్తిగా తెలియదు. చివరకు చికో ఉన్న ప్రాంతానికి చేరుకున్నప్పుడు అతను వారికి సిద్ధంగా కనిపించాడు. వారు ఎప్పుడు వస్తారో కచ్చితంగా తెలియకపోయినా.. చికో వేటకు వెళ్లి అడవి పందిని వేటాడి అతిథుల కోసం ఆహారం సిద్ధం చేశాడు. అతని జీవితంలో అతిథులకు ఆహారం అంటే ఇదే. ఫ్రిజ్ లేదు.. ఆహారాన్ని నిల్వ చేసుకునే ఆధునిక సదుపాయాలు లేవు. అందుకే వేటలో దొరికిన మాంసాన్ని ఉప్పుతో భద్రపరుస్తాడు. “ఇక్కడ ఎక్కువ ఎంపికలు ఉండవు. వేటకు వెళ్తాను..ఏది దొరికితే అది తింటాను” అనే అర్థంలో చికో తన జీవన విధానాన్ని వివరించాడు.

చుట్టూ పాములు..జాగ్వార్‌ పులులు.. ప్రమాదకర జీవులు

అమెజాన్‌లో జీవితం అంత సులభం కాదు. చికో నివసించే ప్రాంతంలో పాములు, జాగ్వర్లు, కైమాన్లు, పిరానాలు వంటి ప్రమాదకర చేపలు ఉన్నాయి. అడవిలో నడిచేటప్పుడు ఎక్కడ అడుగు వేయాలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు.. చికో దశాబ్దాలుగా పెంచిన బ్రెజిల్ నట్ చెట్లు కూడా ప్రమాదకరమే. వాటి పండ్లు భారీగా ఉంటాయి. ఎత్తు నుంచి కిందపడే సమయంలో అవి తీవ్ర గాయాలు కలిగించవచ్చు. చికో తన అమెజాన్ జీవితంలో మూడు జాగ్వర్లను కాల్చినట్లు బృంద సభ్యులకు చెప్పాడు.

అమెజాన్‌లో నదులే జీవనాడి

చికో అమెజాన్ జీవితం గురించి మరో ముఖ్యమైన విషయం చెప్పాడు. అమెజాన్‌లోని విస్తారమైన ప్రాంతంలో చాలా తక్కువ మంది మాత్రమే నివసిస్తారని, అక్కడ జీవించే చాలా మంది ప్రజలు నదులకు సమీపంలోనే ఉంటారని చెప్పాడు. ఎందుకంటే అమెజాన్‌లో నదులే రవాణా, నీరు, ఆహారం..జీవనానికి ప్రధాన ఆధారం. కానీ చికో మాత్రం నదులకు దూరంగా అడవిలో జీవిస్తున్నాడు.

అసలు ఎందుకు ఒంటరిగా ఉంటున్నాడు?

ఇక్కడే చికో కథలో భావోద్వేగ కోణం బయటపడింది.అతను ఎందుకు ఇంతకాలం సమాజానికి దూరంగా ఉన్నాడన్న ప్రశ్నకు..అతని గత జీవితంతో సంబంధం ఉండొచ్చని బృంద సభ్యులు భావించారు. చికో తన పిల్లలను చాలా కాలంగా కలవలేదని కూడా వారు తెలుసుకున్నారు. అతని ఒంటరితనం కేవలం ఆధునిక జీవితాన్ని తిరస్కరించడమే కాదని..గతంలో జరిగిన కొన్ని విషయాల కారణంగా అతను ఈ జీవితాన్ని ఎంచుకుని ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది.

చికో మనసులో అసలు ఏముంది

38 ఏళ్ల తర్వాత భూమిని వదిలి వెళ్లాల్సిందేనా? ఇంతకాలం జీవించిన అడవే ఇప్పుడు చికోకు సమస్యగా మారే పరిస్థితి కనిపించింది. బృందానికి తెలిసిన సమాచారం ప్రకారం..ఇటీవల ఓ వ్యక్తి అక్కడికి వచ్చి ఆ భూమి తనదేనని, చికో అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇది బృంద సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. “38 ఏళ్లుగా ఇక్కడ చెట్లు నాటి, ఇల్లు కట్టుకుని జీవిస్తున్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి?” అనే ప్రశ్న తలెత్తింది. ముఖ్యంగా 1,500 బ్రెజిల్ నట్ చెట్లను పెంచడానికి చికో పెట్టిన శ్రమ అంతా ఇక్కడే ఉంది. ‘అమెజాన్‌లో ఒంటరి మనిషి’ అనుకున్నారు..కానీ మరొకరు ఉన్నట్లు తెలిసింది!

Yes Theory బృందం మొదట చికోను అమెజాన్‌లో అత్యంత ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తిగా భావించి అతన్ని కలవడానికి వెళ్లింది. కానీ అతనితో గడిపిన తర్వాత వారి అభిప్రాయం కొంత మారింది. చికో అతిథులను ఆప్యాయంగా స్వాగతించాడు. వారితో కలిసి భోజనం చేశాడు. అడవిని చూపించాడు. పడవలో వారితో ప్రయాణించాడు. భాష అడ్డంకిగా మారినా..నవ్వులు మాత్రం ఆ లోటును భర్తీ చేశాయి. చల్లటి పానీయాలు కూడా అతనితో పంచుకున్నారు.ఫ్రిజ్ లేకపోవడంతో చల్లటి బీర్ తాగడం తనకు ఇష్టమని చికో చెప్పినట్లు బృందం తెలిపింది. చివరికి మిగిలేది.. అడవి మాత్రమే

బృందం తిరిగి వెళ్లే సమయం వచ్చింది

వారు వెళ్లిపోయిన తర్వాత చికో మళ్లీ తనకు అలవాటైన ప్రపంచంలోకి వెళ్లిపోయాడు. చుట్టూ వేలాది చెట్లు..అడవి శబ్దాలు..వర్షపు నీరు..వేట..పంటలు. అతని ప్రపంచంలో సూపర్ మార్కెట్ లేదు..బ్యాంకు లేదు..సోషల్ మీడియా లేదు. కానీ 38 ఏళ్లుగా అతను తన చేతులతో నిర్మించుకున్న జీవితం ఉంది. అందులో ముఖ్యమైన గుర్తు..38 ఏళ్ల క్రితం నాటిన 1,500 బ్రెజిల్ నట్స్ చెట్లు. దాదాపు నాలుగు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆ చెట్లు అతనికి రీసెంట్ గా  తొలి పంటను ఇచ్చాయి.

ఆధునిక ప్రపంచం రోజులు, గంటలు, నిమిషాల్లో ఫలితాలను కోరుకుంటుంటే..చికో మాత్రం 38 ఏళ్లు వేచి చూసి తన పంటను అందుకున్నాడు. బహుశా అతని కథలో అన్నిటికంటే ప్రత్యేకమైన విషయం ఇదే. అతను అమెజాన్ అడవిలోకి వెళ్లి కనిపించకుండా పోలేదు. ఆ అడవిలోనే తనకంటూ ఓ జీవితాన్ని నాటుకున్నాడు.

మరిన్ని వింతలు విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us