AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో కనీ వినీ ఎరుగని ఆస్పత్రి.. రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా వైద్యం అందించేందుకు సిద్ధమవుతున్న వైద్యాలయం

ఉచిత వైద్యమే కాదు... వైద్య విద్యను కూడా ఉచితంగా అందిస్తూ దేశంలోనే మొట్ట మొదటి వైద్య కళాశాలగా ఘనత సాధించిన శ్రీ మధుసూధన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్... భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి నాటికి మరో 600 పడకల ఆస్పత్రిని సత్యసాయి గ్రామంలో సిద్ధం చేస్తోంది. ఆ అద్భుత నిర్మాణం సాగుతున్న ప్రదేశంలో 300 మంది కార్మికులు, ఇంజనీర్లు, ఇతర సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా నేలపై ఓ అద్భుతాన్ని సృష్టించేందుకు శ్రమిస్తున్నారు.

ప్రపంచంలో కనీ వినీ ఎరుగని ఆస్పత్రి.. రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా వైద్యం అందించేందుకు సిద్ధమవుతున్న వైద్యాలయం
Unique Hospital
Surya Kala
| Edited By: Basha Shek|

Updated on: Aug 23, 2025 | 10:22 PM

Share

ఛత్తీస్ ఘడ్ లో రాయపూర్ సత్యసాయి సంజీవనితో మొదలైన ఈ ప్రేమ వాహిని.. దేశం ఎల్లలు ఎప్పుడో దాటిపోయింది. కేవలం భారత దేశంలోని రాష్ట్రాల్లోనే కాకుండా 12 దేశాల్లో వైద్య సేవలు అందిస్తోంది. కర్నాటక రాష్ట్రంలోని ముద్దెనహళ్లి సమీపంలోని సత్యసాయి గ్రామలో ఏర్పాటు చేసిన శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఇప్పటికే రోజుకు వెయ్యి మందికి పైగా ఔట్ పేషంట్లకు సేవలందిస్తోంది. ఈ ఆస్పత్రి ప్రాణం పోసిన బిడ్డలకు, పునర్జన్మనందించిన రోగుల సంఖ్య ఎప్పుడో వేలు దాటి ఏ రోజుకారోజు పెరుగుతూనే ఉంది.

ఉచిత వైద్యమే కాదు… వైద్య విద్యను కూడా ఉచితంగా అందిస్తూ దేశంలోనే మొట్ట మొదటి వైద్య కళాశాలగా ఘనత సాధించిన శ్రీ మధుసూధన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్… భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి నాటికి మరో 600 పడకల ఆస్పత్రిని సత్యసాయి గ్రామంలో సిద్ధం చేస్తోంది. ఆ అద్భుత నిర్మాణం సాగుతున్న ప్రదేశంలో 300 మంది కార్మికులు, ఇంజనీర్లు, ఇతర సిబ్బంది రాత్రి పగలు తేడా లేకుండా నేలపై ఓ అద్భుతాన్ని సృష్టించేందుకు శ్రమిస్తున్నారు.

మొత్తం 6లక్షల 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆస్పత్రి సిద్ధమవుతోంది. 11 ఆపరేషన్ థియేటర్లు, 400 జనరల్ బెడ్స్, 100 ఐసీయూ బెడ్స్, 100 ప్రైవేట్ బెడ్స్ అంటే మొత్తం 600 పడకలతో నిర్మాణమవుతోంది. ఇది ఆస్పత్రి అసలు స్వరూపం. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నే రీతిలో, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా… కుల-మత-వర్గ భేదాలు లేకుండా… పేద-ధనిక తేడా లేకుండా అందరికీ ఉచితంగా వైద్యం అందించేందుకు సిద్ధమవుతున్న మహోన్నత వైద్యాలయం. సత్యసాయి శత జయంతి వేడుకల నాటికి మన కళ్ల ముందు సాక్షాత్కరించేంది ముమ్మూర్తులా ఇదే భవనం. ఎప్పటిలాగే ఇక్కడ కూడా బిల్లింగ్ కౌంటర్ ఊసే ఉండదు. అన్ని వైద్య సేవలు పూర్తిగా ఉచితం. సరిగ్గా ఈ భవనంలోని నడి మధ్యలో 21 అడుగల నిండైన సత్యసాయి శిల్పం మనకు కన్నుల విందు చేయనుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఆస్పత్రిలో వైద్య సౌకర్యాల విషయానికొస్తే…. ఇక్కడ రోగులు వేచి ఉండే ప్రదేశం నుంచీ ఐసీయూల వరకు ఎక్కడ చూసినా అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఉట్టిపడుతూనే ఉంటుంది. అత్యవసర వైద్య సేవలకోసం 33 పడకల ఎమర్జెన్సీ వార్డు, 11 ఆపరేషన్ థియేటర్లు, 400 పడకల జనరల్ వార్డు, 100కి పైగా పడకలతో ఐసీయూ, అవే కాకుండా మరో 100 పడకల ప్రైవేటు వార్డులతో సిద్ధమవుతోంది. ఇక ల్యాబ్ సౌకర్యాల విషయానికొస్తే C T స్కాన్, MRI సహా అత్యుత్తమ మెడికల్ ల్యాబ్ సౌకర్యాలు ఈ ఆస్పత్రి సొంతం.

కేవలం రోగులకు మాత్రమే కాదు వారి వెంట వచ్చే సహాయకులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చెయ్యడం శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ & రీసెర్చ్ ప్రత్యేకత. ఇప్పటికే ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వైద్య సేవల కోసం వచ్చిన వారికి ఆ సంగతి బాగా తెలుసు. ఈ 600 పడకల ఆస్పత్రిలో కూడా అదే స్థాయి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఒకేసారి 300 మంది కూర్చొని భోజనం చేసేలా డైనింగ్ హాల్‌ను సిద్ధం చేస్తున్నారు.

అడగడుగునా అత్యుత్తమ నిర్మాణ శైలితో, ప్రశాంత వాతావరణంలో ఈ ఆస్పత్రి రోగుల బాధల్ని తీర్చే దేవాలయాన్ని తలపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉచితంగా వైద్యం అందించడం అంటే ఏదో ఒక రకంగా అందించడం కాదు. అత్యుత్తమం కన్నా ఉత్తమంగా సేవలందించడం అన్నది సత్యసాబాబా వారి మాట. ఆయన మాటల్ని అడుగడుగునా ఆచరణలో చూపిస్తున్నారు శ్రీ మధుసూదన్ సాయి. సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకల నేపథ్యంలో ఈ 600 పడకల ఉచిత వైద్యాలయాన్ని 2025 నవంబర్లో ప్రారంభించబోతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఈ స్థాయి ఆస్పత్రిని నిర్మించడం.. దేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని సందర్భం..

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా దేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ఈ సేవా మహా యజ్ఞంలో భాగస్వాములవుతున్నాయి. డబ్బులేని కారణంగా ఏ ఒక్కరికీ వైద్యం అందకుండా పోకూడదన్న శ్రీ మధుసూదన్ సాయి లక్ష్యానికి తోడుగా నిలుస్తున్నాయి. అయితే కేవలం కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, ప్రతి వ్యక్తికీ ఇండివిడ్యువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. కనుక వన్ వరల్డ్- వన్ ఫ్యామిలీ లక్ష్యంగా సాగుతున్న ఈ సేవా యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..