Supreme Court: బిచ్చమెత్తుకోవాలని ఎవరు కోరుకుంటారు.. భిక్షాటనపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Supreme Court on Begging: వీధుల్లో బిక్షాటనపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భిక్షాటనను నిషేధించేందుకు ఉన్నత వర్గాలకు అనుకూలమైన పక్షపాత ధోరణిని ప్రదర్శించలేమంటూ అత్యున్నత
Supreme Court on Begging: వీధుల్లో బిక్షాటనపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భిక్షాటనను నిషేధించేందుకు ఉన్నత వర్గాలకు అనుకూలమైన పక్షపాత ధోరణిని ప్రదర్శించలేమంటూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. విద్య, ఉపాధి లేకపోవడంతో కనీస జీవనోపాధిని పొందడం కోసం బిచ్చమెత్తుకోవడానికి వీధుల్లోకి వస్తున్నారంటూ వెల్లడించింది. భిక్షాటన అనేది సాంఘిక, ఆర్థిక సమస్య అంటూ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతోపాటు కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వీధుల్లో తిరిగుతూ.. యాచకులకు, నిరాశ్రయులకు వ్యాక్సిన్లు వేయించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
బిక్షాటనను నియంత్రించాలని.. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారించింది. అయితే.. ఈ దృక్పథాన్ని అనుసరించలేమంటూ ధర్మాసనం స్పష్టంచేసింది. యాచకులకు వేరే అవకాశాలేవీ లేవని.. ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించింది. బిచ్చమెత్తుకోవాలని ఎవరూ కోరుకోరని పేర్కొన్నారు. వీధులు, బహిరంగ స్థలాలు, ట్రాఫిక్ జంక్షన్ల నుంచి యాచకులను, బిచ్చగాళ్లను తొలగించాలని తాము ఆదేశించలేమంటూ న్యాయమూర్తులు ఈ సందర్భంగా స్పష్టంచేశారు. ఇది ప్రభుత్వం స్పందించవలసిన సాంఘిక సంక్షేమ విధానానికి సంబందించిన విషయమంటూ పేర్కొన్నారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా.. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అడ్వకేట్ కుశ్ కల్రా దాఖలు చేశారు. ట్రాఫిక్ కూడళ్లు, మార్కెట్లు, బహిరంగ స్థలాల్లో భిక్షాటనను నిరోధించాలని పిటిషన్ దాఖలు చేశారు. బిచ్చగాళ్లు, యాచకులను తొలగించాలంటూ పిటిషన్‌లో కోరారు.
Also Read: