ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. పోలీస్ స్టేషన్‌లో భర్త చేసిన ఊహించని పనికి అంతా షాక్..
రక్షణ ఉండాల్సిన చోటే రక్తపాతం చోటుచేసుకుంది. భార్య తన ప్రేమికుడితో పారిపోయిందన్న కక్షతో ఒక భర్త పోలీస్ స్టేషన్ లోపలే ఎవరూ ఊహించని ఘటనకు పాల్పడ్డాడు. అసలు ఏం జరిగింది..? ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఎంత? హర్దోయ్‌లో జరిగిన ఈ షాకింగ్ ఘటన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రక్షణగా ఉండాల్సిన పోలీస్ స్టేషనే ఒక హత్యకు వేదికైంది. తన భార్య మరొకరితో పారిపోయిందన్న కోపంతో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆమెపై తూటాల వర్షం కురిపించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాలో కలకలం రేపింది. అనుప్, సోనిలకు 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఈ నెల 7న సోని తన భర్తను వదిలేసి, సుర్జీత్ అనే వ్యక్తితో పారిపోయింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు జనవరి 11న ఆమెను గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను పాలి పోలీస్ స్టేషన్‌కు తరలించి, పోలీసు కస్టడీలో ఉంచారు.
స్టేషన్ క్యాంటీన్ వద్దే దారుణం
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సోని టిఫిన్ కోసం స్టేషన్ లోపల ఉన్న క్యాంటీన్ వైపు వెళ్తుండగా.. అప్పటికే అక్కడ మాటు వేసిన భర్త అనుప్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. తన వద్ద ఉన్న ఆయుధంతో ఆమెను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చాడు. తీవ్ర గాయాలైన సోనిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
పోలీసుల భద్రతపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు
అత్యంత రక్షణగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్ లోపలికి నిందితుడు ఆయుధంతో ఎలా ప్రవేశించాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లోపలికి వచ్చేటప్పుడు తనిఖీలు చేయలేదా?, పోలీసుల కస్టడీలో ఉన్న మహిళకు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందారా?, ఆయుధం నిందితుడికి ఎక్కడ నుంచి వచ్చింది? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై హర్దోయ్ ఎస్పీ అశోక్ కుమార్ మీనా తీవ్రంగా స్పందించారు. నిందితుడు అనుప్‌ను ఆయుధంతో సహా వెంటనే అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలం నుండి ఆధారాలను సేకరించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు సిబ్బందిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. 17 ఏళ్ల బంధం ద్రోహంతో ముగిసిందన్న ఆక్రోశం ఒకరి ప్రాణం తీయగా.. పోలీసుల నిర్లక్ష్యం వ్యవస్థకే మచ్చ తెచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
