Viral News: 60 ఏళ్లు దాటాక తోడు కావాలా? వృద్ధుల కోసం ‘మ్యాచ్ మేకింగ్’.. ఇంతకీ ఎంటిది?
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒంటరితనం అనేది పెద్ద శాపంగా మారింది. ముఖ్యంగా వృద్ధాప్యంలో తోడు కోల్పోయిన వారి పరిస్థితి వర్ణనాతీతం. పిల్లలు విదేశాల్లోనో, ఇతర నగరాల్లోనో స్థిరపడటంతో.. నాలుగు గోడల మధ్య మౌనంగా కాలం గడిపే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. సరిగ్గా ఇలాంటి వారి కోసమే పుణెకు చెందిన మాధవ్ దామ్లే ఒక ముందడుగు వేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో వెనుక ఉన్న స్ఫూర్తిదాయక కథనం ఇది.

ఇటీవల పుణెలో జరిగిన ఒక సీనియర్ సిటిజన్ మ్యారేజ్ బ్యూరో మీటప్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అందులో వృద్ధులు ఎంతో ఉత్సాహంగా తమకు కాబోయే భాగస్వామి గురించి, తమ అభిరుచుల గురించి మాట్లాడుకోవడం కనిపిస్తుంది. ఈ వయసులో పెళ్లి ఏంటి? అని ఈసడించుకునే సమాజంలో.. తోడుకు వయసుతో సంబంధం లేదుని నిరూపిస్తోంది ఈ వీడియో. ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి మాధవ్ దామ్లే. ఆయన హ్యాపీ బ్యాచిలర్స్ అనే సంస్థను నడుపుతున్నారు. వృద్ధాప్యంలో కేవలం శారీరక ఆరోగ్యం ఉంటే సరిపోదు. మానసిక ఉల్లాసం కూడా ముఖ్యమని దామ్లే అంటున్నారు. జీవిత చరమాంకంలో కష్టసుఖాలు పంచుకోవడానికి ఒక తోడు ఉండటం వల్ల డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. సమాజం ఏమనుకుంటుందో అన్న భయాన్ని వీడి, తమ కోసం తాము జీవించాలని ఆయన వృద్ధులను ప్రోత్సహిస్తున్నారు.
పెళ్లి మాత్రమే కాదు.. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కూడా!
మాధవ్ దామ్లే నిర్వహిస్తున్న ఈ వేదికపై కేవలం పెళ్లి సంబంధాలు మాత్రమే కాదు, లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కోరుకునే వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. చట్టపరమైన చిక్కులు రాకుండా, ఆస్తి తగాదాలు లేకుండా ఒప్పంద పత్రాల ద్వారా ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. దీనివల్ల వృద్ధులు తమ మిగిలిన జీవితాన్ని ఒంటరిగా కాకుండా, ఒక ఆత్మీయ మిత్రుడితో గడిపే వీలు కలుగుతోంది. ఈ వైరల్ వీడియో తర్వాత మాధవ్ దామ్లేకు ఫోన్ కాల్స్ వెల్లువెత్తుతున్నాయి.
కేవలం పుణె నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది సీనియర్ సిటిజన్లు తమకు తోడు కావాలంటూ ఆయన్ను సంప్రదిస్తున్నారు. వయసు మళ్ళిన తర్వాత ప్రేమ, తోడు వెతుక్కోవడం తప్పు కాదని.. అది ఒక అవసరమని దామ్లె ప్రయత్నం వివరిస్తోంది. వృద్ధుల ముఖంలో చిరునవ్వు చిందిస్తున్న మాధవ్ దామ్లే ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
వీడియో చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
