బ్రిటీష్ పాలనలో లేని భారత్‌లోని ఏకైక రాష్ట్రం.. దాని వెనకున్న అసలు కథ ఏంటంటే..?
బ్రిటిష్ వారు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలారు.. కానీ దేశంలోని ఒక చిన్న రాష్ట్రాన్ని మాత్రం అస్సలు తాకలేకపోయారు.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు దేశమంతా తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న తెల్లదొరలు, గోవా వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. అసలు బ్రిటిష్ వారికే సవాల్ విసిరిన ఆ శక్తేది? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. కానీ మన దేశ చరిత్రను గమనిస్తే ఒక విచిత్రమైన నిజం కనిపిస్తుంది. దాదాపు రెండు శతాబ్దాల పాటు భారతదేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న బ్రిటీష్ వారు దేశంలోని ఒక చిన్న రాష్ట్రాన్ని మాత్రం అస్సలు తాకలేకపోయారు. అదే మన గోవా. అసలు బ్రిటీష్ వారు గోవాను ఎందుకు ఆక్రమించలేకపోయారు..? అక్కడ వారి ఆటలు ఎందుకు సాగలేదు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తెల్లదొరల దోపిడీకి దొరకని ప్రాంతం
బ్రిటీష్ వారు కేవలం వ్యాపారం కోసం వచ్చి, ఇక్కడి రాజుల మధ్య ఉన్న విభేదాలను ఆసరాగా చేసుకుని దేశాన్ని వలసరాజ్యంగా మార్చుకున్నారు. పన్నుల భారం, వనరుల దోపిడీతో భారత్‌ను పీల్చి పిప్పి చేశారు. కానీ ఈ సుదీర్ఘ పాలనలో గోవా మాత్రం వారి నియంత్రణలోకి వెళ్లలేదు. దీనికి ప్రధాన కారణం బ్రిటీష్ వారు రాకముందే అక్కడ మరొక విదేశీ శక్తి తిష్ట వేయడమే!
పోర్చుగీసుల కోట: 1498 నుంచే మొదలు
బ్రిటీష్ వారు 1608లో సూరత్ చేరుకోవడానికి వంద ఏళ్ల ముందే.. అంటే 1498లో వాస్కో డ గామా కేరళ తీరానికి చేరుకున్నాడు. ఆ తర్వాత పోర్చుగీసు వారు గోవాను తమ ప్రధాన స్థావరంగా మార్చుకున్నారు. కేవలం వాణిజ్యమే కాకుండా వారు అక్కడ పటిష్టమైన సైనిక, పరిపాలనా వ్యవస్థను నిర్మించుకున్నారు.
బ్రిటీష్ – పోర్చుగీస్ మధ్య ఆధిపత్య పోరు
బ్రిటీష్ వారు భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలను ఆక్రమిస్తున్న సమయంలో గోవాపై కూడా కన్నేశారు. కానీ అప్పటికే అక్కడ పాతుకుపోయిన పోర్చుగీసు వారు బ్రిటీష్ వారికి గట్టి పోటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య అనేక ఘర్షణలు జరిగినప్పటికీ వ్యూహాత్మకంగా, భౌగోళికంగా కీలకమైన గోవాను పోర్చుగీసు వారు వదులుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా అప్పట్లో ఉన్న దౌత్య సంబంధాల వల్ల కూడా బ్రిటీష్ వారు పోర్చుగీసు వారితో నేరుగా పెద్ద యుద్ధానికి దిగడానికి వెనుకాడారు.
భారత్‌కు స్వేచ్ఛ వచ్చినా.. గోవాకు రాలేదు
ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజం. 1947 ఆగస్టు 15న బ్రిటీష్ వారు దేశం విడిచి వెళ్లిపోయినప్పుడు భారత్ అంతా సంబరాలు చేసుకుంది. కానీ గోవా మాత్రం ఇంకా పరాయి పాలనలోనే ఉంది. బ్రిటీష్ వారు వెళ్ళిపోయినా పోర్చుగీసు వారు గోవాను వదలడానికి నిరాకరించారు.
గోవా విముక్తి
దాదాపు 450 సంవత్సరాల సుదీర్ఘ పోర్చుగీస్ పాలన తర్వాత.. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ విజయ్ సైనిక చర్య ద్వారా..1961 డిసెంబర్ 19న గోవాకు విముక్తి లభించింది. భారత చరిత్రలో గోవా ఒక ప్రత్యేకమైన అధ్యాయం. బ్రిటీష్ వలసవాదానికి తలవంచని ఈ ప్రాంతం తనదైన విశిష్ట సంస్కృతిని, వారసత్వాన్ని నేటికీ కాపాడుకుంటూ పర్యాటక స్వర్గధామంగా విరాజిల్లుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
