”ప్రధాని మోదీ గౌరవాన్ని కాపాడుతాం, మా ఆత్మగౌరవాన్నీ రక్షించుకుంటాం”,రైతునేత నరేష్ తికాయత్
వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న అన్నదాతలు ప్రధాని మోదీ గౌరవాన్ని కాపాడుతారని, అయితే అదే సమయంలో తమ ఆత్మగౌరవానికి కూడా..
వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న అన్నదాతలు ప్రధాని మోదీ గౌరవాన్ని కాపాడుతారని, అయితే అదే సమయంలో తమ ఆత్మగౌరవానికి కూడా వారు కట్టుబడి ఉంటారని రైతు నేత నరేష్ తికాయత్ అన్నారు. రైతులతో చర్చలకు కేంద్రం కేవలం ఓ ఫోన్ కాల్ దూరంలోనే ఉందని మోదీ నిన్న వ్యాఖ్యానించిన నేపథ్యంలో ..నరేంద్ర తికాయత్ దీనిపై స్పందించారు. పోలీసులు అరెస్టు చేసిన రైతులను విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని ఆయన కోరారు. గౌరవప్రదమైన పరిష్కారానికి ప్రభుత్వం రావాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఒత్తిడితో తాము దేనినీ అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం గానీ, పార్లమెంటు గానీ తమ ముందు తల వంచాలని రైతులు కోరుకోవడంలేదన్నారు.
ఈ నెల 26 న జరిగిన హింస కుట్రలో భాగమని, జాతీయ పతాకాన్ని అగౌరవపరచరాదని తాము కోరుతున్నామన్నారు. రైతులపై ఢిల్లీ పోలీసులు 40 కేసులు పెట్టి, సుమారు 80 మందిని అరెస్టు చేశారు.