Fuel Prices: సమీప భవిష్యత్తులో పెట్రో ధరలు తగ్గుతాయా? ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే..

Fuel Prices: సమీప భవిష్యత్తులో పెట్రో ధరలు తగ్గుతాయా? ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే..
Finance Minister Nirmala Sitaraman

Fuel Prices: దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం ధరలు నిలకడగా ఉన్నా.. ఇప్పటి వరకు పెరిగిన ధరలతో వాహనదారులకు భారంగా మారుతోంది. పెట్రోల్‌,..

Subhash Goud

|

Aug 17, 2021 | 8:55 AM

Fuel Prices: దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం ధరలు నిలకడగా ఉన్నా.. ఇప్పటి వరకు పెరిగిన ధరలతో వాహనదారులకు భారంగా మారుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని వాహనదారులు గగ్గోలు పెడుతున్నా.. ఎలాంటి ఫలితం లేదు. అయితే సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయా..? అనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపు యోచన ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో లేదని మంత్రి స్పష్టం చేశారు. ఎక్సైజ్‌ సుంకాలు ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరాయన్న విమర్శల నేపథ్యంలో ఆర్థికమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం ఇంధన ధరలకు సంబంధించి భారీ సబ్సిడీలు ఇచ్చిందని ఆమె సూచనప్రాయంగా పేర్కొంటూ, ఇందుకు సంబంధించి చెల్లింపు భారాలు ఇప్పటికీ తీవ్రంగా ఉన్న కారణంగా ఎక్సైజ్‌ సుంకాల కోత అంశం ప్రస్తుతం పరిశీలనలో లేదని చెప్పుకొచ్చారు.

పెట్రో సుంకాలు తగ్గించం

ఇంధనం కొనుగోళ్లు-వ్యయాల మధ్య ఉన్న వ్యత్యా సాన్ని తగ్గించడానికి ప్రభుత్వ రంగ కంపెనీలకు యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన రూ.1.34 లక్షల కోట్ల విలువైన ఆయిల్‌ బాండ్లకు సంబంధించి గత ఏడేళ్లలో ప్రభుత్వంపై రూ. 70,196 కోట్లకుపైగా వడ్డీ భారం పడిందని అన్నారు. ఇంకా రూ.1.3 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఆయిల్‌ బాండ్ల భారాన్ని భరించాల్సిన స్థితి లేకపోయినట్లయితే, ఇంధనంపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే పరిస్థితిలో ఉండేవాళ్లం అని అన్నారు. అయితే రూ.1.34 లక్షల కోట్ల ఆయిల్‌ బాండ్ల విలువలో రూ.3,500 కోట్ల అసలును మాత్రమే ఇప్పటివరకూ చెల్లించడం జరిగిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం మధ్య ఇంకా రూ.1.3 లక్షల కోట్లను చెల్లించాల్సి ఉందన్నారు. పెట్రోల్‌పై ప్రస్తుతం లీటర్‌కు రూ.32.90 ఎక్సైజ్‌ సుంకం భారం పడుతుండగా, డీజిల్‌పై ఇది రూ.31.80గా ఉంది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ టాక్స్‌ తగ్గింపు కుదరదని తెలిపిన మంత్రి.. యూపీఏ హయాంలో జారీ చేసిన ఆయిల్‌ బాండ్స్‌ ఇందుకు కారణమన్నారు. ముడి చమురు ధర పెరిగినా ధరలు పెంచకుండా ఉండేందుకు, అప్పటి ప్రభుత్వం ఆయిల్‌ కంపెనీలకు ఈ రుణ పత్రాలు జారీ చేసింది.

పెట్రోలియం ప్రొడక్టులు

పెట్రోలియం ప్రొడక్టులను వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోనికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీతారామన్‌ తెలిపారు. రాష్ట్రాలు ఒప్పుకుంటేనే ఇది సాధ్యమవుతుందని, జీఎస్‌టీకి రాష్ట్రాలు అంగీకరిస్తే, ఎక్సైజ్‌ సుంకం, రాష్ట్రాలు విధించే వ్యాట్‌ ఒకే పన్నుగా మారతాయని అన్నారు. ద్వంద్వ పన్నుల విధానానికి (ఎక్సైజ్‌ సుంకంపై వ్యాట్‌ విధింపు) ఇది ముగింపు పలుకుతుంది అని మంత్రి అన్నారు.

రెట్రో ట్యాక్స్‌పై  త్వరలో నియమ నిబంధనలు

రెట్రో పన్ను రద్దు నేపథ్యంలో పరిస్థితుల నిర్వహణకు త్వరలో నియమ నిబంధనలు తీసుకురానున్నట్లు ఆర్థికమంత్రి వెల్లడించారు. రెట్రో పన్ను రద్దు పరిణామంతో ఈ పన్ను కింద వసూలయిన రూ.8,100 కోట్లను ప్రభుత్వం రిఫండ్‌ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.

ఇవీ కూడా చదవండి: మీరు ఉద్యోగం చేస్తున్నారా..? అయితే 15 రోజుల్లో ఈ పనిని పూర్తి చేయండి.. లేకపోతే పీఎఫ్‌ డబ్బులు ఇరుక్కుపోతాయి!

SBI Lunch Time: మీరు లంచ్‌ టైమ్‌లో బ్యాంకుకు వెళ్తున్నారా? అయితే మీ సమయం వృధా కాకుండా ఈ సమయాలను గుర్తించుకోండి

Taxpayers: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. త్వరలో కొత్త ఐటీ పోర్టల్‌.. ఇన్ఫోసిస్‌తో చర్చలు: కేంద్ర మంత్రి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu