క్లైమాక్స్‌కు సీఎం ఫైట్.. దానికి ముందే తేల్చేయనున్న హైకమాండ్.. పీఠం ఎవరిదంటే..?
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నదే మూడు రాష్ట్రాల్లో.. అందులో దక్షిణాది నుంచే రెండు రాష్ట్రాలు.. కర్ణాటక, తెలంగాణ. అయితే కన్నడనాట సీఎం పదవి కోసం సిద్ధరామయ్య - డీకే శివకుమార్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. సీఎం కుర్చీ కోసం డీకే రంగంలోకి దిగడంతో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు హైకమాండ్ సిద్ధమైంది.

కన్నడ నాట అధికార పార్టీలో రాజకీయం రసత్తరంగా సాగుతోంది. సీఎం పదవి కోసం నువ్వా నేనా అన్న చందంగా సిద్ధరామయ్య – డీకే శివకుమార్ మధ్య ఫైట్ నడుస్తోంది. తాను ఎలాంటి పదవి కోసం ఆరాటపడడంలేదని డీకే పైకి చెబుతున్న.. లోపల కథ వేరేలా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య – డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల మధ్య నెలకొన్న వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. డిసెంబర్ 1న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకు ముందే ఈ అంతర్గత సమస్యకు తెరదించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.
రాహుల్ – ఖర్గే కీలక సమావేశం
పార్టీ సీనియర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఇవాళ లేదా రేపు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చల తర్వాత ప్రస్తుత వివాదానికి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. నవంబర్ 28 లేదా 29న సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లను ఢిల్లీకి పిలిపించి.. సమస్యకు ముగింపు పలికే అవకాశం ఉంది. మరోవైపు కర్ణాటకలో సీఎం పదవికి సంబంధించి ఇరువైపులా ఉన్న నాయకులు ఇటీవల చేస్తున్న బహిరంగ ప్రకటనలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్లకుండా చూడాలని హైకమాండ్ భావిస్తోంది.
ఇరువర్గాల డిమాండ్‌లు
కనీసం మార్చి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని, అలాగే త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సిద్ధరామయ్య మద్దతుదారులు కోరుతున్నారు. 2023లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో అనధికారికంగా అంగీకరించినట్లుగా, సీఎం పదవిని డీకేకు ఇవ్వాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఖర్గే, రాహుల్, సోనియా గాంధీ ఈ అంశంపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ఎవరికి వారే తమకే మద్ధతు ఇస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్నారు.




