Abhinav Arora: సంచలనాల బాలబాబా.. అభినవ్‌ అరోరా.! సాక్షాత్‌ ‘బలరాముడు’ అంటూ ప్రచారం

బాబా అభినవ్‌ అరోరా వయసు పదేళ్లే కావొచ్చు. కాని, తెలివితేటలను కాస్త ఎక్కువ ఇచ్చాడు దేవుడు. పైగా చురుకైనవాడు కూడా. మాటల మరాఠి. ఎవరైనా ప్రశ్నించడం ఆలస్యం.. చివర క్వశ్చన్‌మార్క్ పెట్టకముందే సమాధానాలు మొదలు పెట్టేస్తుంటాడు. మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ప్రవచనాలు చెబుతున్నాడంటే

Abhinav Arora: సంచలనాల బాలబాబా.. అభినవ్‌ అరోరా.! సాక్షాత్‌ 'బలరాముడు' అంటూ ప్రచారం
Abinav 1
Follow us

|

Updated on: Oct 31, 2024 | 8:30 AM

మీకో జనరల్‌ నాలెడ్జ్‌ క్వశ్చన్. అభినవ్‌ అరోరా ఎవరు? తెలియకపోతే ఈ పోటీ ప్రపంచంలో చాలా చాలా వెనకబడి ఉన్నట్టేనండి..! ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఆయన చెప్పే ప్రవచనాలు, అతన్ని చూడ్డానికి వచ్చే భక్తులు, సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు, సోషల్‌ మీడియాలో ఆయన ఇంటర్వ్యూల కోసం ఎగబడడాలు.. అబ్బో ఎంత పేరు ప్రతిష్టలో. కొంపదీసి ఆ పేరు వినలేదా ఏమిటి మీరు..! ‘అదేంటీ.. అంత పెద్ద స్వామీజీని మేమెలా మిస్‌ అయ్యాం.. అభినవ్‌ అరోరా పేరు వినకపోవడం, ఇప్పటికీ ఆయన్ను దర్శించుకోలేకపోయాం అంటే.. అంత పుణ్యం మేము చేసుకోలేదా’ అనుకుంటుంటున్నారేమో. మరేం ఫర్వాలేదు. ఆయన ఇప్పుడిప్పుడే ఫేమస్‌ అవుతున్న ఓ ‘బాబా’. వయసు జస్ట్ పదేళ్లు. ఈ.. ‘వయసు పదేళ్లు’ అనగానే మీలో చాలామంది ‘జ్ఞాననేత్రం’ తెరుచుకునే ఉంటుంది. పైగా అభినవ్‌ అరోరా అంటే చాలామందికి తెలీకపోవచ్చు. ‘బాబా అభివన్ అరోరా’ అంటేనే తెలుస్తుంది. నార్త్‌ ఇండియాలో ఫుల్‌ ఫేమస్‌ పర్సనాలిటీలెండి..!

బాబా అభినవ్‌ అరోరా వయసు పదేళ్లే కావొచ్చు. కాని, తెలివితేటలను కాస్త ఎక్కువ ఇచ్చాడు దేవుడు. పైగా చురుకైనవాడు కూడా. మాటల మరాఠి. ఎవరైనా ప్రశ్నించడం ఆలస్యం.. చివర క్వశ్చన్‌మార్క్ పెట్టకముందే సమాధానాలు మొదలు పెట్టేస్తుంటాడు. మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ప్రవచనాలు చెబుతున్నాడంటే అతని టాలెంట్‌ ఏంటో అర్థం చేసుకోవాలిక్కడ. ప్రవచనారంగంలో ఇప్పటికే ఏడేళ్ల అనుభవం సంపాదించినట్టు లెక్క. అతనో దైవాంశ సంభూతుడు అన్నట్టుగా ప్రవచనాలు చెబుతాడని ఫాలోవర్స్ చెప్పుకుంటుంటారు. అతని తండ్రే స్వయంగా ఈ స్టేట్‌మెంట్‌ ఇచ్చారొకసారి. ఆ ప్రవచనాలను 80, 90 ఏళ్ల ముదుసలి వాళ్లు కూడా వింటుంటారు చాలా శ్రద్ధగా. అదేదో.. వందేళ్ల వయసుకు దగ్గరపడుతున్నా రాని జ్ఞానం.. ఆ పదేళ్ల బాబా అరోరా మాటల్లో ఉందనేంత తన్మయత్వంతో వింటుంటారట. ఆ పిల్లాడి తల్లిదండ్రులు కూడా ‘అభినవ్‌ అరోరా దేవుడు’ అనడం మొదలుపెట్టారు. ‘పిల్లలూ..దేవుడూ ఒకటే కదా’ అనే కాంటెక్ట్స్‌లో. తల్లిదండ్రులే తమ పిల్లాన్ని దేవున్ని చేస్తే.. పరమ భక్తులు ఊరుకుంటారా. సాక్షాత్‌ దేవుడే అనేయరూ..! కొంతమంది అనేశారు కూడా. బాబా అభినవ్‌ అరోరా ఎవరి అంశో తెలిస్తే ఆశ్చర్యపోతారంటూ ఓ ప్రచారం మొదలుపెట్టారు. అతను ‘బలరాముడు’ అట. స్వయంగా ఆ శ్రీకృష్ణ భగవానుడి సోదరుడైన బలరాముడి అంశ అని చెప్పుకుంటున్నారు బాబా అరోరా భక్తులు. పైగా బాబా అభినవ్‌ కూడా తను శ్రీకృష్ణుడిని సోదరుడిగా భావించి పూజిస్తానని చెబుతుంటాడు.

Abinav

ఇంతకీ ఎవరీ అభినవ్‌ అరోరా? బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి? ఢిల్లీలో నివాసం ఉంటున్న స్వయంప్రకటిత ‘బాలసంత్‌’ ఇతను. అంటే బాలసాధు, బాల బాబా అన్నమాట. అభినవ్‌ తండ్రి పేరు తరుణ్‌ రాజ్‌ అరోరా. ఎంటర్‌ప్రెన్యూర్‌ అండ్‌ TEDx స్పీకర్‌ కూడా. తల్లి జ్యోతి అరోరా ఓ సాధారణ గృహిణి. ఏదేమైనా.. బాబా అభినవ్ అరోరాకు ఫ్యాన్స్‌ విపరీతంగా పెరిగిపోయారు. హిందూ పండగలు వస్తే చాలు.. ఆ పండగల పరమార్ధం గురించి బాబా అరోరా ఏం చెప్పి ఉంటాడోనని నెట్‌లో వెతికేస్తుంటారు నెటిజన్లు. పురాణాల సారాంశాన్ని, గ్రంథాల్లోని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి.. బాబా అభినవ్‌ అరోరా వీడియోలు చూస్తుంటారు. అభినవ్‌ అరోరా చెప్పే ప్రసంగాలన్నీ ఇవే కాబట్టి.. వాటిని సభక్తిపూర్వకంగా చూస్తుంటారు ఆయన భక్తులు. పనిలో పనిగా ఆయన పెట్టే ఫొటోలకు లైక్‌లు, షేర్లు కొడుతుంటారు.

అభినవ్‌ అరోరా గురించి ఇంకాస్త మాట్లాడుకునే ముందు.. మరో ముగ్గురు పిల్లల్ని చూపిస్తాను. బహుశా ‘పిల్లలు’ అని అనకూడదేమో. నార్త్‌ ఇండియన్స్‌కు తెలుగు రాదు కాబట్టి ఓకే. లేదంటే.. సాక్షాత్‌ భగవత్‌ స్వరూపులను పట్టుకుని ‘పిల్లలు’ అంటారా.. ‘హమ్మా ఎంత ధైర్యం’ అని అనేవాళ్లేమో..! విషయానికొస్తే..

శ్రీ కృష్ణాజీ దూబె. వయసు పదేళ్లు. ఈ పేరు చూడండి ఒకసారి. ‘శ్రీకృష్ణ’ కాదది. శ్రీ.. కృష్ణ. పక్కన ‘జీ’ అని మరొకటి చేర్చారు. ముందు ‘శ్రీ’ అని పెట్టి చివర ‘జీ’ అని చేర్చేశారు. అంటే.. పరమపూజ్య సాధువును చేసేశారు. చదువుకోవాల్సిన వయసులో.. పిల్లల్ని దేవుళ్లుగా మారిస్తే.. ఇదిగో ఇలాగే మారిపోతాయి. అసలు ఈ స్టాటిస్టిక్స్‌ చూడండొకసారి. శ్రీకృష్ణాజీ దూబె యూట్యూబ్‌ ఛానెల్‌లో 3 లక్షల 92వేల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. దాదాపుగా 4 లక్షలు. వారానికి రెండు వీడియోలు పోస్ట్ చేస్తాడు. ఒక్కో వీడియో.. యావరేజ్‌న 20 నిమిషాలు. నెలవారీ సంపాదన 3,700 డాలర్లు. అంటే నెలకు 3 లక్షల రూపాయలకు పైనే. ఆ యూట్యూబ్‌ చానెల్ ఎప్పుడు స్టార్ట్‌ చేశారంటే.. 2023 మే 21. జస్ట్ ఏడాది దాటిందంతే. ఇప్పటికే 401 వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. ఇదీ ‘శ్రీకృష్ణాజీ దూబే’ రికార్డ్. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం రెండున్నర లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ ఫాలోవర్స్‌ చేసేదేంటయా అంటే.. ఆ పదేళ్ల పిల్లాడు చెప్పే ‘కథలు’ వినడం. అంతేనా.. ఎన్నో జబ్బులు, మరెన్నో ఆరోగ్య సమస్యలకు రెమెడీస్‌ చెబుతూ ఉంటాడు. సైంటిఫిక్‌ నాలెడ్జ్‌ లేకుండా, ఎలాంటి మెడికల్‌ ప్రూఫ్స్‌ లేని సలహాలను, మందులను ఇస్తుంటాడని చెబుతున్నారు కొందరు అనుచరులు. మెల్లగా వ్యాపారం కూడా జరుగుతూ ఉంటుందట అక్కడ. క్లుప్తంగా చెప్పాలంటే.. సనాతన ధర్మం అని పేరు చెప్పి, ఆ పేరుని ఉపయోగించుకుని, పిల్లలతో ఇలా డబ్బు సంపాదిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు.

Abhinav Arora

మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. కృష్ణ కిషోరి. వయసు.. ఏడేళ్లే. మరో బాలిక పేరు అనుష్క పాథక్. వయసు 9 ఏళ్లు. వీళ్లు కూడా భక్తులకు అనుగ్రహ భాషణలు చెబుతూ ఉంటారట. అందమైన బాల్యాన్ని దూరం చేస్తూ ఏంటీ పనులు అని విమర్శించే వాళ్లు బోలెడు మంది ఉన్నారు. కాని, వీళ్లను సపోర్ట్‌ చేస్తున్న వాళ్లు అంతకంటే ఎక్కువగా ఉన్నారు. ‘ఏమో.. పదేళ్ల వయసుకే ఆ జ్ఞానం సంపాదించారేమో.. మీరెలా చెబుతారు వాళ్లకు మహత్వం లేదని’ అని అంటుంటారు కొందరు. ‘ప్రహ్లాదుడు ఆ వయసప్పుడే కదా నృసింహుడి సాక్షాత్కారం పొందింది’ అనే వర్షన్‌ కూడా వినిపిస్తోంది. ఆదిశంకరాచార్యులు తన భక్తితో బంగారు ఉసిరికలను కురిపించింది కూడా ఆ వయసులోనే కదా..! అంటుంటారు. నిజమే. కాని, వాళ్లు అప్పటికే వేదాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆ దైవత్వం, ఆ మహత్వం ఇచ్చింది వేదం మాత్రమే. మరి ఈ పిల్లలు వేదాలు నేర్చుకున్నారా? కనీసం మొదలుపెట్టి ఉంటారా? ఇక్కడ వేదంతో లింక్‌ ఎందుకు పెట్టాల్సి వచ్చిదంటే.. అభివన్‌ అరోరా గానీ, శ్రీకృష్ణాజీ దూబె గానీ.. మిగతా పిల్లలు గానీ.. వీళ్లంతా సనాతన ధర్మానికి ప్రతినిధులు అని ప్రచారం చేస్తున్నారు. వాళ్లంతట వాళ్లు చెప్పుకుంటున్నది కాదు.. చుట్టూ ఉన్న వాళ్లు పిల్లల్ని అలా మార్చేశారు. సనాతన ధర్మం గురించి ఎవరు మాట్లాడినా.. అంతిమంగా చెప్పాల్సింది వేదం గురించే. అదే అల్టిమేట్. అదే బాటమ్‌ లైన్. మరి.. అక్కడ జరుగుతున్నదేంటి? చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక భావనల వైపు వెళ్లడం మంచిదే. స్వాగతించాల్సిందే. ఈనాటి ‘సోషల్ ట్రాప్’లో పడకుండా ఇలా భక్తిపై అనురక్తి కలగడం అన్ని విధాలా మంచిదే. కాని, పేరెంట్స్‌ అలా ఆలోచిస్తున్నారా? మిరాకిల్ చైల్డ్, ‘Bal Sant’, మహిమాన్వితుడు, భగవత్‌ స్వరూపుడు అని పేరు పెట్టి మైక్‌ ముందు కూర్చోబెడుతున్నారు. దురదృష్టవశాత్తు అలా డబ్బు సంపాదిస్తున్నారు. పిల్లల్ని బంగారు గుడ్లు పెట్టే బాతుల్లా తయారుచేయడం ఎంత వరకు కరెక్ట్?

సరే.. బ్యాక్‌ టు అభివన్‌ అరోరా. అతని ఇన్‌స్టాగ్రామ్ ఒకసారి చూడండి. 9 లక్షల 51వేల మంది ఫాలోవర్లు. అటుఇటుగా 10 లక్షల మంది. ఒక్క ఇన్‌స్టాలోనే ఇంత మంది ఉంటే.. బయట ఇంకెంతమందో. అడుగుపెడితే చాలు కాళ్ల మీద పడిపోయే భక్తులు కూడా తయారయ్యారు. దీనికి తోడు కాస్త పొలిటికల్‌ టచ్‌ ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. ఎక్కడో ఏదో ఫంక్షన్‌లో కాస్త పొగిడినందుకు.. ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఏమని రాశారో చూడండి. ‘India’s Youngest Spiritual Orator honoured by Cabinet Minister Sh. Nitin Gadkari.’ అని రాసేశారు. నితిన్‌ గడ్కరీ పొగిడేశారంటూ దాన్నే హైలెట్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ బాబా అభినవ్ అరోరా ఎంత ఫేమస్‌ అయ్యారంటే.. యూట్యూబర్స్‌ వెంటపడుతున్నారు. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. కొందరేమో తమ యూట్యూబ్‌ చానెల్‌ ఫేమస్‌ అవ్వాలని, మరికొందరు అరోరాను విమర్శించేందుకు ఇంటర్వ్యూలు తీసుకున్నారు. జనరల్‌గా ‘బాలసాధు’ అంటే కాస్త ప్రశాంతంగానే ఉండాలి. ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇవ్వాలి. కాని, బాబా అభినవ్‌ అరోరా అలా చేయలేదు. ఏకంగా ఏడు యూట్యూబ్‌ ఛానెల్స్‌పై కేసులు వేశారు అరోరా. తనను కించపరుస్తూ, విమర్శిస్తున్నందుకు ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్ చేయాలంటూ కోర్టుకెళ్లాడు. నిజానికి పదేళ్ల పిల్లాడికి ఇలాంటి నాలెడ్జ్ అస్సలు ఉండదు. సో, దీనర్థం ఏంటి? అభినవర్‌ అరోరా ఓ సామాన్య బాలుడే.. కాని, వెనకనుంచి కొందరు ఇలాంటి దారిలో నడిపిస్తున్నారంతే.

Abinav 2

విచిత్రం ఏంటంటే.. ఎవరో నిన్ను నడిపిస్తున్నారు అని ప్రశ్నిస్తే.. అదరగొట్టేలా సమాధానం చెబుతుంటాడు ఈ అభినవ్. ఏడుగురు యూట్యూబర్స్‌పై కేసు పెట్టాలని కోర్టుకు వెళ్లావు కదా.. బాబాకు కూడా కోపం వస్తుందా అని అడిగితే ఏం చెబుతున్నాడో తెలుసా. రామాయణంలోని ఓ సీన్‌ను వివరిస్తున్నాడు. శ్రీరాముడికి ఖరదూషణాదులను చంపే ఉద్దేశం లేదట. కాకపోతే, అప్పటి పరిస్థితుల కారణంగా ఓ అడుగు ముందుకు వేసి అలా చేయాల్సి వచ్చిందట. సో, అరోరా కూడా కోపాన్ని అణుచుకుందామనే అనుకుని, ఇలా కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం అభినవ్‌ అరోరాకు ఫ్యాన్సే కాదు.. విలన్స్‌ కూడా పెరిగిపోయారు. అలాంటి ఇలాంటి శత్రువులు కాదు. ఏకంగా లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచే బెదిరింపులు వచ్చాయట అభినవ్‌ అరోరా కుటుంబానికి. మొదట ఓ మిస్డ్‌ కాల్‌ వచ్చిందట. అదేముందిలే అని లైట్‌ తీసుకుని వదిలేశారు. ఆ తర్వాత వాట్సాప్‌ నుంచి బెదిరింపులు వచ్చాయట. అంతే.. వెంటనే వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు. అట్నుంచి అటే మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్‌ పాస్ చేశారు.

అభినవ్‌ అరోరా విషయంలో సోషల్‌ మీడియా రెండుగా విడిపోయింది. ఒకవర్గం మద్దతుగా, మరొకవర్గం వ్యతిరేకంగా. ఓసారి ‘ఓన్లీదేశీ’ అనే యూట్యూబర్‌ అభినవ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో తన దైనందిన జీవితం ఎలా ఉంటుందో చెప్పుకున్నాడు. రోజూ ఉదయం మూడున్నరకే నిద్రలేస్తాడట. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచిన తరువాత ‘మాల జపం’ చేస్తాడట. ఉదయం నాలుగు గంటలకు ఇంట్లో పూజ చేస్తాడట. ఆరున్నరకు తులసి కోటకు పూజచేసి, ప్రదక్షిణ చేసి, బాలగోపాలుడికి నైవేద్యం పెడతాడట. ఇలా చెప్పుకుంటూ వెళ్లాడు. ఆ పిల్లాన్ని ఇంటర్వ్యూ చేశాక ఓ విషయం అర్థమైంది ఆ యూట్యూబర్‌కి. అదేంటంటే.. అభినవ్‌ చెప్పేవన్నీ ‘ప్రీ-రిటన్ స్క్రిప్ట్‌’. అంటే.. వాళ్ల తల్లిదండ్రులు రాసిచ్చినవి, లేదా వాళ్లు చెప్పినవే అభినవ్‌ పలుకుతున్నాడు తప్పితే.. సొంతంగా నాలెడ్జ్‌ అంటూ ఏమీ లేదని ఓ కన్‌క్లూజన్‌కు వచ్చాడు. ప్రవచనాలు చెప్పేందుకు క్వాలిఫైడ్‌ పర్సన్‌ కాదని కూడా చెప్పేశాడు. కాస్త కఠినమే అయినా.. మరో మాట కూడా అన్నాడు ‘ఓన్లీదేశీ’ యూట్యూబర్. అదేంటంటే.. అభినవ్‌ అరోరా ఆధ్యాత్మికతను ‘బిజినెస్‌ ఐడియా’గా అభివర్ణించాడు. యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో పెట్టే వీడియోలు, ఫొటోలు, ప్రవచనాలు అన్నీ ‘బిజినెస్ మైండ్‌’తో పెడుతున్నవేనని కామెంట్‌ చేశాడు ఆ యూట్యూబర్.

అభినవ్‌ అరోరా.. అందరిలాంటి ఓ సామాన్య పిల్లాడే అనడానికి ఈమధ్య ఓ సంఘటన జరిగింది. నిజానికి.. సంఘటన కాదది. అభినవ్‌ అరోరాకు జరిగిన అవమానం. స్వామి రామభద్రాచార్య అనే ఆధ్యాత్మిక గురువు ఉన్నారు. గురువు అంటే ఇలా ఉండాలి అనేంత మహోన్నత వ్యక్తి స్వామి రామభద్రాచార్య. కళ్లు లేకపోయినా సరే.. వేదాల సారాన్ని, పురాణాలను అవపోశన పట్టేశారు. చూడలేకపోయినా.. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోగల జ్ఞాని. అలాంటి పరమ పవిత్రమైన స్వామీజీ దగ్గర ఎవరైనా సరే కాస్త జాగ్రత్తగా ఉంటారు. సాధారణంగా అలాంటి స్వామీజీలకు కోపం రావడమూ అరుదే. కాని, అభినవ్‌ అరోరా చేసిన పనికి చిరు ఆగ్రహం ప్రదర్శించాల్సి వచ్చింది. ‘వేదిక మీద నుంచి అభినవ్‌ అరోరాను పంపించేయండి’ అని స్వామి రామభద్రాచార్య అనాల్సి వచ్చింది. కారణం.. ఓవైపు ప్రవచనం చెబుతుంటే.. పక్కనే ఉంటూ అల్లరి చేయడమే. పాపం.. అభినవ్‌ తప్పేం లేదక్కడ. ఆ వయసు అలాంటిది మరి. పదేళ్ల వయసు పిల్లలు అలా అల్లరిగా ఉండకపోవడమే తప్పు. అదే చేశాడు అక్కడ కూడా. దీంతో.. అభినవ్‌ను కిందకు పంపించేయండని అనేశారు స్వామి రామభద్రాచార్య. ఈ వీడియో తెగ వైరల్ అయింది.

ఏదేమైనా.. పసిపిల్లలను దేవుళ్లను చేసి.. వారి బాల్యాన్ని చిదిమేయడం కరెక్ట్‌ కాదు. ఈ విషయం చెబుతుంటే.. గతంలో జరిగిన ఓ కథ గుర్తుకొస్తోంది. ఉన్నట్టుండి ఓ ఏడేళ్ల బాలిక భవిష్యత్తును చెప్పడం మొదలుపెట్టింది. అదో పెద్ద సెన్సేషన్‌ అయింది అప్పట్లో. వెంటనే ఆ బాలిక పూర్వాపరాలేమిటో వెతికే ప్రయత్నం చేసింది మీడియా. ఆమె పేరు ‘శాంభవి’. ఆమెకు అతీంద్రియ శక్తులు ఉన్నాయంటూ జనం తండోపతండాలుగా వెంటపడ్డారు. అప్పటి కర్నూలు జిల్లా సూర్యనందిలో శాంభవి కోసం ఏకంగా ఓ ఆశ్రమం నిర్మించడానికి కూడా రెడీ అయ్యారు. బౌద్ధ గురువు దలైలామాను ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో శాంభవి హక్కుల కోసం పోరాడడానికి ఓ సంస్థ ప్రయత్నించింది. ఈ అంశం కోర్టు వరకు వెళ్లింది. మొత్తానికి.. శాంభవిని స్కూల్‌కు పంపించాల్సిందేనంటూ కోర్టు ఆదేశించడంతో అప్పటి నుంచి అంతా సర్దుకుంటూ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో.. ఆమాటకొస్తే దక్షిణాదిన పిల్లల్ని ఇలా ‘దేవుళ్లు’గా, అతీంద్రియ శక్తులున్న వారిగా చిత్రీకరించే ప్రయత్నం దాదాపుగా ఆగిపోయింది. ఎటొచ్చీ ఉత్తర భారతదేశంలోనే ఇలాంటివి నడుస్తున్నాయి. పట్టుమని పదేళ్లు కూడా నిండని పిల్లల్ని తీసుకొచ్చి.. భక్తులు అని చెప్పుకునే వేలాది మంది ముందు వారిని కూర్చోబెడుతూ.. వచ్చీరాని ప్రసంగాలు చేయిస్తూ.. ఓ సరికొత్త సంపాదన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇదొక విపరీత ధోరణి అనేవారూ లేకపోలేదు. ఏదేమైనా.. ఇలాంటి విషయాలను కరెక్ట్‌ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే.. పిల్లి మెడలో గంట కట్టేదెవరన్నదే ప్రశ్న.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.