వాట్సాప్ వివాదం.. ఇక ‘ రాష్ట్రపతి పైనే భారం ‘ !
వాట్సాప్ స్నూపింగ్ స్కాండల్ పై విచారణ జరపాలని సుప్రీంకోర్టును ఆదేశించాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాయాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీలు యోచిస్తున్నాయి. దేశంలోని అనేకమంది ప్రముఖుల ఫోన్ల వాట్సాప్ హ్యాకింగ్ సమస్యను తీవ్రమైనదిగా పరిగణించి.. దీన్ని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తాలని విపక్షాలు నిర్ణయించాయి. (ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్ పారంభం కానుంది). భావ సారూప్యం గల 13 పార్టీలు నిన్న సమావేశమై.. ఈ దేశానికి, దేశ […]

వాట్సాప్ స్నూపింగ్ స్కాండల్ పై విచారణ జరపాలని సుప్రీంకోర్టును ఆదేశించాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాయాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీలు యోచిస్తున్నాయి. దేశంలోని అనేకమంది ప్రముఖుల ఫోన్ల వాట్సాప్ హ్యాకింగ్ సమస్యను తీవ్రమైనదిగా పరిగణించి.. దీన్ని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తాలని విపక్షాలు నిర్ణయించాయి. (ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్ పారంభం కానుంది). భావ సారూప్యం గల 13 పార్టీలు నిన్న సమావేశమై.. ఈ దేశానికి, దేశ ప్రజలకు హానికరంగా పరిణమించిన ఈ అంశంపై చర్చించాయి. ఢిల్లీలో ఉమ్మడిగా నిరసన తెలిపేందుకు మళ్ళీ సమావేశం కావాలని కూడా నిర్ణయించాయి. సోమవారం జరిగిన సమావేశానికి హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. వాట్సాప్ స్నూపింగ్ పై భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. రాష్ట్రపతి అపాయింట్ మెంటును తాము కోరనున్నామని… రాజ్యసభలో ప్రతిపక్ష నేత కూడా అయిన ఆయన చెప్పారు. కాగా-ఈ విపక్షాలు రాష్ట్రపతికి ఓ మెమోరాండం ను పంపే అవకాశం కూడా ఉందని అంటున్నారు. తమ పార్టీ నేత ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాక్ అయినట్టు వాట్సాప్ నుంచి మెసేజ్ అందిందని, ఈ ‘ నిఘా రాకెట్ ‘ లో ప్రభుత్వ ‘ ప్రమేయం ‘ ఉందని కాంగ్రెస్ నేతలు గత ఆదివారం ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణను తోసిపుచ్చిన కమలనాథులు.. లేనివాటిని ఉన్నట్టు ఊహించుకుని ప్రతిపక్షాలు రాధ్ధాంతం చేస్తున్నాయని తిప్పికొట్టారు. చిన్న సమస్యను భూతద్దంలో చూస్తున్నారని విమర్శించారు. అటు-హోం, ఐటీ వ్యవహారాలపై గల పార్లమెంటరీ స్థాయీ సంఘాలలోని కాంగ్రెస్ సభ్యులు.. హోం కార్యదర్శి సహా ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి వివరాలను కోరే అవకాశం ఉంది. అయితే ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధినేత్రి సోనియా , పార్టీ నేత ప్రియాంక గాంధీ తప్ప.. పార్టీ మరో నేత రాహుల్ గాంధీ స్పందించక పోవడం ఆశ్చర్యంగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా మోదీ ప్రభుత్వాన్ని తప్పు పట్టే ఆయన.. ఇంత పెద్ద స్నూపింగ్ వ్యవహారంపై నోరెత్తకపోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.