AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Climate Change in India: వాతావరణ మార్పులు.. జులైలో అతి భారీ వర్షాలు.. ఇక ఆగస్టు సంగతి అంతేనా?

హిమానీ నదాలతో పాటు కిలోమీటర్ల మందం మంచుతో పేరుకుని ఉంటే ఉత్తర, దక్షిణ ధృవాలు సైతం కరిగిపోతున్నాయి. భరించలేని వడగాల్పులు (వేడి గాలులు) పెరిగిపోయాయి. ఆ వెంటనే ఊహించని ఉత్పాతాన్ని సృష్టించే భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత ఉపఖండంపై ఈ వాతావరణ మార్పులు యావత్ దేశ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ఏడాది జులైలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సగటు కంటే..

Climate Change in India: వాతావరణ మార్పులు.. జులైలో అతి భారీ వర్షాలు.. ఇక ఆగస్టు సంగతి అంతేనా?
Climate Change In India
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Aug 01, 2023 | 11:42 AM

Share

గ్లోబల్ వార్మింగ్.. వాతావరణ మార్పులు.. భూగోళంపై ఇది కేవలం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైన అంశం కాదు. యావత్ ప్రపంచమే వాతావరణ మార్పుల ప్రభావాన్ని చూస్తోంది. గత వేసవిలో ఎన్నడూ లేని అధిక ఉష్ణోగ్రతలను ఐరోపా ఖండం చవి చూసింది. హిమానీ నదాలతో పాటు కిలోమీటర్ల మందం మంచుతో పేరుకుని ఉంటే ఉత్తర, దక్షిణ ధృవాలు సైతం కరిగిపోతున్నాయి. భరించలేని వడగాల్పులు (వేడి గాలులు) పెరిగిపోయాయి. ఆ వెంటనే ఊహించని ఉత్పాతాన్ని సృష్టించే భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత ఉపఖండంపై ఈ వాతావరణ మార్పులు యావత్ దేశ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ఏడాది జులైలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సగటు కంటే అధిక వర్షపాతం నమోదైతే, కొన్ని ప్రాంతాల్లో చుక్క నీరు దిక్కులేదు. మరి ఆగస్టు సంగతేంటి?

పర్యావరణ సంక్షోభం..

క్రమానుగతంగా సీజన్ మొత్తం పడాల్సిన వర్షాలు రోజుల వ్యవధిలో కురుస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. హిమాలయ రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్, మెరుపు వరదలతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రాణ నష్టంతో పాటు భారీగా విధ్వంసాన్ని సృష్టించాయి. ఆకస్మిక వరదల్లో వాహనాలు, భవనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు, వంతెనలు కూలిపోతున్న దృశ్యాలు ఎక్కడికక్కడ కనిపించాయి. భరించలేని వేడి గాలుల తర్వాత భారీ వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇది కేవలం వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ప్రభావం మాత్రమే కాదు, యావత్ పర్యావరణమే సంక్షోభంలో పడినట్టుగా కనిపిస్తోందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో జులైలో సగటున 209.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ ఈ ఏడాది జులై వర్షపాతం సగటు 384.6 మి.మీ గా నమోదైంది. మొత్తం వర్షాకాలం సగటు 486.3 మి.మీలో ఇది 75 శాతం కంటే ఎక్కువ. ఇక దేశవ్యాప్త సగటు వర్షపాతాన్ని లెక్కిస్తే జులైలో 13 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అదే సమయంలో, దేశంలోని తూర్పు మరియు ఈశాన్య ప్రాంతాలు 1901 తర్వాత జూలైలో మూడవ అత్యల్ప వర్షపాతాన్ని నమోదు చేశాయి.

జులైలోనే ఇంత వర్షం కురిశాక.. ఇక ఆగస్టు పరిస్థితి ఏంటన్న ప్రశ్న దేశ ప్రజల మదిలో మెదులుతోంది. జులైలో నమోదైన అధిక వర్షాల నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదుకావొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతాన్ని అంచనా వేయడం కూడా కష్టంగా మారుతోందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేడెక్కుతున్న భూగోళం (గ్లోబల్ వార్మింగ్) కారణంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు రుతుపవనాలను మరింత బలంగా, అస్థిరంగా మారుస్తున్నాయి. తద్వారా సంభవించే వరదల తీవ్రత పెరిగి ఉగ్రరూపాన్ని సంతరించుకుంటున్నాయని విశ్లేషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చరిత్రలో నమోదైన రికార్డులను అధిగమిస్తూ ప్రతి ఏటా ఈ వైపరీత్యాలు, వాటి తీవ్రత పెరుగుతోంది. ఢిల్లీలో యమునా నది గరిష్ట వరద నీటిమట్టం కొన్ని దశాబ్దాలుగా 207.49 మీటర్లుగా ఉంది. 1978లో నమోదైన ఈ గరిష్ట నీటిమట్టమే ఇప్పటి వరకు రికార్డుల్లో అత్యధికం. 2013లో సంభవించిన ఉత్తరాఖండ్ వైపరీత్యం సమయంలోనూ యమున నీటిమట్టం 207 మీటర్లు దాటినా గరిష్ట రికార్డును అధిగమించలేదు. కానీ ఈ ఏడాది జులైలో హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు తోడు హర్యానా, ఢిల్లీ, పశ్చిమ యూపీ వంటి మైదాన ప్రాంతాల్లోనూ రికార్డు స్థాయి వర్షాలు కురవడంతో యమున నీటిమట్టం ఆల్ టైమ్ రికార్డు 208.66 మీటర్లకు చేరుకుంది. ఆ ప్రభావంతో నగరంలోని ఎర్ర కోట సహా అనేక కీలక ప్రాంతాలు వరద నీటిలో తేలియాడాయి.

వ్యవసాయంపై పెను ప్రభావం..

ముఖ్యంగా దేశ జనాభాలో అత్యధిక జనాభా ఆధారపడ్డ వ్యవసాయ రంగం ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో సతమతమవుతోంది. వేసవిలో ఏర్పడే ఆవర్తనాలు, అల్పపీడనాల ప్రభావంతో కురిసే వర్షాలకు తోడు నైరుతి రుతుపవనాల ద్వారా దేశానికి వార్షిక వర్షపాతంలో 70% వరకు అందుతుంది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు కలిపి దేశ స్థూల జాతీయోత్పత్తిలో సగటున 20% వాటా కలిగి ఉన్నాయి. దేశ జనాభాలో ప్రత్యక్షంగా 40%, పరోక్షంగా మరో 40 శాతం జనాభా కూడా ఈ రంగాలపై ఆధారపడి ఉన్నారు. ఇంతటి కీలకమైన వ్యవసాయ రంగం రుతుపవనాల ద్వారా వచ్చే వర్షపాతంపై ఆధారపడి ఉంది. వర్షాలు పడ్డప్పుడు నీటి చుక్కను ఒడిసిపట్టి, దాచిపెట్టే ఉద్దేశంతో ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు కట్టినా సరే.. నదుల ద్వారా వరద నీరంతా సముద్రం పాలవుతోంది. వాతావరణ మార్పులు – పర్యావరణ విపత్తులు వర్షపు నీటిని వృధాగా సముద్రంలో కలపడం మాత్రమే కాదు, సముద్రం వైపు వెళ్లే మార్గంలో భారీ విధ్వంసాన్ని కూడా సృష్టిస్తున్నాయి.

2022లో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్, న్యూ ఢిల్లీకి చెందిన పబ్లిక్ ఇంటరెస్ట్ రీసెర్చ్ అండ్ అడ్వకేసీ ఆర్గనైజేషన్ సంయుక్తంగా భారతదేశంలోని తీవ్రమైన వాతావరణ విపత్తులను ట్రాక్ చేసింది. దేశం మొత్తమ్మీద 365 రోజులలో 314 రోజులలో తీవ్రమైన వాతావరణ సంఘటనలను ఎదుర్కొన్నట్లు గుర్తించింది. అంటే ఈ రోజుల్లో భారతదేశంలోని ఏదో ఒక ప్రాంతంలో కనీసం ఒక తీవ్రమైన వాతావరణ సంఘటన చోటుచేసుకుంటుంది. 2022లో జరిగిన ఈ తీవ్రమైన ఘటనల్లో 3,000 కంటే ఎక్కువ మరణాలు సంభవించాయని, సుమారు 20 లక్షల హెక్టార్ల (48 లక్షల ఎకరాలు) పంట విస్తీర్ణంపై ప్రభావం చూపిందని ఈ అధ్యయనం తేల్చింది. అలాగే 69,000 కంటే ఎక్కువ పశు సంపద, లైవ్ స్టాక్‌ను బలితీసుకున్నాయని, దాదాపు 4,20,000 ఇళ్లు ధ్వంసమయ్యాయని నివేదిక నిర్ధారించింది. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ 2022 నివేదికను కూడా విడుదల చేసింది. భారతదేశం రాబోయే రెండు దశాబ్దాల్లో అనేక వాతావరణ విపత్తులను ఎదుర్కొంటుందని ఆ నివేదికలో హెచ్చరించింది. 2030 నాటికి గ్రీన్‌హౌస్ ఉద్గారాలను భారీగా తగ్గించకపోతే, వాతావరణ విపత్తును తిప్పికొట్టడం భారత పాలకులకు అసాధ్యమని పేర్కొంది.

మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..