AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి కుక్కల పంచాయితీ.. ఈసారి వివాదంలోకి ఉపాధ్యాయులు

ఢిల్లీ రాజకీయాల్లో టీచర్స్ కేంద్రంగా మంటలు రాజుకున్నాయి. తరగతి గదుల్లో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు వీధి కుక్కల సమస్యలపై బాధ్యతలు నిర్వర్తించాలా అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ప్రభుత్వం చెబుతున్నది ఒకటి. ప్రతిపక్షం ఆరోపిస్తున్నది మరొకటి. అసలు నిజం ఏంటి..?

ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి కుక్కల పంచాయితీ.. ఈసారి వివాదంలోకి ఉపాధ్యాయులు
Teachers Stray Dogs Duty
Balaraju Goud
|

Updated on: Dec 31, 2025 | 7:27 AM

Share

ఢిల్లీ విద్యాశాఖ ఇచ్చిన ఓ ఉత్తర్వు రాజకీయ తుఫాన్‌ సృష్టిస్తోంది. అందులో వీధి కుక్కల పరిష్కారానికి నోడల్ ఆఫీసర్స్‌ను నియమిస్తున్నామంటూ ఓ సర్కులర్ జారీ చేసింది. అయితే ఇప్పుడీ సర్క్యులర్ బీజేపీ-ఆప్ మధ్య మాటల మంట రాజేసింది. ఢిల్లీ ప్రభుత్వ విద్యాశాఖ ఉపాధ్యాయులను వీధి కుక్కల సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తున్నదంటూ ఆదివారం అదును చూసి అగ్గిపుల్ల గీసింది ఆప్‌. ఆప్ స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. చర్చ కూడా పెట్టింది. టీచర్ల విధులు మళ్లీ పాత రోజులకు వెళ్లిపోయాయా అన్న ఆందోళన టీచర్ సంఘాల్లో కూడా వ్యక్తమైంది. అయితే ఈ ఆరోపణలను ఢిల్లీ సర్కార్ ఖండించింది. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు నియమించడంలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, వీడియోలు వాస్తవం కాదని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది..

ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసినా, ఆప్ ఆరోపణల పర్వం ఆగలేదు. విద్యాశాఖ జారీ చేసిన నోడల్ అధికారుల నియామకం అంటూ వచ్చిన ఉత్తర్వులను హైలెట్ చేసింది. ఢిల్లీ మంత్రికి తన శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది ఆప్. విద్యాశాఖ నుంచే ఆదేశం వచ్చిందంటే బాధ్యత ఎవరిదంటూ ప్రతిపక్ష పార్టీ అమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తోంది.

ఈ మొత్తం వివాదానికి కేంద్రబిందువుగా ఉన్నది డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ జారీ చేసిన ఉత్తర్వులు. పాఠశాలల పరిసరాల్లో వీధి కుక్కల సమస్యను పర్యవేక్షించేందుకు నోడల్ అధికారుల నియామకం చేయాలని ఆదేశంలో పేర్కొంది. అయితే ఇక్కడే ఓ ట్విస్టుంది. ఆదేశాలు ఇవ్వడం వాస్తవమే. కానీ అందులో నోడల్ ఆఫీసర్లుగా టీచర్లను నియమిస్తున్నట్టు లేదు. అందులో నోడల్ అధికారి అన్న పదం మాత్రమే ఉంది. అయినా వివాదాలు చుట్టుముట్టడంతో మరోసారి దీనిపై స్పష్టత ఇస్తూ మరో ప్రకటన విడుదల చేసింది ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారానికి వాస్తవాలతో సంబంధం లేదని, టీచర్లను నోడల్ అధికారులుగా నియమించడంలేదని స్పష్టం చేసింది.

మామూలుగా ఢిల్లీ విద్యా వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వివాదాలు ఆ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయన్న చర్చ మొదలైంది. మరోవైపు వీధి కుక్కల సమస్య కూడా చిన్నది కాదు. పిల్లల భద్రత, పాఠశాల పరిసరాల రక్షణకు చర్యలు అవసరం. ఆ బాధ్యత ఎవరికివ్వాలి అన్నది స్పష్టంగా నిర్ణయించకుండా ఆదేశాలు ఇవ్వడం వల్లే ఈ వివాదం చెలరేగిందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..