Delhi Stampede: ఢిల్లీ తొక్కిసలాటకు కారణాలు ఇవేనా.. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు
కుంభమేళాకు వెళ్లే భక్తులు పోటెత్తడంతో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగింది. మానవ నిర్లక్ష్యం. ప్రమాదాలు జరిగిన ప్రతీసారి వినిపించేమాట. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోవడానికి మానవ తప్పిదమే కారణం. అసలు తొక్కిసలాట ఎలా జరిగింది, అందుకు కారణాలు ఏంటో విశ్లేషిద్దాం..

మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడానికి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ గొప్పలుపోయింది. ఇందులో భాగంగా గంటకు 1500 జనరల్ టికెట్లు విక్రయిస్తున్నామంటూ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకటించారు. జనరల్ టికెట్ల కోసం జనం ఎగబడ్డారు. అవసరానికి మించి టికెట్లను విక్రయించడం, ఆ రద్దీకి తగినట్లు రైళ్లు సకాలంలో నడపకపోవడం తొక్కిసలాటకు దారితీసింది. టికెట్లు కొన్నవారు ప్లాట్‌ఫామ్‌పైనా, మెట్లపైనా నిలబడ్డారు.
తొక్కిసలాటకు కనిపిస్తోన్న రెండో కారణం- టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్న వారు ఎక్కువగానే ఉన్నారని ప్రత్యక్షసాక్షులే చెబుతున్నారు. టికెట్లు తీసుకున్నారో లేదో తనిఖీ చేయడానికి తగిన సిబ్బంది కరువయ్యారు. దీనిపై ప్రయాణికులు ఫిర్యాదు చేసినా రైల్వే అధికారులు పట్టించుకోలేదు..
టికెట్లు లేకుండా వచ్చినవారు, జనరల్ టికెట్లు తీసుకున్నవారు, జనరల్ బోగీల్లో కాకుండా ఇతర కంపార్ట్‌మెంట్లలోకి తోసుకొచ్చారు. స్లీపర్, ఏపీ బోగీల్లోకి ఎగబడ్డారు. వీరిని ఎవరూ నియంత్రించలేదు. ఫలితంగానే తొక్కిసలాట జరిగి, జనం అవస్థలు పడ్డారు.
స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఆ రెండు రైళ్లలో ప్రయాణించాల్సిన వారు, 12, 13 ప్లాట్ ఫామ్‌లపై వేచి ఉన్నారు. అదే సమయంలో ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రాత్రి తొమ్మిదిన్నరకు 15వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు చేరుకుంది. దీంతో అందులోకి వెళ్లడానికి ప్రయాణికులు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఫలితంగా మెట్లపైన నిలబడ్డవారు కింద పడిపోయారు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న మరికొందరు కూడా తొక్కిసలాటలో కింద పడిపోయారు.
మహాకుంభమేళా కోసం ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారని తెలిసినా- రైల్వే భద్రతా సిబ్బంది అప్రమత్తంగా లేరు. పోలీసులు, భద్రతా సిబ్బంది- ప్రయాణికులను అదుపు చేయలేకపోయారు. ఫలితంగానే ఇంతపెద్ద ప్రమాదం జరిగింది.
ఈ తొక్కిసలాట గందరగోళం అంతా గంటపాటు కొనసాగిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. తొక్కిసలాట జరిగినా, వెంటనే అక్కడకు పోలీసులు చేరుకోలేదు. అంతేగాదు, సాయం కూడా సకాలంలో అందలేదు. NDRF బృందాల రాక ఆలస్యం అయింది. ఇవన్నీ కలిసి మరణ మృదంగానికి దారితీసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




