వ్యక్తి పూజ, వ్యక్తి కేంద్రీకృత రాజకీయాలే ఆ పార్టీలకు శాపమా?
దేశంలో వ్యక్తి కేంద్రంగా పనిచేస్తున్న రాజకీయ పార్టీలు సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్నాయి. విశేష ప్రజాదరణ కల్గిన ఒక 'బలమైన నేత' లేదా కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న రాజకీయ పార్టీల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.

దేశంలో వ్యక్తి కేంద్రంగా పనిచేస్తున్న రాజకీయ పార్టీలు సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్నాయి. విశేష ప్రజాదరణ కల్గిన ఒక ‘బలమైన నేత’ లేదా కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న రాజకీయ పార్టీల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ సిద్ధాంతాలు, క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం వదిలిపెట్టి వ్యక్తిపూజతో ఒక నేత కేంద్రంగా పనిచేసిన పార్టీలు.. ఆ నేత బలహీనపడినా, లోకం నుంచి నిష్క్రమించినా ఒక్కసారిగా చతికిలపడుతున్నాయి. ఒక్క దశాబ్దకాలం వెనక్కి తిరిగి చూస్తే చాలు.. ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి. శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, బిజూ జనతాదళ్, ఆర్జేడీ, అన్నాడీఎంకే.. ఆ మాటకొస్తే జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూడా ఆ జాబితాలో ఉంది. కొన్ని పార్టీల విషయంలో ఆయా నేతలకు రాజకీయ వారసులు లేకపోవడం కారణంగా కనిపిస్తుంటే, మరికొన్నింటి విషయంలో పేరుకు వారసులైనా రాజకీయ వారసత్వాన్ని కొనసాగించలేకపోవడం, నాయకత్వ లక్షణాలు లేకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి.
ప్రాభవం కోల్పోయిన శివసేన..
‘టైగర్’గా అందరూ పిలుచుకునే బాల్ థాకరే స్థాపించిన శివసేన వయస్సులో భారతీయ జనతా పార్టీ (BJP) కంటే పెద్దది. 1966 జూన్ 19న ఏర్పాటైన ఈ పార్టీకి అర్థ శతాబ్దం కంటే ఎక్కువ చరిత్ర ఉంది. పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే హయాంలో కేవలం మహారాష్ట్రలోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. అలాంటి పార్టీ ఇప్పుడు ఎన్నికల గుర్తునే కాదు, పార్టీ పేరును కూడా కోల్పోవాల్సి వచ్చింది. బాల్ థాకరే మరణానంతరం పార్టీని ఐకమత్యంగా ఉంచడంలో ఆయన కుమారుడు ఉద్ధవ్ థాకరే విఫలమయ్యారు. మొట్టమొదట థాకరే కుటుంబానికే చెందిన రాజ్ థాకరే వేరుపడి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే చీలికతో పార్టీ అసలు గుర్తును, పేరును ఉద్దవ్ వదులుకోవాల్సి వచ్చింది. మొత్తంగా బాల్ థాకరే రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంలో ఆయన తర్వాతి తరం నేతలు విఫలమయ్యారు. ఫలితంగా పార్టీ సైతం చీలికలు, పేలికలపై తన ప్రాభవాన్ని కోల్పోయింది.
అదే బాటలో ఎన్సీపీ..
శివసేన తరహాలో మహారాష్ట్రలో ఊపిరి పోసుకున్న మరో పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP). కాంగ్రెస్ అధినాయకత్వంతో విబేధించి సొంత కుంపటి పెట్టుకుని శరద్ పవార్ ఏర్పాటు చేసిన పార్టీ ఇది. ఎంతో రాజకీయ చతురత కల్గిన ఆయన మహారాష్ట్రతో పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. రాష్ట్రంలో పార్టీ నాయకత్వం, యంత్రాంగం పూర్తిగా ఆయనపైనే ఆధారపడింది. ఆయన పేరుతోనే పార్టీకి ఓట్లు పడ్డాయి. పూర్తి వ్యక్తికేంద్రంగా రాజకీయాలు చేస్తూ వచ్చిన ఆ పార్టీలో సొంత కుటుంబం కారణంగానే సంక్షోభం ఎదురైంది. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ పార్టీని చీల్చడమే ఎదురు దెబ్బ అనుకుంటే.. ఆ చీలిక వర్గమే అసలు పార్టీ అంటూ కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడం మరో శరాఘాతంగా మారింది. శరద్ పవార్ కేంద్రంగా ఆయన చుట్టూ నడిచిన పార్టీ, గతేడాది నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన మరుక్షణం నుంచే బలహీనపడడం మొదలైంది. ఇది గమనించిన శరద్ పవార్ పునరాలోచించుకుని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. పార్టీ నాయకత్వ బాధ్యతల్ని ఆశించిన మేనల్లుడు అజిత్ పవార్‌కు అవి దక్కకపోవడంతో తన వర్గం నేతలతో కలిసి చీలిక తీసుకొచ్చారు. శివసేన తరహాలోనే శరద్ పవార్ తన పార్టీ పేరును, ఎన్నికల గుర్తును కోల్పోవాల్సి వచ్చింది.
యూపీలోనూ అదే స్థితి..
దేశంలో అత్యధిక జనాభా, అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ సీట్లు కల్గిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతిగా.. అందరూ ప్రేమతో నేతాజీ అని పిలుచుకునే ములాయం సింగ్ యాదవ్ స్థాపించిన సమాజ్‌వాదీ పార్టీ (SP) ఇప్పుడు గత వైభవాన్ని కోల్పోయింది. రాజ్యాధికారం పొందలేకపోయిన కులాలకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా కుల రాజకీయాలు చేసిన ఈ పార్టీ.. కాలక్రమంలో కేవలం యాదవులు, ముస్లింలకు మాత్రమే ప్రాధాన్యత కల్పించే పార్టీగా ముద్రను వేసుకుంది. వయోభారం, అనారోగ్యంతో పార్టీ పగ్గాలను తన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు అప్పగించినప్పుడు పార్టీలో అంతర్గత విబేధాలు తలెత్తి ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్ వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్లీ అబ్బాయి అఖిలేశ్‌తో కలిసిపోయినా సరే.. పార్టీ గతంలో మాదిరిగా తన ప్రభావాన్ని చూపలేకపోతోంది. అఖిలేశ్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎదుర్కొన్న 2017, 2022 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది. ములాయం చేతిలో పార్టీ ఉన్నప్పుడు వెలుగు వెలిగిన ఆ పార్టీ, ఇప్పుడు ఉనికి చాటుకోడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేశ్ యాదవ్, వారసత్వంగా పార్టీని, రాజ్యాధికారాన్ని అందుకోగలిగారు తప్ప తన సొంత రాజకీయ చతురత, నైపుణ్యం, నాయకత్వ లక్షణాలతో ఏదీ సాధించలేకపోతున్నారు.
ఇదే రాష్ట్రంలో దళిత, బహుజన వర్గాల్లో విశేష ప్రజాదరణ కల్గిన కాన్షీరాం ఏర్పాటు చేసిన బహుజన్ సమాజ్ పార్టీ (BSP) కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. మాయావతి హయాంలో రాజ్యాధికారాన్ని కూడా సాధించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే ప్రయత్నాలు జరిగాయి. కాన్షీరాం హయాంలో పార్టీలో ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని తయారు చేయగలిగారు. కానీ మాయావతి తానే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరించడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోయింది. మాయావతి కేంద్రంగానే పార్టీ పనిచేయడం, ఆమె తప్ప ఆ పార్టీలో మరొక బలమైన నేత ఎవరూ లేకపోవడంతో.. ఇప్పుడు వారసత్వ సమస్యను ఎదుర్కొంటోంది. మాయావతి తర్వాత పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
కులం, కుటుంబంలో మునిగిపోయి..
స్వాతంత్ర్య సమరయోధుడు, సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిర్మించిన ఉద్యమం నుంచి ఉద్భవించిన నేతల్లో లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్, ములాయం సింగ్ యాదవ్, దేవెగౌడ సహా ఇంకా చాలామందే ఉన్నారు. ఆనాడు ఏర్పడ్డ జనతా పార్టీ తర్వాతి కాలంలో చీలికలు పేలికలు కాగా.. నాటి నేతలంతా తలా ఒక సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా జనతా దళ్ (యునైటెడ్) పేరుతో నితీశ్ కుమార్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పేరుతో లాలూ ప్రసాద్ యాదవ్ గత 3-4 దశాబ్దాలుగా బిహార్ రాజకీయాలను ఏలుతున్నారు. వాటిలో లాలూ చేతిలోని ఆర్జేడీ పూర్తిగా లాలూ కుటుంబ పార్టీగా మారిపోయింది. ఆ కుటుంబంలో అనేక మంది అనేక పదవులు అనుభవించారు. కుల – కుటుంబ రాజకీయాలు, అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన ఆ పార్టీలో లాలూకు వారసులుగా ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నప్పటికీ.. అంతర్గతంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఇలా కులం, కుటుంబంలో మునిగిపోయిన పార్టీలు దేశవ్యాప్తంగా చాలానే కనిపిస్తాయి. దక్షిణాదిన కర్ణాటకలోని దేవెగౌడ నేతృత్వంలో ఉన్న జనతాదళ్ (సెక్యులర్) పార్టీ కూడా ఆ కోవలోనిదే. ఉత్తరాదిన యాదవ్ పరివార్ చుట్టూ ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు తిరిగితే, కర్ణాటకలో వొక్కలిగ వర్గానికి చెందిన పార్టీగా జేడీ(ఎస్)కు ముద్ర పడింది. అలాగని ఆ వర్గంలో ఇతర నేతలు ఎవరైనా ఎదిగారా అంటే అదీ లేదు. కేవలం దేవెగౌడ కుటుంబం తప్ప ఆ పార్టీలో మరొక పెద్ద నేత అంటూ ఎవరూ కనిపించరు. కుటుంబంలో ఆధిపత్య పోరుతో ఆ పార్టీ ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంకీర్ణ రాజకీయాల్లో దేశానికి ప్రధానిగా పనిచేసిన దేవెగౌడ, తన సొంత రాష్ట్రంలో పార్టీని నిలబెట్టలేక సతమతమవుతున్నారు.
అది పేరుకే జాతీయ పార్టీ కానీ ఆ కుటుంబం చేతిలోనే సర్వాధికారాలు..
దేశంలో ప్రాంతీయ పార్టీలు అంటేనే ఒక బలమైన నేత కేంద్రంగా వ్యక్తిపూజ, కుటుంబ ఆరాధనతో రాజకీయాలు చేస్తుంటాయి. అవి ఏర్పాటయ్యే సమయంలోనే సిద్ధాంతాలు, భావజాలాలు.. ఒకసారి రాజ్యాధికారం వచ్చాక కుటుంబ పాలనే సిద్ధాంతంగా, అధినేత కులానికి ప్రాధాన్యతనివ్వడమే భావజాలంగా మారిపోతుంది. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగి, భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన ఘనచరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి స్వాతంత్ర్యం వరకు ఎంతో మంది అధ్యక్షులుగా పనిచేశారు. మొట్టమొదటి ప్రధానిగా నెహ్రూ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీపై పూర్తిగా ఆ కుటుంబమే ఆధిపత్యం చలాయిస్తూ వచ్చింది. విబేధించినవారు వేరు కుంపట్లు పెట్టుకుని వేరు పార్టీలు పెట్టుకున్నారు తప్ప కాంగ్రెస్‌లో పరిస్థితి మాత్రం మారలేదు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ హయాంలో పేరుకు కుటంబేతరులు పార్టీ జాతీయాధ్యక్షులుగా ఉన్నప్పటికీ, ఆధిపత్యం మాత్రం ఆ కుటుంబానిదే అన్న సంగతి అందరికీ తెలుసు. రాజీవ్ గాంధీ మరణానంతరం పీవీ నరసింహారావు, సీతారాం కేసరి హయాంలో పార్టీ స్వతంత్రంగా వ్యవహరించగలిగింది. 1998లో సీతారాం కేసరిని బలవంతంగా తొలగించి సోనియా గాంధీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పూర్తిగా కుటుంబ పార్టీగా మారిపోయింది. ఇరవై ఏళ్లకు పైగా సోనియా గాంధీయే పార్టీ అధినేత్రిగా పనిచేయగా, రాహుల్ గాంధీ రెండేళ్లు ఏఐసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. 2004-2014 మధ్యకాలంలో వరుసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (UPA) అధికారంలో ఉన్నప్పుడు పేరుకు మాత్రమే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా.. పార్టీలో, ప్రభుత్వంలో మొత్తం పెత్తనం సోనియాదే అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కుటుంబ-వారసత్వ రాజకీయాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు పదే పదే చేస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ పగ్గాలను కుటుంబేతరుడైన మల్లికార్జున ఖర్గేకి అప్పగించినప్పటికీ.. పెత్తనం మాత్రం ఆ కుటుంబానిదే అన్న విషయం బహిరంగ రహస్యమే.. లోకవిదితమే. కుటుంబానికి అధికారం కట్టబెట్టడమే లక్ష్యంగా ఆ పార్టీలో నేతలు పనిచేస్తుంటారు. ఆ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకుని పదవులు అందుకోవాలని చూస్తుంటారు. ఆ కుటుంబాన్ని దాటి బయటకురాలేని బలహీనతలో పార్టీ ఉంది. అదే ఇప్పుడు పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత పతనావస్థకు కారణమైంది. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, విమానాశ్రయాలు, పథకాలు, చివరకు అవార్డులకు సైతం ఆ కుటుంబ నేతల పేర్లే పెట్టారు తప్ప దేశానికి నిస్వార్థంగా సేవలు అందించిన అనేకమంది మహనీయులను విస్మరించారు. దేశాన్ని గడ్డుపరిస్థితుల నుంచి, తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసి ఆధునిక భారతానికి పునాదులు వేసిన దార్శనికుడు పీవీ నరసింహారావుకు ఆ పార్టీలో దక్కిన గౌరవం ఏపాటితో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అందరికీ భిన్నంగా కమలదళం..
కులం, కుటుంబం, వ్యక్తి ఆధారిత వారసత్వ రాజకీయాలకు దూరంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కొనసాగుతోంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వ్యక్తిపూజ కనిపిస్తున్నప్పటికీ.. ఆయన తదనంతరం కూడా పార్టీని నడిపించగలిగే ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆ పార్టీలో అడుగడుగునా ఉంది. ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేస్తూ క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ యంత్రాంగాన్ని నిర్మించుకుంటోంది. బలమైన సిద్ధాంతం, భావజాలంతో పార్టీ నడుస్తోంది. వివాహబంధాలకు సైతం దూరంగా ఉంటూ యావత్ జీవితాలనే పార్టీకి అంకితం చేసి అహర్నిశలు పనిచేసే వేలాది మంది నేతలు బీజేపీకి మాత్రమే సొంతం. అవే ఆ పార్టీ ఎదుగుదలకు, వరుస విజయాలకు కారణమవుతున్నాయి. ఒకప్పుడు 2 సీట్లతో ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా 303 సీట్లు సాధించగలిగింది. ఇది కేవలం మోదీ ఒక్కడి వల్లనే సాధ్యపడింది అనుకోడానికి వీల్లేదు. దేశంలో బీజేపీ సాధించే విజయాల వెనుక నరేంద్ర మోదీకి ఉన్న విశేష ప్రజాదరణ కచ్చితంగా కారణమే అయినప్పటికీ, వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు కూడా ప్రజలకు దగ్గరయ్యేలా చేశాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ముఖ్యమంత్రి పదవులను అనుభవించినవారిని దూరం పెట్టి మరీ కొత్తవారికి అవకాశం కల్పించడం బీజేపీలో మాత్రమే సాధ్యపడింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆ పనిచేయలేకనే ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పార్టీ విస్తరణలో సైద్ధాంతిక భావజాలమే సరుకుగా మారుతుంది తప్ప వ్యక్తి కేంద్రంగా ముందుకు సాగడం లేదు. నేడు చూడ్డానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్కడి చేతిపైనే పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తున్నా.. బలమైన యంత్రాంగాన్ని, వ్యవస్థను పార్టీ నిర్మించుకుంది. మోదీ తర్వాత కూడా అదే తరహాలో పాలన అందించగలిగే నాయకత్వాన్ని ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక ద్వారా చూపెడుతోంది. మోదీ తరహాలోనే కుటుంబం, వారసులు లేని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సహా అనేకమంది ఆ పార్టీలో ద్వితీయ శ్రేణిలో కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో గాంధీ-నెహ్రూ కుటుంబంలోని సోనియా, రాహుల్, ప్రియాంక తప్ప మరొకరు కనిపించడం లేదు. వాజ్‌పేయి-అడ్వాణీల తర్వాత బీజేపీకి నాయకత్వమే లేదు అనుకున్నవారి అంచనాలను తలకిందులు చేస్తూ మోదీ-షా ద్వయం ఇప్పుడు వారికంటే బలవంతంగా మారింది. ఈ ఇద్దరి తర్వాత కూడా పార్టీ నాయకత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదన్న భరోసా కల్పించింది. అన్నింటికంటే ఆ పార్టీకి రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) వంటి సైద్ధాంతిక మాతృసంస్థ తిరుగులేని బలాన్ని, నాయకత్వాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ సంస్థ నుంచి తయారైన అనేక మంది నేతలు కేవలం బీజేపీలోనే కాదు, ఇతర పార్టీల్లోనూ నాయకత్వ లక్షణాలతో దూసుకెళ్తున్నారంటే అతిశయోక్తి కాదు.
పదవులు, అధికారం తనకు, తన కుటుంబానికి లేదా తన కులానికి మాత్రమే దక్కాలి అనుకున్న ప్రాంతీయ, జాతీయ పార్టీలు క్రమక్రమంగా ప్రజలకు దూరమవుతున్నాయి. రాజ్యాధికారాన్ని దక్కించుకోలేకపోయిన అల్పసంఖ్యాక వర్గాలకు సైతం అధికారాన్ని అప్పగిస్తూ, నాయకత్వాన్ని తయారు చేస్తున్న బీజేపీ వంటి పార్టీలు ప్రజాదరణ పొందుతూ క్రమక్రమంగా బలపడుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








