AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాంప్రదాయ వస్త్రధారణలో ఇస్రో ఛైర్మన్.. సోమ్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు

వరుస సక్సెస్‌లు,  కొత్త ప్రాజెక్టుల నేపథ్యంలో ఇస్త్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తన ఆధ్యాత్మిక పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన సాంప్రదాయ వస్త్రధారణలో గుజరాత్‌లోని ప్రముఖ సోమ్‌‌నాథ్ ఆలయాన్ని గురువారంనాడు దర్శించుకున్నారు. ఇస్రో భవిష్యత్ ప్రాజెక్టులు విజయవంతం కావాలని ప్రత్యేకంగా ప్రార్థించారు.

సాంప్రదాయ వస్త్రధారణలో ఇస్రో ఛైర్మన్.. సోమ్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు
ISRO Chairman S Somanath
Janardhan Veluru
|

Updated on: Sep 28, 2023 | 7:54 PM

Share

చంద్రయాన్- 3, ఆదిత్య ఎల్1 ప్రయోగాలు విజయవంతం కావడంతో మరో సాహసానికి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సన్నద్ధమవుతోంది. శుక్రుడిపై పరిశోధనలకు సంబంధించిన ప్రతిష్టాత్మక శుక్రయాన్ ప్రయోగంపై ఇస్రో శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. వరుస సక్సెస్‌లు,  కొత్త ప్రాజెక్టుల నేపథ్యంలో ఇస్త్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తన ఆధ్యాత్మిక పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన సాంప్రదాయ వస్త్రధారణలో గుజరాత్‌లోని ప్రముఖ సోమ్‌‌నాథ్ ఆలయాన్ని గురువారంనాడు దర్శించుకున్నారు. ఇస్రో భవిష్యత్ ప్రాజెక్టులు విజయవంతం కావాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. సోమ్‌నాథ్ ఆలయంలో ఆయన సోమేశ్వర్ మహా పూజ, యజ్ఞం నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ విశేషాలను ఇస్రో ఛైర్మన్‌కి నిర్వాహకులు వివరించారు.

చంద్రయాన్ 3ను జాబిల్లిపై సురక్షితంగా ల్యాండింగ్ చేయించడం తమ కలగా పేర్కొన్న ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్.. సోమ్‌నాథ్ దైవానుగ్రహంతో తమ కల నెరవేరిందన్నారు. సోమ్‌నాథ్ దైవ కటాక్షం లేనిదే తమ ప్రయోగం విజయవంతం అయ్యేది కాదని అన్నారు. అందుకే సోమ్‌నాథ్ ఆలయ దర్శనం కోసం వచ్చినట్లు చెప్పారు. సోమ్‌నాథ్ పేరునే తాను కూడా కలిగి ఉండటం సంతోషం కలిగిస్తోందన్నారు. ఇస్రో భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు విజయవంతం కావాలంటే దేవుని ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టాల్సిన భారీ ప్రాజెక్టులు చాలా ఉన్నాయని.. వాటి అన్నిటికీ దేవుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

శుక్రయాన్ మిషన్‌పై ఇస్రో ఫోకస్..

శుక్రయాన్ మిషన్‌ను చేపట్టనున్నట్లు ఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం అయిన శుక్ర గ్రహాన్ని అధ్యయనం చేస్తే ఖగోళంలో అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. శుక్రగ్రహం చాలా ఆసక్తికరమైన గ్రహమన్నారు. దీని వాతావరణ పీడనం భూమి కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని వివరించారు. భూమిపై శుక్ర గ్రహ ప్రభావంపై ఎన్నో విషయాలు ఈ పరిశోధనల్లో తెలిసే అవకాశముందన్నారు.

నాలుగో దేశంగా భారత్ చరిత్ర..

చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంలో భారత్ చరిత్ర సృష్టించడం తెలిసిందే. ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా మాత్రమే ఈ ఘనతను సాధించగా.. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరింది. జులై 14న శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి చంద్రయాన్ 3 మిషన్‌ను ప్రయోగించగా.. ఆగస్టు 23 తేదీన ఇది జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యింది.

ఇదిలా ఉండగా చంద్రుని దక్షిణ ధ్రువంపై సెప్టెంబర్ 22న సూర్యోదయం కావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ను నిద్రావస్థ నుంచి మేల్కొలిపేందుకు ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మిషన్‌లో వాడిన పరికరాలు అక్కడి అతిశీతల పరిస్థితులను తట్టుకోలేకపోయినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో అవి శాశ్విత నిద్రలోకి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. రోవర్, ల్యాండర్‌ను మేల్కొలిపేందుకు ఇస్రో తన ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తోంది. ఆ ప్రయత్నాలు ఫలించని పక్షంలో చంద్రయాన్ -3 ప్రాజెక్టు పరిసమాప్తమైనట్లు భావించాల్సి ఉంటుంది. ల్యాండర్, రోవర్‌తో ఇస్రో ఇక మళ్లీ కనెక్ట్ కాలేకపోయినప్పటికీ చంద్రయాన్-3 మిషన్ అఖండ విజయమే.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి