Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RG Kar Case: చచ్చేవరకు జైలులోనే కామపిశాచి.. మరణశిక్ష ఎలా తప్పింది.?

అయితే.. ఇంత దారుణమైన నేరం చేసిన దోషికి ఉరి శిక్ష ఒక్కటే సరైనదంటూ సీబీఐ వాదించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా తన వాదనలో ఉదహరించింది. సంజయ్‌రాయ్‌కి ఉరి శిక్ష విధించడం అన్నివిధాలా సరైందేనని, అందుకు 50 మంది సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజ్‌ అనాలసిస్..

RG Kar Case: చచ్చేవరకు జైలులోనే కామపిశాచి.. మరణశిక్ష ఎలా తప్పింది.?
13
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 20, 2025 | 9:45 PM

‘నా పేగు తెంచుకుని పుట్టినోడే కావొచ్చు.. అయినా సరే ఈ భూమ్మీద జీవించే హక్కు లేదు’ అంటూ ఆ తల్లి తన కుమారుడి మరణాన్ని కోరుకుంది. ఉరి శిక్ష ఒక్కటే సరైనది అని ఆ తల్లి కూడా నినదించింది. ఒకవేళ కోర్టు గనక ఉరిశిక్ష వేస్తే.. ఆ శిక్షను మార్చేందుకు అప్పీల్‌ కూడా చేయబోమని కుటుంబం మొత్తం ఒక్కమాటపైనే నిలబడింది. యావత్‌ భారతావనిని కుదిపేసిన అత్యంత జుగుప్సాకర అత్యాచార, హత్య కేసులో దోషి సంజయ్‌రాయ్‌కి ఏ శిక్ష విధిస్తారోనని దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూసింది. ఈ కేసులో సీబీఐ కూడా బలమైన వాదనలు వినిపించింది. అయితే.. దోషి సంజయ్‌రాయ్‌కి చనిపోయేంత వరకు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది కోల్‌కతా సీల్దా కోర్టు. కోల్‌కతాలోని ఆర్జీకర్‌ హాస్పిటల్‌లో.. ఒక ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన సంజయ్‌ రాయ్‌ని సీల్దాలోని డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు ఈనెల 18న దోషిగా తేల్చింది. ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న సీల్దా కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనిర్భన్‌ దాస్.. దోషిని చనిపోయేదాకా జైల్లో పెట్టి శిక్షించడమే సరైంది అంటూ తీర్పు ఇచ్చారు.

అయితే.. ఇంత దారుణమైన నేరం చేసిన దోషికి ఉరి శిక్ష ఒక్కటే సరైనదంటూ సీబీఐ వాదించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా తన వాదనలో ఉదహరించింది. సంజయ్‌రాయ్‌కి ఉరి శిక్ష విధించడం అన్నివిధాలా సరైందేనని, అందుకు 50 మంది సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజ్‌ అనాలసిస్, బలమైన బయోలాజికల్ శాంపిల్స్‌ సాక్ష్యమని చెప్పింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్‌రాయ్‌కి ఉరి శిక్షే సరైందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. అందుకే, ఈ హత్యాచార ఘటనను ‘అరుదైన కేసులలోనే అరుదైన కేసుగా’ పరిగణించాలని సీబీఐ కోర్టును కోరింది. సమాజంపైనా, వ్యవస్థలపైనా ప్రజల్లో విశ్వాసం ఉండాలంటే.. అత్యధిక శిక్ష విధించాలనే తాము కోర్టును ప్రార్ధిస్తున్నాం అంటూ వాదనలు వినిపించింది సీబీఐ. చనిపోయిన వ్యక్తి ఎంతో ప్రతిభావంతురాలని, డాక్టర్లకే రక్షణ లేకపోతే ఇంకేం చేయాలని కోర్టుకు విన్నవించింది. అయితే.. ఈ కేసులో తీర్పు ఇవ్వడానికి ముందు.. సీల్దా కోర్టు జడ్జ్ అనిర్బన్‌ దాస్‌ కొన్ని కీలక కామెంట్స్‌ చేశారు. ఈ కేసు ‘అరుదైనది’ అని తాము భావించడం లేదని స్పష్టం చేశారు. అందువల్లే, దోషికి మరణశిక్ష కాకుండా చనిపోయే వరకు జైలు శిక్ష విధించడమే సరైందిగా భావించి తీర్పు ఇస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, దోషి సంజయ్‌రాయ్‌కి 50వేల రూపాయల జరిమానా కూడా విధించింది కోర్టు. మరోవైపు, బాధితురాలి కుటుంబానికి 17 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా బెంగాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ తీర్పుపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. దోషికి మరణ శిక్ష విధిస్తేనే బాధితురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుందంటూ రియాక్ట్‌ అయ్యారు. అటు బాధితురాలి తల్లిదండ్రులు కూడా కోర్టు తీర్పుపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీబీఐ విచారణపైనా, పరిహారంపైనా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాము పోరాడింది న్యాయం కోసం తప్ప పరిహారం కోసం కాదని కామెంట్ చేశారు. తమ కూతురిపై జరిగిన నేరంలో చాలామంది ప్రమేయం ఉందని, కాని ఆ నిందితులను పట్టుకోవడంలో సీబీఐ పూర్తిగా విఫలమైందంటూ ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలను అరికట్టాలంటే.. నేరస్తులకు జీవించే హక్కు ఉండకూడదంటూ వాదించారు. కోర్టు తీర్పు రాగానే.. కోర్టు ప్రాంగణంలోని ప్రజలు కూడా నినాదాలు చేశారు. ‘ఈ పాశవిక హత్యాచారం చేసింది సంజయ్‌ రాయ్‌ ఒక్కడే కాకపోవచ్చని, ఇంకొందరు వ్యక్తులు కూడా ఉండి ఉండొచ్చని’ గట్టిగా అరుస్తూ నినాదాలు చేశారు.

ఇదిలా ఉంటే.. దోషి సంజయ్‌ రాయ్‌ మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని చివరి వరకూ వాదించాడు. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని చెప్పుకున్నాడు. తనను చిత్ర హింసలకు గురి చేసి.. వాళ్లు కోరుకున్న దానిపై సంతకం చేయించారని, తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. సీబీఐ కస్టడీలో ఉన్నప్పుడు.. కనీసం వైద్య పరీక్షలకు కూడా తీసుకెళ్లలేదని వాదించాడు. తానే గనక వైద్యురాలిపై అత్యాచారం చేసి ఉంటే.. తన మెడలో ఉన్న రుద్రాక్షమాల ఆ క్షణంలోనే తెగిపోయేదంటూ కోర్టు హాలులో చెప్పాడు. సంజయ్‌రాయ్‌ వాదనలు విన్న న్యాయమూర్తి గట్టిగానే స్పందించారు. ‘మూడు గంటల పాటు నీ వాదనలు విన్నానన్న విషయం మరిచిపోవద్దు’ అంటూ దోషి సంజయ్‌రాయ్‌కి గుర్తు చేశారు. తన ముందున్న అభియోగాలు, సాక్ష్యాలు, దస్త్రాలు అన్నీ పరిశీలించే దోషిగా తేల్చినట్టు స్పష్టం చేశారు. ఫైనల్‌గా.. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌ 64, 66, 103 ఆఫ్‌ 1 కింద సంజయ్‌రాయ్‌ని దోషిగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. ట్రైనీ డాక్టర్‌ను అత్యంత పాశవికంగా హత్యాచారం చేసిన దోషికి.. ఉరిశిక్ష విధించాలంటూ పశ్చిమ బెంగాల్‌లో మరోసారి నిరసనలు మొదలయ్యాయి. సీల్దా కోర్టు ఎదుట ఆర్జీకర్‌ మెడికల్‌ కాలేజ్ స్టూడెంట్స్‌ నిరసనకు దిగారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాల్సిందేనని పట్టుబట్టారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌ చేస్తామన్నారు వైద్య విద్యార్ధులు. చూస్తుంటే.. బెంగాల్‌ మరోసారి మండేలాగే కనిపిస్తోందీ వ్యవహారం.

ఇకపై ఏం జరుగుతుంది? ఒకటి మాత్రం నిజం. ఈ పోరాటం ఇప్పట్లో ఆగదు. సంజయ్‌రాయ్‌కి ఉరి శిక్ష పడేంత వరకు విశ్రమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు ఆర్జీకర్‌ హాస్పిటల్‌ వైద్యులు, వైద్య విద్యార్ధులు. అటు బెంగాల్‌ ప్రభుత్వం కూడా తీర్పుపై అసంతృప్తిగానే ఉంది. నిందితుడికి మరణశిక్షే సరైందని తాము మొదటి నుంచి డిమాండ్‌ చేస్తున్నామంటూ సీఎం మమతా బెనర్జీ వాయిస్‌ రైజ్ చేశారు. తాము నిష్పాక్షింగా దర్యాప్తు చేస్తున్న కేసును.. బలవంతంగా సీబీఐకి ట్రాన్స్‌ఫర్‌ చేయించారని గట్టి ఆరోపణలే చేశారు సీఎం మమతా. అసలు.. సంజయ్‌ రాయ్‌కి ఉరి శిక్ష పడకపోవడానికి సీబీఐనే కారణం అంటూ మరింత ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకవేళ.. ఈ కేసును బెంగాల్‌ పోలీసులే గనక విచారించి ఉంటే.. సంజయ్‌ రాయ్‌కి మరణశిక్ష పడేలా శాయశక్తులా ప్రయత్నించేవారు అంటూ రియాక్ట్‌ అయ్యారు. ఇలాంటి దారుణమైన నేరాల్లో దోషులను ఉరితీయాల్సిందేనని, జీవిత ఖైదు అనేది చాలా చిన్న శిక్ష అని అభిప్రాయపడ్డారు సీఎం మమతా. ముఖ్యమంత్రే కాదు.. అటు సీబీఐ కూడా అసంతృప్తిగానే ఉంది ఈ తీర్పుపై. దీంతో డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌పై హైకోర్టులో అప్పీల్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. సీల్దా కోర్టులో సైతం సంజయ్‌రాయ్‌కు ఉరిశిక్ష వేయాలనే వాదించినప్పటికీ.. కోర్టు మాత్రం తన దగ్గరున్న సాక్ష్యాలు, ఆధారాలు, ఘటన తీవ్రత ఆధారంగా జీవిత ఖైదు విధించింది. మరోవైపు.. సంజయ్‌ రాయ్‌ కూడా అప్పీల్‌కు వెళ్లేలాగే ఉన్నాడు. తాను ఎలాంటి నేరం చేయలేదని వాదిస్తున్నాడు. మరణశిక్ష విధించినా.. అప్పీల్‌ చేసుకునేందుకైతే అవకాశం ఉంటుంది. సో, హైకోర్టు అటుపైన సుప్రీంకోర్టుకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. కాకపోతే.. సీబీఐ ఎలాంటి వాదనలు వినిపిస్తుందన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. నిర్భయ ఘటనలోనే నిందితులకు మరణశిక్ష పడింది. అలాంటిది.. ఈ అభయ ఘటన అంతకు మించి జరిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ చేసే వాదనలు, చూపించే సాక్ష్యాధారాలు, ఆ తీవ్రతను బట్టే సంజయ్‌రాయ్‌కి ఉరిశిక్ష పడే అవకాశం ఉంటుంది.

ఇక బాధితురాలి తల్లిదండ్రులు కూడా సీబీఐ విచారణపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. దోషికి జీవిత ఖైదు విధించడం పైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. సో, ఈ లెక్కన.. బాధితురాలి తల్లిదండ్రులను కూడా ఈ తీర్పును, సీబీఐ విచారణను సవాల్‌ చేస్తూ పైకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణం ఏంటంటే.. సంజయ్‌రాయ్‌కి జీవితఖైదు విధిస్తూ తీర్పు రావడంపై తీవ్ర అసంతృప్తి అయితే ఉంది. అందులో నో డౌట్. నిన్నటి దాకా ఉరి శిక్ష వేస్తారనే ఎవరికి వారు ఊహించుకున్నారు. సో.. ఆ రకంగా చూసినా.. సంజయ్‌ రాయ్‌కి ఉరిశిక్ష విధించే వరకూ ఈ పోరాటం ఆగకపోవచ్చు.

2024 ఆగస్ట్ 9. కోల్‌కతా ఆర్జీ కర్‌ హాస్పిటల్‌లో సెకండియర్ పీజీ చేస్తున్న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్.. నైట్‌ డ్యూటీ తర్వాత కొలీగ్స్‌తో కలిసి సెమినార్ హాల్‌లో డిన్నర్ చేసింది. 36 గంటల పాటు డ్యూటీ చేసి అలసిపోయి.. విశ్రాంతి కోసం అదే సెమినార్ హాల్‌లోకి వెళ్లి చిన్న కునుకు తీసింది. తెల్లారే సరికి దారుణ హత్యకు గురైంది. మామూలు హత్య కాదది. నిర్భయను ఎంతలా టార్చర్‌ చేశారో.. అంతకంటే దారుణంగా హింసించి చంపారు. ఎంత పాశవికం కాకపోతే.. ట్రైనీ డాక్టర్‌ కళ్లల్లో గాజు ముక్కలు ఉంటాయి. మొహం మొత్తం గాట్లు, ఒంటి నిండా గాయాలు. కళ్లల్లోంచి, నోట్లోంచి, కడుపులోనూ రక్తం. పోస్ట్‌మార్టం వివరాలు విన్న ప్రతి ఒక్కరు చలించిపోయారు. అంతేకాదు.. అత్యాచారం చేసే సమయంలో.. ఆమె అరవకుండా ఉండేందుకు గొంతును గట్టిగా అదిమారు. ఆ బలప్రయోగానికి థైరాయిడ్‌ గ్రంధి విరిగిపోయింది. ఉదయాన్నే.. తోటి డాక్టర్లు వచ్చి చూసే సరికి ఆ ట్రైనీ డాక్టర్‌ ఏ స్థితిలో ఉన్నారో తెలుసా. మృతురాలి కాళ్లు 90 డిగ్రీలకు నిలువునా విడదీసి ఉన్నాయని చూసిన వాళ్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. నాలుగు పేజీల పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లోనూ.. అభయ ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం జరిగిందనే ఉంది. ఆమె మెడ ఎముక కూడా విరిగినట్లు గుర్తించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్స్‌ ప్రకారం.. అంత దీనస్థితిలో ఉన్నప్పటికీ తన ప్రాణాలను కాపాడుకోడానికే ప్రయత్నించింది ఆ ట్రైనీ డాక్టర్. కళ్లల్లో నుంచి, నోట్లో నుంచి, ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తస్రావం అవుతున్నా.. సృృహ ఉన్నంత వరకు ఎదురుతిరిగింది. చివరకు ఓడిపోయింది.

ఇంత దారుణంగా చంపేస్తే.. పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌లోనూ నివ్వెరపోయే వాస్తవాలు బయటపడితే.. కొందరు మాత్రం ఇది హత్య కాదు ఆత్మహత్య అని ప్రచారం చేశారు. అంటే.. ఎవరినో కాపాడే ప్రయత్నం గట్టిగా జరుగుతోందంటూ ఆనాడే అనుమానించారు చాలామంది. అసలు.. ఈ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడానికి కారణం కూడా.. ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకోవడమే. కొందరు అధికారుల తీరుపై అనుమానం పెరిగి డాక్టర్లు ఆందోళన చేయడంతో దేశమొత్తానికి తెలిసింది. దాంతో.. దర్యాప్తులో వేగం కూడా పెరిగింది. అసలు.. ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారని ఆరా తీశారు. అప్పుడు కనిపించిన ఒకేఒక్కడు.. సంజయ్‌రాయ్. ఇంతకీ ఎవరీ సంజయ్‌రాయ్. ఒక సివిక్ సర్వీస్ వాలంటీర్. కాంట్రాక్ట్ ఉద్యోగి. నెలకు 12 వేల జీతం. పోలీసులకు హెల్పర్‌గా ఉంటాడు. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా అపోజిషన్ లీడర్ల మీద నిఘా పెడుతుంటాడు. అప్పుడప్పుడూ ట్రాఫిక్ డ్యూటీ చేస్తూ.. అనారోగ్యంతో ఉన్న పోలీసులకు సాయం చేస్తూ ఉంటాడు. కానిస్టేబుల్స్‌కి ఉండే అన్ని రకాల వెసులుబాట్లూ ఉంటాయి గనుక.. ఆర్‌జీకర్ ఆస్పత్రిలో ప్రతీ వార్డుకీ, ప్రతీ డిపార్ట్‌మెంట్‌కీ చాలా ఈజీగా వెళ్లి వచ్చేవాడు. సంజయ్‌రాయ్ గతంలో తప్పతాగి అదే ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఫిర్యాదులున్నాయి. పైగా గతంలో నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. సంజయ్‌రాయ్‌ ప్రవర్తన నచ్చక ముగ్గురు భార్యలు వెళ్లిపోతే.. నాలుగో భార్య క్యాన్సర్‌తో చనిపోయింది. పోర్న్ వీడియోలను విపరీతంగా చూడడం సంజయ్‌కు ఉన్న మరో హాబీ. సీసీఫుటేజ్‌ ఆధారంగా సంజయ్‌ రాయ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని విచారించాక, అతని మాటలు విని ఆశ్చర్యపోయారు. పోలీసులకు దొరికిన తర్వాత కూడా.. ఏం చేసుకుంటారో చేసుకోండని కాలర్ ఎగరేశాడని చెప్పారు పోలీసులు.

అయితే.. ఇంత దారుణానికి పాల్పడింది ఒక్కడే అయి ఉండడు అనేది ప్రధాన అనుమానం. అభయపై అత్యాచారం చేసింది ఒక్కడు కాదు చాలా మంది అనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పటికీ.. బాధితురాలి తల్లిదండ్రులు చేస్తున్న వాదన అదే. పోస్ట్‌మార్టమ్ రిపోర్టును లోతుగా చదివిన సువర్ణో గోస్వామి అనే ఓ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం.. కనీసం 10 మంది మృగాళ్లు ఆమెపై అఘాయిత్యం చేసి ఉంటారని చెప్పారు. అభయ మృతదేహాన్ని రహస్యంగా దహన సంస్కారం చేసి.. అవసరమైనప్పుడు రెండోసారి పోస్ట్‌మార్టం చేసే ఛాన్స్ లేకుండా చేశారన్నది మరో అభియోగం. ఇక ఆ సమయంలో కాలేజ్ ప్రిన్సిపాల్‌గా ఉన్న సందీప్‌ కామెంట్స్‌ వింటే.. ఎవరికైనా మంటెక్కిపోద్దీ. ‘రాత్రి పూట సెమినార్ హాల్లో ఆమెకేం పని.. ఒంటరిగా ఎందుకుంది’ అంటూ ఆమె క్యారెక్టర్‌ని శంకించాడు. ఆ వ్యాఖ్యలపై నిరసనలు రావడంతో.. రాజీనామా చేశాడు. కానీ.. కొన్ని గంటల్లోనే అతడికి ప్రమోషన్ ఇచ్చి కోల్‌కతా నేషనల్ మెడికల్ హాస్పిటల్‌లో పోస్టింగ్ ఇచ్చింది మమతా సర్కార్. అయితే.. ఈ కేసులో దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ స్వయంగా సీఎం మమతా బెనర్జీ కూడా రోడ్డుమీదకొచ్చి నినాదాలిచ్చారు. అయినా సరే.. ఈ కేసులో నిందితుడికి పోలీసులతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించారు బాధితురాలి తల్లిదండ్రులు. వెంటనే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిగిపాలని కోరారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో.. హైకోర్టు ఈ కేసు విచారణను తీసుకుంది. హత్యాచార ఘటన కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. అయితే.. ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ.. సంచలన విషయాలు చెప్పింది. సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్న వేళ.. ఆ ప్రచారాన్ని సీబీఐ తోసిపుచ్చింది. సాక్ష్యాలను బట్టి చూస్తే సంజయ్ రాయ్ ఒక్కడే అభయపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హత్యచేశాడని తేల్చింది. దీంతో సీబీఐ విచారణపైనా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

సంజయ్‌ రాయ్‌ని దోషి అని తేల్చినా.. కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించినా.. ఆరోజు ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఇప్పటికీ అవే అనుమానాలు వెంటాడుతున్నాయి కొందరిని. సంజయ్ రాయ్ ఒక్కడే హత్యాచారం చేసి ఉండడు అనేది తల్లిదండ్రుల వాదన. కొందరు డాక్టర్లు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. ఇక.. ఈ కేసులో కీలకమైన వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేశారనేది మరో వాదన. బెంగాల్‌ పోలీసులు విచారించినప్పుడు, ఈ కేసును సీబీఐ టేకప్‌ చేసినప్పుడు ఏవైతే అనుమానాలు ఉన్నాయో.. ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి. మరి.. మున్ముందు ఈ కేసులో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..