మహాబలిపురంలో ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ క్లాస్.. తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలని వార్నింగ్
ఎమ్మెల్యేలంటే ప్రజాసేవకులు. ఆధిపత్య పెత్తనాలు చేసే దొరలు కాదు. అధికారులను గౌరవించడం, ప్రజల సమస్యలను తీర్చడం, నిత్యం ప్రజల్లో తిరగడం ఇదే నాయకుడికి ఉండాల్సిన లక్షణం. కానీ తమిళనాడు అధికారపార్టీలో ఇటీవల జరిగిన వరుస ఘటనలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి. అందుకే ఊరికి మంచి చెప్పాలంటే ముందు మనం మంచిగా ఉండాలన్న ఫార్ములాను తన పార్టీలో సీఎం విజయ్ అప్లై చేయబోతున్నారు. ఎమ్మెల్యేల తీరు మార్చుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అవినీతి మరక అంటుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా..ఇంతకూ మహాబలిపురం మీటింగ్ సెంటర్‌లో ఏం జరిగింది..?

టీవీకే అధికారంలోకి వచ్చి జస్ట్ ఆరునెలలే. అప్పుడే అంతర్గత యుద్ధం మొదలైంది. ప్రజలకు సేవ చేయాల్సిన ఎమ్మెల్యేలే వివాదాల్లో చిక్కుకోవడంతో పార్టీ నాయకత్వం ఇరకాటంలో పడింది. కొందరు విపక్షాలతో బేరసారాల చేశారన్న ఆరోపణలు.. డిప్యూటీ స్పీకర్ ఓసామాన్యుడ్ని కొట్టడం ఒక ఎమ్మెల్యే కలెక్టర్‌ని బెదిరించడం డ్రగ్స్, భూకబ్జాలు, సెటిల్‌మెంట్‌లు, లైంగిక వేధింపులు.. ఇలా ఒక్కొక్కటిగా విమర్శలు, ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి. విపక్షాలకు విమర్శించేందుకు అస్త్రాలుగా మారుతున్నాయి. దీంతో పార్టీ అధినేత, సీఎం విజయ్ ముందే మేల్కొన్నారు. పార్టీని, నేతలను చక్కదిద్దేంకు స్వయంగా యాక్షన్‌లోకి దిగారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఎమ్మెల్యేల మెండ్ సెట్‌ను సెట్ చేయాలని డిసైండ్ అయ్యారు..
ఇందులో భాగంగా మహాబలిపురంలోని ప్రైవేట్ రిసార్ట్‌లో మీటింగ్ ఏర్పాటు చేశారు. బుధవారం తొలి దశ తోముడు కార్యక్రమం మొదలుపెట్టారు సీఎం విజయ్..ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి, పార్టీ క్రమశిక్షణ, ప్రజల సమస్యలపై స్పందించే తీరు.. ఇలా అనేక అంశాలపై విజయ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.
తిరుచ్చి జిల్లాలోని తురైయూర్‌లో డిప్యూటీ స్పీకర్ ఎం. రవిశంకర్‌పై వచ్చిన ఆరోపణలు పార్టీని ఇబ్బందుల్లో పడేసింది. నియోజకవర్గంలో తాగునీరు, ఇతర సమస్యలపై ప్రశ్నించేందుకు వచ్చిన కార్తీక్ కుమార్ అనే వ్యక్తిపై చేయిచేసుకోవడం కలకలం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇది తీవ్ర దుమారం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విపక్షాలు విరుచుకుపడ్డాయి. తర్వాత బాధితుడు ఎమ్మెల్యే పక్కన కూర్చుని దాడి జరగలేదంటూ మరో వీడియో విడుదల చేశాడు. ఆ తర్వాత తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించి బలవంతంగా ఆ వీడియో తీయించారని ఆరోపిస్తూ మరో వీడియో విడుదల చేయడంతో రచ్చ డబుల్ అయింది. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరిపించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
ఇక కల్లకురిచ్చి ఎమ్మెల్యే సీ. అరుల్ విఘ్నే్‌ష్ పై వచ్చిన ఆరోపణలైతే పీక్స్. ఆయన ఏకంగా మహిళ జిల్లా కలెక్టర్‌కు వాట్సాప్‌లో అనుచిత సందేశాలు పంపారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. అయినా వివాదం సద్దుమణగలేదు. దీంతో పార్టీలో ఎమ్మెల్యేల ప్రవర్తనపై ఇంటా బయటా చర్చ మొదలైంది. విపక్షాలు టీవీకే ప్రభుత్వాన్ని ఏకిపారేశాయి. దీంతో ఇది ప్రత్యర్ధులకు అవకాశంగా మారకూడదని భావించిన సీఎం విజయ్..స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. ఆరోపణలు వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలనే కాదు..టోటల్ పార్టీలోని నేతలందర్నీ క్రమశిక్షణలో పెట్టాలని డిసైడ్ అయ్యారు.
ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు నియోజకవర్గాల్లో ప్రజలతో ఎలా వ్యవహరించాలి? అధికారులతో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలి? వ్యక్తిగత వ్యవహారాలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించకుండా ఎలా చూసుకోవాలి? అన్న అంశాలపై విజయ్ గట్టిగానే క్లాస్ పీకే అవకాశం ఉంది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో పార్టీ అంతర్గత విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలపై వస్తున్న విమర్శలు కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. మంత్రి శరత్‌కుమార్‌పై డ్రగ్స్ ఆరోపణలు రావడం, దానికి ఆయన వివరణ ఇవ్వడం, తాంబరం మున్సిపాలిటీ ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు రావడం వంటి అంశాలు కూడా విపక్షాల విమర్శలకు కారణమయ్యాయి.
మరోవైపు ఇదే సమయంలో పార్టీ పరంగా సంయమనం పాటించాల్సిన అవసరమూ ఉంది. ఎందుకంటే టీవీకే ప్రభుత్వం సొంత బలంతో నడుస్తున్న ప్రభుత్వం కాదు. కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, వామపక్షాలు మద్దతుతో నడుస్తున్న సర్కార్. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగినా, విపక్షాలు వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేసినా ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. తమ ఎమ్మెల్యేలను డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ప్రలోభాలు పెడుతోందని టీవీకే ఇప్పటికే ఆరోపిస్తూ వస్తోంది.. మరోవైపు ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. సో..ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే పార్టీ బలం పెంచుకోవాల్సిన బాధ్యత విజయ్‌పై ఉంది. ఈ పరిస్థితుల్లో ఏమాత్రం దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆచుతూచి విజయ్ రియాక్షన్స్ ఉండాలంటున్నారు పరిశీలకులు. మొత్తానికి మహాబలిపురం మీటింగ్ విజయ్ పార్టీకి ఒక లిట్మస్ టెస్ట్ లాంటిదంటున్నారు విశ్లేకులు.
