క్రెడిట్ కార్డు ద్వారా క్యాష్ విత్ డ్రా చేస్తే మీకే నష్టం.. ఈ తప్పులు చేయకండి..

Venkatrao Lella

Images: Pinterest

11 NOV 2026

ప్రస్తుతం ఎవరి దగ్గర చూసినా ఏదోక క్రెడిట్ కార్డు కనిపిస్తుంది. కొంతమంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు కూడా తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. అయితే ఈ ఒక్క తప్పు చేయడం వల్ల మీరు భారీగా నష్టపోవాల్సి వస్తుంది.

క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా చేసే సదుపాయం ఉంటుంది. దీనినే క్యాష్ అడ్వాన్స్‌గా పిలుస్తారు. నగదు అత్యవసరమైనప్పుడు చాలామంది ఈ పని చేస్తారు. ఎట్టిపరిస్థితిల్లోనూ ఇలా చేయకండి.

ఏటీఎం ద్వారా క్రెడిట్ కార్డుతో నగదు విత్ డ్రా చేస్తే నిబంధనలు వేరుగా ఉంటాయి. విత్ డ్రా చేసిన నగదుపై తొలి రోజు నుంచే వడ్డీ పడుతుంది. అలాగే క్యాష్ అడ్వాన్స్ ఫీజులు, జీఎస్టీ, అదనపు ఫీజులు కూడా అధిక మొత్తంలో వసూలు చేస్తారు.

మీరు రూ.10 వేలు విత్ డ్రా చేస్తే.. వడ్డీ, జీఎస్టీ, అదనపు ప్రాసెసింగ్ ఫీజల వల్ల మీపై అధిక భారం పడుతుంది. దీంతో మీరు విత్ డ్రా చేసినదానికంటే ఎక్కువ చెల్లించాల్సి రావొచ్చు. దీంతో దీనికి దూరంగా ఉండండి.

సాధారణంగా క్రెడిట్ కార్డు ద్వారా ఇతర మార్గాల ద్వారా ఖర్చు చేసి డబ్బులకు 40 రోజుల వరకు వడ్డీ పడదు. ఆ తర్వాత డ్యూ డేట్ కల్లా బిల్లు చెల్లించకపోతే వడ్డీతో పాటు ఆలస్యపు ఫీజులు, జరిమానాలు పడతాయి.

అయితే ఏటీఎం ద్వారా విత్ డ్రా చేస్తే అలాంటి ప్రయోజనాలు వర్తించవు. వడ్డీ రహిత కాలం ప్రయోజనం లేకపోగా.. తొలిరోజు నుంచే వడ్డీ, క్యాష్ అడ్వాన్స్ ఫీజులు వసూలు చేస్తారు.

ఉదాహరణకు మీరు రూ.10 వేలు విత్ డ్రా చేస్తే 2.5 శాతం విత్ డ్రా రుసుం, 3 శాతం నెలవారీ వడ్డీ రేటు, 2.5 శాతం నుంచి 3.5 శాతం వరకు క్యాష్ అడ్వాన్స్ ఫీజులు పడతాయి. ఇవన్నీ కలిపి అదనంగా రూ.644 వరకు పడతాయి.

రూ.10 వేలు విత్ డ్రా చేస్తే అడ్వాన్స్ ఫీజు రూ.250, వడ్డీ, జీఎస్టీ కలిపి 30 రోజులకు అదనంగా రూ.644 పడుతుంది. అంటే మీరు రూ.10 వేలు విత్ డ్రా చేసినా చెల్లింపు మొత్తం రూ.10,644 అవుతుంది.

ఇక ఆలస్యంగా చెల్లింపులు చేస్తే వడ్డీ భారం మరింత పెరిగిపోతుంది. అంతేకాకుండా ఈ విధానంలో విత్ డ్రా చేస్తే ఎలాంటి రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్, ఇతర ఆఫర్లు లభించవు.