Andhra: ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ వివాదంలో 16 ఏళ్ల యువకుడు కార్తీక్ మృతి
తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో ఓ యువకుడి మరణం తీవ్ర కలకలం రేపుతోంది. మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పక్కా స్కెచ్‌తో జరిగిన హత్య అనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలిది క్షణికావేశంలో జరిగిన హత్యా? లేక మాట్లాడాలనే పేరుతో నమ్మించి చేసిన ముందస్తు కుట్రనా? ఈ మిస్టరీని ఛేదించేందుకు కడియం పోలీసులు రంగంలోకి దిగారు. అసలు మరణం వెనుక ఏం జరిగింది.

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. ఓ యువకుడి పాలిట మృత్యుపాశమైంది..! సోషల్ మీడియాలో మొదలైన చిన్న పరిచయం.. చివరకు ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది..! తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మైనర్ బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో కార్తీక్‌కు పరిచయం
వేమగిరికి చెందిన 16 ఏళ్ల కార్తీక్.. అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నాడు..! ఆ పరిచయం కాస్తా చాటింగ్ వరకు వెళ్లింది..! అయితే.. వీరిద్దరి మధ్య సాగుతున్న సంభాషణ బాలిక తండ్రికి తెలియడంతో వివాదం మొదలైంది..! బాలిక తండ్రి.. మరో ఇద్దరు బంధువులతో కలిసి కార్తీక్ దగ్గరకు వెళ్లాడు..! మందలించడంతో సరిపెట్టకుండా దాడికి దిగినట్లు కార్తీక్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కార్తీక్ కడుపులో బలంగా తన్నడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అస్వస్థతకు గురైన కార్తీక్‌ను ఆసుపత్రికి తరలింపు
ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్తీక్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా.. దురదృష్టవశాత్తు మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. మాట్లాడాలని పిలిచి కార్తీక్‌ను హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కళ్లముందే ఎదిగిన కొడుకు విగతజీవిగా మారడంతో తల్లి కన్నీరుమున్నీరవుతోంది. తన కుమారుడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
కార్తీక్ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కడియం పోలీసులు.. పరారీలో ఉన్న బాలిక తండ్రితో పాటు మరో ఇద్దరు బంధువులను అరెస్ట్ చేశారు..! కార్తీక్ మృతికి కారణమైన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు..!
