ఆ పెద్ద నటుడు నన్ను అసభ్యకరంగా తాకాడు.. ఏడెనిమిది మంది అమ్మాయిలను కాపాడా: నటి పూజిత
సీరియల్స్ ద్వారా చాలా మంది నటీనటులు పాపులర్ అయ్యారు. వారిలో పూజిత ఒకరు. సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించి మెప్పించారు పూజిత. పూజిత తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఆమె వివాహ బంధం ఎదుర్కొన్న తీవ్రమైన సవాళ్ల గురించి ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు.

సినీ నటి పూజిత ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలోని చీకటి కోణాలను, తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు. ఒకప్పుడు తాను హీరోయిన్గా చేస్తున్న సమయంలో ఒక పెద్దాయన తన తొడపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఇంటికి కోపంగా వెళ్లిపోగానే తన తండ్రి “నువ్వు ఒక్కదానివే ఉంటావు, నిన్ను ఎవరూ గోకరు” అంటూ ఒక కారును కొనిచ్చారని ఆమె తెలిపారు. నాటి నుంచి నేటి వరకు తాను తన కార్లో తన కుమారుడు, పెంపుడు కుక్క తప్ప మరెవరినీ ఎక్కనివ్వనని, అది తన కఠిన నియమంగా మారిందని పూజిత వివరించారు.
క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడుతూ, ఇది ఒక్క సినీ పరిశ్రమలోనే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లలోనూ, ఐటీ రంగం నుంచి స్వీట్ షాప్ వరకు ప్రతిచోటా ఉందని ఆమె స్పష్టం చేశారు. అయితే ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి దీనిపై ఎక్కువ హైప్ వస్తుందని అన్నారు. కాస్టింగ్ కౌచ్ ఇంత పెద్ద ఎత్తున బయటకు రావడానికి లేడీ ఆర్టిస్టుల మౌనం కూడా ఒక కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. “మీరు మాట్లాడినట్టుగా వాళ్లు ముందుగా మాట్లాడి ఉంటే బహుశా ఇంత దూరం వచ్చేది కాదు” అని పూజిత అన్నారు. అవకాశాల కోసం రాజీ పడే మనస్తత్వం ఉన్నందువల్లే ఇలాంటివి జరుగుతున్నాయని, అన్ని జరిగిన తర్వాత బయటకు వచ్చి ఫిర్యాదులు చేయడం సరైంది కాదని ఆమె పేర్కొన్నారు.
అవకాశాల కోసం ఆరాటపడే యువతులు ఎలా మోసపోతారో వివరిస్తూ, తణుకు నుంచి సూట్‌కేస్‌తో వచ్చిన “కనకమహాలక్ష్మి” అనే అమ్మాయి కథను పూజిత పంచుకున్నారు. ఆ అమ్మాయి తన వద్ద డబ్బు, నగలు ఉన్నాయని, హీరోయిన్ అయిపోతానని నమ్మి వచ్చిందని చెప్పారు. పోలీస్ స్టేషన్లో తన వద్దకు వచ్చిన ఆ అమ్మాయికి, హీరోయిన్ కావాలంటే ఎలాంటి రాజీలు పడాల్సి వస్తుందో పూజిత వివరించారు. “హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా నీకు? ఒకాయన వస్తాడు, నిన్ను హీరోయిన్ చేస్తానంటాడు. తీసుకెళ్తాడు. హోటల్‌కి తీసుకెళ్తాడో, వాళ్లింటికి తీసుకెళ్తాడో, వాళ్ల రూమ్‌కి తీసుకెళ్తాడో. మొత్తానికి నువ్వు ఆయనతో ఉండాలి” అని చెప్పినప్పుడు, ఆ అమ్మాయి “నేను మా అమ్మ నాన్నకి ఒకటే పిల్లనండి. తలదించుకునే పని నేనెలా చేస్తానండి, నేను చేయనండి” అని కన్నీరు పెట్టుకుందని పూజిత తెలిపారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి రప్పించి, వారికి నచ్చచెప్పి తిరిగి పంపించినట్లు చెప్పారు. ఇలా తాను ఏడెనిమిది మంది అమ్మాయిలను కాపాడానని పూజిత వెల్లడించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




