AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొమ్మిది భాషల్లో అర్జున్ సినిమా.. ఈసారి అలాంటి పాత్రలో కనిపించనున్న యాక్షన్ కింగ్

తనదైన నటన, అద్భుతమైన యాక్షన్ పాత్రలతో హీరోగా, డైరెక్ట‌ర్‌గా భారతీయ ప్రేక్షకుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న యాక్ష‌న్ కింగ్ అర్జున్ సర్జా ప్ర‌ధాన పాత్ర‌లో ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్‌పై అనూప్ మోహ‌న్ నిర్మాత‌గా భారీ బ‌డ్జెట్‌తో దేశ‌భ‌క్తి సినిమా రూపొంద‌నుంది.

తొమ్మిది భాషల్లో అర్జున్ సినిమా.. ఈసారి అలాంటి పాత్రలో కనిపించనున్న యాక్షన్ కింగ్
Arjun
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2026 | 9:53 PM

Share

కొన్ని కథల్ని తప్పక చెప్పాల్సిందే. దేశానికి సంబంధించిన కథలు, అమరవీరుల త్యాగాలను చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ‘ఆపరేషన్ సింధూర్’ ఘటనల స్ఫూర్తితో ‘యాక్షన్ కింగ్’ అర్జున్ సర్జా దర్శకత్వంలో ‘ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్’ పతాకంపై అనూప్ మోహన్ ఓ సినిమాని నిర్మించనున్నారు. అర్జున్ సర్జా కెరీర్‌లో ఇదొక ప్రతిష్టాక్మ చిత్రం కానుంది. అతని కెరీర్‌లో ఇది 175వ ప్రాజెక్ట్. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు, ప్రారంభోత్సవం అయోధ్యలో జరిగింది. ఈ బహుభాషా చిత్రం సమకాలీన భారత చరిత్రలోని ఒక కీలక ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరించనుంది.

భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఒకటైన అయోధ్యలో జరిగిన ఈ కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు, విశిష్ట అతిథులు హాజరయ్యారు. అర్జున్ సర్జా తన భార్య నివేదిత అర్జున్‌తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం’లో ప్రారంభ పూజ జరుపుకున్న మొదటి చిత్రమిదేనని, భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని చిత్ర బృందం పేర్కొంది.

అర్జున్ సర్జా, అనూప్ మోహన్‌ కాంబోలో రాబోతోన్న ఈ చిత్రంలో దర్శకుడిగా, ప్రధాన నటుడిగా ద్వంద్వ బాధ్యతల్ని అర్జున్ సర్జా నిర్వర్తించనున్నారు. విశ్రాంత భారత సైనికాధికారి మేజర్ విజయ్ భార్గవ్ రాసిన స్క్రీన్‌ప్లే ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన బలం. కర్తవ్యం, త్యాగం, ధైర్యం, జాతీయ భద్రత వంటి ప్రశ్నలతో రూపుదిద్దుకున్న ఈ కథనానికి అతని సైనిక నేపథ్యం ఒక పరిణితి చెందిన దృక్పథాన్ని అందిస్తుంది. ఈ సంఘటనలను కేవలం చారిత్రక ముఖ్యాంశాలుగా చూడకుండా, వాటిలోని మానవ కోణాలను, జాతీయ విపత్తు సమయాల్లో ఉద్భవించే సంకల్ప బలాన్ని ఈ చిత్రం అన్వేషించడానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయాన్ని వాస్తవికతతో, భావోద్వేగ లోతుతో, బాధ్యతా స్ఫూర్తితో చిత్రీకరించాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ఒక ప్రధాన హిందీ భాషా చిత్రంగా రూపొందించబడిన ఈ సినిమాను తొమ్మిది భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. తద్వారా దీని కథనం భాషా, ప్రాంతీయ సరిహద్దులను దాటి నలుమూలలా ఉన్న ప్రేక్షకులకు చేరుతుంది. టైటిల్‌ని ఇంకా బయటకు రివీల్ చేయకుండా సీక్రెట్‌గానే మెయింటైన్ చేస్తున్నారు. ఓ ప్రత్యేక సందర్భంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర వివరాల్ని ప్రకటించాలని నిర్మాతలు భావిస్తున్నారు. డిసెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. భారతదేశ 81వ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15, 2027న థియేటర్లలో విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం కృషి చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us