ఘోర రోడ్డు ప్రమాదం.. తెల్లవారుజామున స్కార్పియో బోల్తా.. 13 మంది భక్తులు మృతి!
జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీహార్ నుంచి రాజరప్ప ఆలయానికి దైవదర్శనం కోసం బయలుదేరిన భక్తుల ప్రయాణం విషాదాంతంగా మారింది. రాంచీ-పాట్నా జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున స్కార్పియో వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..

రాంచీ, నవంబర్ 29: బీహార్‌లోని నలందా జిల్లా జంఘారో గ్రామానికి చెందిన 14 మంది భక్తులు స్కార్పియో వాహనంలో జార్ఖండ్‌లోని రాజరప్ప ఆలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో రామ్‌గఢ్ జిల్లాలోని జాతీయ రహదారి 33పై ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వాహనం ప్రమాదానికి గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 13 మంది అక్కడికక్కడే లేదా ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న వాహనం నుంచి బాధితులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం రామ్‌గఢ్ సదర్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంలో 13 మంది మృతదేహాలను ఆసుపత్రికి తీసుకురాగా, ఒకరు చికిత్స పొందుతున్నట్లు జిల్లా పోలీసు అధికారి వెల్లడించారు. గాయపడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జార్ఖండ్‌లో ఇటీవల కూడా ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవంబరు 5న ఖుంటి జిల్లాలోని కర్రా-తోర్పా ప్రధాన రహదారిపై జోనే-లుద్రు మోర్ సమీపంలో వేగంగా వచ్చిన ట్రైలర్ ట్రక్కు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మరణించారు. ఒక స్కూటర్‌దారుడు కల్వర్టు సమీపంలోని పొదల్లో పడిపోవడంతో అతడికి సహాయం చేసేందుకు కొందరు మహిళలు, చిన్నారులు అక్కడ ఆగారు. అదే సమయంలో తోర్పా వైపు నుంచి వేగంగా వచ్చిన 18 చక్రాల ట్రైలర్ వారిపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదం తర్వాత ట్రైలర్ డ్రైవర్, అతడి సహాయకుడు అక్కడి నుంచి పరారయ్యారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు ఆరోపించారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, పరారీలో ఉన్న డ్రైవర్‌ను అరెస్టు చేయాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, రహదారులపై క్రమం తప్పకుండా పోలీసు తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రైల్వే క్రాసింగ్ సమీపంలో రాస్తారోకో చేశారు. ఖుంటి ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. తాజాగా రాజరప్పకు వెళ్తున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురై 13 మంది మరణించడం జార్ఖండ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.




