ఎగిరే కారు రావడానికి ఇంకెంతో దూరం లేదు!

రిక్షాకే రెక్కలొచ్చి నక్షత్రయాత్ర చేసి...అంటూ ఓ సినిమాలో హీరోగారు పాటుచ్చుకుంటారు... ఆ తరంలో రోడ్లమీదన్ని రిక్షాలు తిరిగేవి కాబట్టి అలా పాడేసుకున్నాడు..ఇప్పుడన్నీ కార్లేనాయే!

ఎగిరే కారు రావడానికి ఇంకెంతో దూరం లేదు!
Follow us
Balu

|

Updated on: Aug 29, 2020 | 11:46 AM

రిక్షాకే రెక్కలొచ్చి నక్షత్రయాత్ర చేసి…అంటూ ఓ సినిమాలో హీరోగారు పాటుచ్చుకుంటారు… ఆ తరంలో రోడ్లమీదన్ని రిక్షాలు తిరిగేవి కాబట్టి అలా పాడేసుకున్నాడు..ఇప్పుడన్నీ కార్లేనాయే! అంగుళం రోడ్డు కనిపించకుండా అన్నీ అవే ఆక్యుపై చేస్తున్నాయే! ఇక నలభై ఫీట్ల రోడ్డు మీద సర్కస్‌ ఫీట్లే…ఆఫీసుకు టైమవుతుందన్న చిరాకు…..పక్కవాడు అడ్డదిడ్డంగా దూరిపోతున్నాడన్న కోపం….విసుగు.. చెప్పొద్దు కానీ నగర జీవి నరకాన్ని అనుభవిస్తున్నాడు… ఈ వాహనసాగరాన్ని దాటుకుని ఇంటికెళ్ళేసరికి చుక్కలు కనిపిస్తున్నాయి.. ఈ కష్టాలు కొన్నాళ్లే….అంటే రోడ్లు వైడ్‌ చేస్తున్నారనుకోకండి… అసలు రోడ్లతో పనే లేకుండా గాల్లో ఎగిరే కార్లు వచ్చేస్తున్నాయి… హ్యాపీ హ్యాపీగా- జాలీ జాలీగా అదే చుక్కల మధ్య చక్కర్లు కొట్టే అవకాశం చాలా దగ్గర్లోనే వుంది…ఆ కార్లు మన భారత్‌లోనే రాబోతున్నాయి.. నెదర్లాండ్స్‌కు చెందిన పర్సనల్‌ ఎయిర్‌ల్యాండ్‌ వెహికల్‌ అనే సంస్థ ఎగిరే కార్ల మ్యానుఫాక్చరింగ్‌ యూనిట్‌ను గుజరాత్‌లో పెట్టబోతున్నది.. వచ్చే ఏడాది ఎగిరే కార్ల తయారీ ప్రారంభం కాబోతున్నది.. ఇప్పటికే పాల్‌-వి సంస్థకు 110 ఎగిరే కార్ల తయారీకి ఆర్డర్లు వచ్చాయట. త్వరలో వీటిని గుజరాత్‌లోని ప్లాంట్‌లో తయారు చేసి యూరోపియన్‌ దేశాలతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ ఎగిరే కార్లలో మొత్తం రెండు ఇంజిన్లు ఉంటాయి. ఇద్దరు కూర్చునే వీలుంటుంది. రోడ్డు మీద 160 కిలోమీటర్ల వేగం, గాలిలో 180 కిలోమీటర్ల వేగంతో ఈ కారులో ప్రయాణించవచ్చు. కేవలం మూడు నిమిషాల్లో ఇది సాధారణ కారు నుంచి ఎగిరే కారులా మారగలదు. ఒక్కసారి దీని ట్యాంక్‌ను నింపితే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇదిలా ఉంటే జపాన్‌కు చెందిన స్కై డ్రైవ్‌ సంస్థ కూడా ఎగురుతున్న తమ కారుకు సంబంధించి వీడియోను విడుదల చేసింది. చుట్టూ అన్ని వైపులా.. పైన కూడా నెట్‌ కట్టి… అందులో టెస్ట్‌ డ్రైవ్‌ చేపట్టింది. ఒక మనిషి కూర్చొని ఉన్న ఈ కారు ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తులో నాలుగు నిమిషాలు గాల్లో తిరిగింది. 2023కల్లా పూర్తిస్థాయి ఎగిరే కారును అందుబాటులోకి తెస్తామంటోంది స్కై డ్రైవ్‌.