Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో కీలక ఘట్టం.. కార్బన్ డేటింగ్ కు అనుమతి నిరాకరణ.. వారణాసి కోర్టు కీలక తీర్పు..
వారణాసి జ్ఞనవాసి కేసులో హిందూ పిటిషనర్లకు ఎదురుదెబ్బ తగిలింది. శివ లింగానికి కార్బన్ డేటింగ్ చేయాలన్న పిటిషన్‌ను వారణాసి కోర్టు కొట్టివేసింది. జ్ఞానవాపీ మసీదులో బయటపడ్డది శివ లింగమా? లేక ఫౌంటేనా..

వారణాసి జ్ఞనవాసి కేసులో హిందూ పిటిషనర్లకు ఎదురుదెబ్బ తగిలింది. శివ లింగానికి కార్బన్ డేటింగ్ చేయాలన్న పిటిషన్‌ను వారణాసి కోర్టు కొట్టివేసింది. జ్ఞానవాపీ మసీదులో బయటపడ్డది శివ లింగమా? లేక ఫౌంటేనా తేల్చేందుకు శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలని హిందూ సంఘాలు వారణాసి కోర్టులో పిటిషన్ వేశారు. శివలింగానికి కార్బన్ పరీక్ష జరిపించాలని కోరుతూ జ్ఞానవాపి కేసులో ఫిర్యాదు దారులుగా ఉన్న నలుగురు హిందూ భక్తులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హిందూ సంఘాల పిటిషనుపై అభ్యంతరాలుంటే తెలపాలని మసీదు కమిటీని కోరింది. హిందూ పిటిషన్ పై స్పందించిన అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ కార్బన్ డేటింగ్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని కోర్టుకు తెలిపింది. కార్బన్ డేటింగ్ ఆచరణ సాధ్యం కాదని వాదించింది. ఫౌంటేయిన్‌కి కార్బన్ డేటింగ్ చేయడం సాధ్యం కాదని, రాయి అంటే ఆర్గానిక్ పదార్థం కాదని తెలిపింది. ఇప్పటికే జ్ఞానవాపి మసీదు ఘటనపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు శివలింగం ఉన్న ప్రదేశాన్ని పరిరక్షించాలని ఆదేశించింది.
దీంతో అటు హిందూ సంఘాల వాదనలు, ఇటు మసీదు కమిటీ నిర్ణయాన్ని విన్న వారణాసి కోర్టు హిందూ పిటీషనర్లకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. శివలింగం కాలాన్ని నిర్థరించడానికి కార్బన్ డేటింగ్ లేదా ఏదైనా ఇతర సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయించేందుకు అనుమతించడం లేదని స్పష్టం చేశారు వారణాసి జిల్లా కోర్టు జడ్జి విశ్వేశ. జ్ఞానవాపీ మసీదులో శివలింగం దొరికిన ప్రదేశాన్ని సీల్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను జడ్జి గుర్తు చేశారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎటువంటి శాస్త్రీయ విచారణకు అనుమతి ఇవ్వలేమని తీర్పునిచ్చారు. శివలింగం ఆకృతికి హాని చేసేలా ఉండే ఎలాంటి ప్రక్రియ అయినా సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కిందకే వస్తుందని వారణాసి కోర్టు అభిప్రాయపడింది.




కాగా.. జ్ఞాన్వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో జ్ఞాన్వాపి మసీదు- శృంగార్ గౌరీ ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేశారు. ప్రార్థన స్థలంలోని భూగర్భ నేలమాళిగలు, చెరువు, మూడు గోపురాలను సర్వే బృందం వీడియో తీసింది. అయితే మసీదులోని కొలనులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. ఈ సర్వే నివేదికను అడ్వకేట్ కమిషనర్ కోర్టులో సమర్పించారు. అయితే అది శివలింగం కాదంటూ మసీద్ కమిటీ వాదిస్తోంది.



