Car Seat Belt: కారు వెనక సీటులో కూర్చున్నా సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిందే.. ఆ ఘటనతో అలర్ట్ అయిన అధికారులు..
భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతోంది. యాక్సిడెంట్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. అంతే కాకుండా గాయపడుతున్న వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. ద్విచక్రవాహనాలు, కారు ప్రమాదాలు...

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతోంది. యాక్సిడెంట్స్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. అంతే కాకుండా గాయపడుతున్న వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. ద్విచక్రవాహనాలు, కారు ప్రమాదాలు సాధారణంగా మారాయి. రోడ్డుపై డ్రైవ్ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం చేసే ఏ చిన్న పొరపాటు అయినా అది తీవ్ర పరిణామానికి దారి తీస్తుంది. బైక్ పై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, కారు డ్రైవ్ చేసేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. ఈ క్రమంలో కార్లలో డ్రైవర్‌తో సహా మిగతా ప్రయాణికులందరు సీటు బెల్టు ధరించడాన్ని తప్పనిసరి చేసేందుకు అధికారులు సిద్ధణయ్యారు.
నవంబర్ 1 నుంచి ముంబయి నగరంలో ఈ నిబంధనలను అమలులోకి తీసుకు వస్తామని నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. గడువు లోపు తమ వాహనాల్లో అన్ని సీట్లకు సీటు బెల్టు సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని వాహనదారులకు సూచించారు. ఈ మేరకు పూర్తి వివరాలతో ఒక ప్రకటన విడుదల చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. నవంబర్ 1 తర్వాత ముంబయి రోడ్లపై ప్రయాణించే కార్లలో డ్రైవర్లు, ప్రయాణికులందరూ తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలి. సీటు బెల్టు ధరించకుండా వాహనం నడిపినా, సీటు బెల్టు పెట్టుకోని ప్రయాణికులను తీసుకెళ్లినా శిక్షార్హులేనని, వారిపై చర్యలు తీసుకుంటామని నగర పోలీసులు వివరించారు.




ఇటీవల.. ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ ఓ కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో సీటు బెల్టుల అంశం తెరపైకి వచ్చింది. కాగా.. కారు ప్రమాదం జరిగిన సమయంలో వెనక కూర్చున్న సైరస్ మిస్త్రీ సీటు బెల్టు ధరించలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సీటు బెల్టు ధరించే విషయం గురించి ప్రస్తావనకు వచ్చింది. కారులో వెనక సీట్లలో కూర్చునే ప్రయాణికులకూ సీటు బెల్టు తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ క్రమంలో ముంబయి పోలీసులు సీటు బెల్టు ధరించడాన్ని తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.



